
వివరాలు వెల్లడిస్తున్న డీసీపీ రంజన్ రతన్‌కుమార్
సాక్షి, సిటీబ్యూరో: ఆ ఇద్దరూ స్నూకర్ పార్లర్‌లో పరిచయమైన స్నేహితులు... విలాసాలకు అలవాటుపడటంతో డబ్బు కోసం నేరాలు చేయాలని భావించారు... ఇంటర్‌నెట్ ద్వారా నేరం ఎలా చేయాలన్నది తెలుసుకున్నారు... పంజగుట్ట పరిధిలో దోపిడీకి పాల్పడిన వీరు సీసీఎస్ ఆధీనంలోని ప్రత్యేక బృందానికి దొరికారు... నిందితుల్లో ఒకరు బీటెక్ గ్రాడ్యుయేట్ కావడం గమనార్హం. అదనపు డీసీపీ జె.రంజన్ రతన్‌కు మార్ సోమవారం వివరాలు వెల్లడించారు.
స్నూకర్ పార్లర్‌లో పరిచయం
నాంపల్లిలోని రెడ్‌హిల్స్ ప్రాంతానికి చెందిన మహ్మద్ షంషుద్దీన్ మొయినాబాద్‌లోని కళాశాలలో బీటెక్ పూర్తి చేశాడు. ప్రస్తుతం ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న అతను తన తండ్రి రఫీఖుద్దీన్ ప్రింటింగ్ వ్యాపారంలో కంప్యూటర్ డిజైనర్‌గా పని చేస్తున్నాడు. చదువుకునే రోజుల నుంచి జల్సాలకు అలవాటుడిన అతను మత్తు పదార్థాల వినియోగంతో పాటు తరచూ స్నూకర్ పార్లర్స్‌కు వెళ్ళడం, స్నేహితురాళ్ళతో కలిసి షికార్లు చేసేవాడు. ప్రస్తుతం తాను చేస్తున్న పనిలో వచ్చే ఆదాయం జల్సాలకు సరిపోకపోవడంతో తేలిగ్గా డబ్బు సంపాదించే మార్గాల కోసం అన్వేషించాడు. ఈ నేపథ్యంలో అతడికి ఓ స్నూకర్ పార్లర్‌లో మురాద్‌నగర్‌కు చెందిన ముస్తాఫా ఖాన్‌తో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి నేరాలు చేయాలని నిర్ణయించుకున్నారు.
యూట్యూబ్‌లో వీడియోలు చూసి
తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం స్నాచింగ్స్ చేయాలని నిర్ణయించుకున్న వీరు పోలీసులు, సీసీ కెమెరాలకు చిక్కకుండా జాగ్రత్తలు తీసుకోవాలని భావించారు. ఇందుకుగాను యూట్యూబ్‌లో ఉన్న ‘క్రైమ్ పెట్రోల్’ అనే కార్యక్రమానికి సంబంధించిన అనేక ఎపిసోడ్స్ చూసేవారు. ఇందులో చూపిన విధంగా ముందుజాగ్రత్త చర్యగా షంషుద్దీన్ తన ఎర్ర రంగు యమహాకు నల్లరంగు స్టిక్కరింగ్ చేయించాడు. నేరం చేస్తున్నప్పుడు సీసీ కెమెరాలో చిక్కినా బైక్ రంగు మార్పిడితో పోలీసులను తప్పుదోవపట్టించేందుకు పథకం పన్నాడు. ఈ నెల 12 మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఖైరతాబాద్‌లోని వెంకటరమణ కాలనీలోని కిరాణ దుకాణానికి వెళ్లిన వారు నిర్వాహకురాలు అనిత వద్ద వాటర్ బాటిల్ ఖరీదు చేస్తున్నట్లు నటిస్తూ రెక్కీ చేశారు. కొద్దిసేపటికి మళ్ళీ అక్కడికే వెళ్ళి బిస్కెట్ ప్యాకెట్ కొంటున్న నెపంతో ఆమె మెడలోని బంగారు గొలుసు లాక్కెళ్లారు.
అనేక సీసీ కెమెరాల అధ్యయనం...
బాధితురాలితో పెనుగులాటలో రెండు పేటలుగా ఉన్న ఆ గొలుసులో సగం అక్కడే పడిపోగా... మిగిలింది నిందితులకు చిక్కింది. దీనిని ముస్తాఫా తన తల్లికి ఇచ్చి తాకట్టు పెట్టమన్నాడు. తన స్నేహితురాలిదని, నగదు అత్యవసరమంటూ నమ్మబలికాడు. దీంతో ఆమె తన కుమార్తెతో కలిసి దారుస్సలాం బ్యాంక్‌లో రూ.20 వేలకు తాకట్టు పెట్టింది. ఆ సమయంలో బ్యాంకు అధికారులు గొలుసు తెగి ఉండటంపై అనుమానం వ్యక్తం చేయగా, పిల్లలు ఆడుకుంటూ తెంపారంటూ వారిని ఏమార్చింది. ఈ దోపిడీపై పంజగుట్ట ఠాణాలో కేసు నమోదు కావడంతో సీసీఎస్ స్పెషల్ టీమ్ ఇన్‌స్పెక్టర్ వి.శ్యాంబాబు తన బృందంతో దర్యాప్తు చేపట్టారు. ఘటనాస్థలికి సమీపంలో ఉన్న సీసీ కెమెరా పరిశీలించి సదరు వాహనం నెంబర్ గుర్తించారు. అక్కడ నుంచి వివిధ మార్గాల్లో ఉన్న అనేక కెమెరాలు అధ్యయనం చేసి అనుమానిత వాహనం రెడ్‌హిల్స్ ప్రాంతానికి వెళ్లినట్లు గుర్తించారు.
స్టిక్కరింగ్ తీసేసి...
దోపిడీ చేసిన వెంటనే షంషుద్ధీన్ తన బైక్ స్టిక్క ర్లు తీసేసి ఎరుపు రంగులోకి మార్చేశాడు. అయినా ఓ కెమెరాలో చిక్కిన అనుమానితుడి ఫొటో ఆధారంగా పోలీసులు రెడ్‌హిల్స్ ప్రాంతంలో గాలించారు. ఆ ప్రాంతంలో ఉన్న వారి నుంచి వివరాలు సేకరించి తొలుత షంషుద్దీన్ సోదరుడి ని పట్టుకున్నారు. అతడిచ్చిన సమాచారంతో షంషుద్దీన్, ముస్తఫాలను అరెస్టు చేశారు. వీరి వద్ద లభించిన రసీదుల ఆధారంగా దారుస్సలాం బ్యాంకు నుంచి తాకట్టు పెట్టిన బంగారు గొలుసు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల నుంచి వాహనం, రెండు సెల్‌ఫోన్లు సైతం రికవరీ చేశారు. ఈ నిందితులు మరికొన్ని నేరాలు సైతం చేసి ఉండచ్చని అనుమానిస్తున్న పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ముస్తఫా తల్లికి ఆ గొలుసు చోరీ సొత్తుని తెలుసా? లేదా? అనేది ఆరా తీస్తున్నామని అదనపు డీసీపీ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment