
ఆలమూరు పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుడు వెంకన్నను చూపుతున్న పోలీసులు
తూర్పుగోదావరి, ఆలమూరు (కొత్తపేట): ఒంటరి మహిళలే లక్ష్యంగా చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన నాతి వెంకటేష్ (వెంకన్న) ఆలమూరు పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక పోలీసు స్టేషన్‌లో ఎస్సై టి.క్రాంతికుమార్ అధ్యక్షతన బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మండపేట రూరల్ సీఐ కె.లక్ష్మణరెడ్డి కేసులకు సంబంధించి వివరాలను
వెల్లడించారు. ఆలమూరుకు చెందిన వెంకన్న కొన్నేళ్లుగా దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ఇప్పటికే నిందితుడు వెంకన్నపై భార్యపై హత్యాయత్నం కేసుతో పాటు మరో ఏడు కేసులు స్థానిక పోలీసు స్టేషన్‌లో నమోదయ్యాయి. అప్పటి నుంచి అతడి కోసం ఎస్సై క్రాంతికుమార్ ఆధ్వర్యంలో ఐడీ పార్టీ ప్రతినిధులు ఇళ్ల శ్రీనివాసు, సీహెచ్ యేసుకుమార్ తదితరులు గాలింపు చర్యలు చేపట్టారు. జొన్నాడ సెంటర్‌లో మంగళవారం సాయంకాలం అనుమానాస్పదంగా తిరుగుతున్న నిందితుడు వెంకన్నను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి గొలుసుల రూపంలో ఉన్న 190 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నిందితుడు వెంకన్నను స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరు పరచగా జడ్జి రిమాండ్ విధించారు.
పోలీసు శాఖలో కీలక అరెస్ట్‌లు
ఆలమూరు పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసులను ప్రతిష్టాత్మకంగా తీసుకుని రెండు నెలల కాలంలో కీలకమైన ఆరుగురు దారి దోపిడీ దొంగలను, ఒక గొలుసు దొంగను అరెస్ట్ చేసినట్టు మండపేట రూరల్ సీఐ కె.లక్ష్మణరెడ్డి తెలిపారు. మార్చి 31న దారి దోపిడీ దొంగలను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి నగదును స్వాధీనం చేసుకోగా, బుధవారం చైన్ స్నాచర్‌ను అదుపులోకి తీసుకుని బంగారాన్ని స్వాధీనం చేసుకుని నిబంధనల మేరకు బాధితులకు అప్పగించనున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment