బినామీ బాగోతం..! | Cheating Case Booked Against Former Minister Pattipatti's Close Aides | Sakshi
Sakshi News home page

బినామీ బాగోతం..!

Published Tue, Jul 23 2019 12:21 PM | Last Updated on Tue, Jul 23 2019 12:21 PM

Cheating Case Booked Against Former Minister Pattipatti's Close Aides - Sakshi

పుల్లారావుతో నిందితుడు మురళీకృష్ణ (ఫైల్‌)

 సాక్షి, నరసరావుపేట:  అక్రమ బినామీ టెండర్ల బాగోతం ఆలస్యంగా వెలుగు చూసింది. మాజీ మంత్రి అండదండలను అడ్డం పెట్టుకున్న యాజమాన్యం కార్మికులను పావులుగా వాడుకొని భారీ అక్రమార్జనకు పాల్పడింది. కోట్ల రూపాయలు బాధితులకు పంగనామం పెట్టింది. చివరకు డబ్బులు చెల్లించాలని బ్యాంక్‌ అధికారులు జారీ చేసిన నోటీసులతో బాధితులు లబోదిబోమంటూ సోమవారం పోలీసులను ఆశ్రయించారు.

మద్యం మాఫియా చేసిన మోసంపై వన్‌టౌన్‌ పోలీసులు  చీటింగ్‌  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ముఖ్య అనుచరుల మద్యం మాఫియా అక్రమ బాగోతం ఒకటి వెలుగు చూసింది.  అప్పటి అధికారాన్ని  అడ్డంపెట్టుకొని బినామీ టెండర్‌లు దక్కించుకున్న టీడీపీ నాయకులు కార్మికులను నమ్మించి నట్టేట ముంచారు. నాదెండ్ల మండలం సాతులూరు గ్రామానికి చెందిన తెల్లబాటి కోటేశ్వరరావు మద్యం దుకాణంలో గుమస్తాగా పనిచేస్తున్నాడు.

2017–19 సంవత్సరానికి గానూ ప్రభుత్వం మద్యం దుకాణాల నిర్వహణకు టెండర్‌లు పిలవగా మురళీకృష్ణ వైన్స్‌ యజమానులు, మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు అనుచరులైన నిమ్మల మురళీకృష్ణ, తన్నీరు సాంబశివరావులు కోటేశ్వరరావును పిలిచి దుకాణంలో పనిచేసే కొంత మంది కార్మికులతో బినామీ టెండర్‌ దరఖాస్తులు వేయించాలని కోరారు. దీంతో పనిచేసే వాళ్ల పేరిట సుమారు 230 దరఖాస్తులు వేయగా అందులో చిలకలూరిపేట నియోజకవర్గం, ప్రకాశం జిల్లాల్లో మద్యం దుకాణాలు నిర్వహించేందుకు 11 దుకాణాలు దక్కాయి.

అవన్నీ కార్మికుల పేరిట రావటంతో వారి ఆధార్, బ్యాంక్‌ పాస్‌పుస్తకాలను దుకాణ యజమానులు మురళీకృష్ణ, సాంబశివరావు తీసుకొని నరసరావుపేట బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఖాతాలు తెరిపించారు.  మద్యం లైసెన్స్‌ లను బ్యాంక్‌ లో గ్యారెంటీలుగా చూపించి ఒక్కొక్కరి పేరిట రూ.11.25 లక్షలు అప్పుగా తీసుకున్నారు. అప్పుతీసుకున్న వారికి ఒకరికి తెలియకుండా మరొకరికి షూరిటీ పెట్టించారు. రెండు సంవత్సరాల కాలపరిమితి పూర్తి అవ్వటంతో ఇటీవల బ్యాంక్‌ అధికారులు డబ్బులు చెల్లించాలని లైసెన్స్‌ హోల్డర్స్‌గా ఉన్న కార్మికులకు నోటీసులు జారీ చేశారు.

ఒక్కొక్క లైసెన్స్‌ హోల్డర్‌ రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు చెల్లించాలని నోటీసులో పేర్కొని ఉంది. దీంతో నిర్ఘాంతపోయిన వారంతా వెళ్లి బ్యాంకులో ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 11 మంది లైసెన్స్‌ హోల్డర్స్‌ సుమారు రూ. కోటి రూపాయల వరకు కట్టాలని తెలుసుకున్న బాధితులు ఈ విషయంపై దుకాణ యజమానులు మురళీకృష్ణ, సాంబశివరావును ప్రశ్నించగా వారు బెదిరింపులకు దిగారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించి తమకు జరిగిన మోసం పై వాపోయారు. ఈ మేరకు బాధితుల ఫిర్యాదుతో చీటింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ షేక్‌ బిలాలుద్దిన్‌ తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement