సాక్షి, హైదరాబాద్: మోసగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త అవతారాలు ఎత్తుతున్నారు. డబ్బు ఆశ చూపి అమాయకులను వంచిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు(కేపీహెచ్‌బీ)లో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. కరక్కాయల పేరుతో అమాయలకు టోపీ పెట్టారు. కోట్లలో డబ్బులు వసూలు చేసి బోర్డు తిప్పేశారు. కేపీహెచ్‌పీ రోడ్డు నంబర్‌వన్‌లో జరిగిన ఈ ఘరానా మోసం గురించి పోలీసులకు బాధితులు గోడు వెళ్లబోసుకున్నారు. న్యాయం చేయాలంటూ సోమవారం పోలీస్‌స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు.
సాప్ట్ ఇంటిగ్రేట్ మల్టీటూల్ ప్రైవేటు లిమిటెడ్ (ఎస్ఐఎంటీ) అనే సంస్థ కరకాయను తీసుకెళ్లి పౌడర్ చేసి అప్పగిస్తే వేయికి మూడు వందలు లాభం ఇస్తామంటూ స్థానికులను నమ్మించింది. యూట్యూబ్, యాప్‌లలో ప్రచారం చేసింది. కేజీ కరక్కాయలు వెయ్యి రూపాయలు చెల్లించి తీసుకెళ్లాలని నిబంధన పెట్టింది. మూడు వందలు లాభం వస్తుందన్న నమ్మకంతో చాలా మంది వేల రూపాయలు చెల్లించి భారీ మొత్తంలో కరక్కాయలు కొనుగోలు చేశారు. పొడి చేసిన తర్వాత దాన్ని తీసుకెళ్లేందుకు సదరు కంపెనీ ముందుకు రాకపోవడంతో వారికి అనుమానం వచ్చింది. తమ దగ్గర నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి వారు బిచాణా ఎత్తివేసినట్టు తెలియడంతో బాధితులు హతాశులయ్యారు. తాము మోసపోయామని తెలుసుకుని పోలీసులను ఆశ్రయించారు. వంచనకారులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేపట్టారు.
లక్షల్లో డబ్బులు కట్టాం..
కేజీ కరక్కాయ తీసుకెళ్లి పొడి చేసి ఇస్తే 1300 ఇస్తామని నమ్మించారని బాధితురాలు ఒకరు మీడియాతో చెప్పారు. తమతో పాటు తమ బంధువులు కూడా లక్షల్లో డబ్బులు కట్టి మోసపోయామని వాపోయారు. తమను నమ్మించేందుకు మొదటి 15 రోజులు డబ్బులు బాగానే ఇచ్చారని తర్వాత నుంచి పత్తా లేకుండా పోయారని తెలిపారు. కరక్కాయ పొడికి ఆయుర్వేదంలో మంచి డిమాండ్ ఉందని, దీనికి సంబంధించిన యాడ్స్ యూట్యూబ్ పోస్ట్ చేస్తే డబ్బులు ఇస్తామని కూడా మోసానికి పాల్పడ్డారని మరో బాధితుడు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment