
ఆసుపత్రిలో మృతుడి తల్లిదండ్రులను పరామర్శిస్తున్న మొహబూబా
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో స్కూల్ బస్‌పై రాళ్ల దాడి ఘటన మరువకముందే సోమవారం మరో బస్సుపై దుండగులు రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనలో తమిళనాడుకు చెందిన పర్యాటకుడు కన్ను మూశారు. పలువురు పర్యాటకులు, స్థానికులు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వ్యక్తి చెన్నైకి చెందిన ఆర్.తిరుమణి(22) గా గుర్తించారు.ఆదివారం సోఫియాన్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు హిజ్బుల్ ముజాయిద్దీన్ తీవ్రవాదులను సైన్యం మట్టుబెట్టడంతో దీనికి వ్యతిరేకంగా వేర్పాటువాదులు ఆందోళనలు నిర్వహించారు. జాతీయ రహదారిపై ఆందోళనకు దిగిన నిరసనకారులు ఒక్కసారిగా టూరిస్ట్‌ల వాహనాలపై రాళ్లదాడికి దిగారు. ఈ దాడిలో తిరుమణికి తీవ్రగాయాలు కావడంతో అతన్ని ఆసుపత్రికి తరలించగా అక్కడే మరణించాడు. ఈ ఘటనపై ఎస్పీ తెజిందర్ సింగ్ మాట్లాడుతూ.. దుండగులపై కేసు నమోదు చేశాము. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పేర్కొన్నారు.
సిగ్గుతో తలదించుకుంటున్నాం: మెహబూబా ముఫ్తి
రాళ్లదాడిలో మరణించిన చెన్నై పర్యాటకుడు తిరుమణి కుంటుంబనికి జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఈ విషాదకర ఘటన జరిగినందుకు క్షమించాలని తిరుమణి తల్లిదండ్రులను కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘ ఈ ఘటన జరిగినందుకు సిగ్గుతో తలదించుకుంటున్నాను. నిందితులను ఎట్టిపరిస్థితుల్లో విడిచిపెట్టం. వారికి తగిన శిక్ష పడేలా చేస్తాం’ అని తెలిపారు.
దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం: ఓమర్
రాళ్ల దాడిని ప్రతిపక్షనేత ఓమర్ అబ్దుల్లా సైతం తీవ్రంగా ఖండించారు.అమాయకులపై రాళ్ల దాడి చేయడం సిగ్గు చేటని తెలిపారు. నిరసనకారులు పద్దతి, వారి ఆలోచనలు సరైనవి కాదన్నారు.‘ తిరుమణి కుటుంబీకులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలి’ అని ఓమర్ అబ్దుల్లా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment