చిన్నారావు..చిక్కాడు! | Chinna Rao Arrest in Cheating Case Hyderabad | Sakshi
Sakshi News home page

చిన్నారావు..చిక్కాడు!

Published Mon, Jan 6 2020 10:08 AM | Last Updated on Mon, Jan 6 2020 10:08 AM

Chinna Rao Arrest in Cheating Case Hyderabad - Sakshi

చిన్నారావు ,హరీష్‌బాబు

సాక్షి, సిటీబ్యూరో: నిషేధిత మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌ సంబంధించి కేరళలో నమోదైన కేసుల్లో వాంటెడ్‌గా ఉండి, తొమ్మిదేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న హైదరాబాద్‌ వాసి స్వయంవరకు చిన్నారావు ఎట్టకేలకు చిక్కాడు. ఆ రాష్ట్రంలోని త్రిసూర్‌కు చెందిన క్రైమ్‌ బ్రాంచ్‌ అధికారులు గత వారం అతడిని అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఇతడి సహ నిందితుడైన మరో నగర వాసి మద్దినేని హరీష్‌బాబు గతంలోనే అరెస్టు కాగా... ఇతడిపై త్రిసూర్‌ పోలీసులు చార్జిషీట్‌ సైతం దాఖలు చేశారు. వీరు నిర్వహించిన నానో ఎక్సెస్‌ గ్రూప్‌ మోసాలపై సిటీ సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌లోనూ (సీసీఎస్‌) కేసులు నమోదై ఉన్నాయి. మద్దినేని హరీష్‌బాబు, స్వయంవరపు చిన్నారావు నగరం కేంద్రంగా నానో టెక్నాలజీ ఉత్పత్తులను దిగుమతి చేసుకుని విక్రయించే వ్యాపారం చేయాలని భావించారు. దీనికోసం హరీష్‌బాబు ఎండీగా, చిన్నారావు డైరెక్టర్‌గా వ్యవహరిస్తూ కొండాపూర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌ చిరునామాతో 2007లో ‘నా నో ఎక్సెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌’ సంస్థను ఏర్పాటు చేశారు. వీరిద్దరూ సమీప బంధువులే కావడం గమనార్హం.  

ఎన్‌రోల్‌మెంట్స్‌ పేరుతో వ్యాపారం...
తమ ఉత్పత్తులను మార్కెట్‌ చేసుకునేందుకుగాను వీరు కంపెనీ ఏజెంట్స్‌/డిస్ట్రిబ్యూటర్స్‌ ఎన్‌రోల్‌ చేసుకునే విధానాన్ని ప్రవేశపెట్టారు. దుబాయ్, ఫిలిప్పీన్స్‌లోనూ కొందరితో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుని ఫ్రాంచైజీ/ స్టాక్‌ పాయింట్స్‌ ఏర్పాటు చేశారు. ఈ కంపెనీ విక్రయిస్తున్న 11 నానో ప్రొడక్టŠస్‌ను కొరియా, షంజన్, చైనాల నుంచి దిగుమతి చేసుకుంది. వీటిని డిస్ట్రిబ్యూటర్స్‌ ప్రైజ్‌తో ఫ్రాంచైజీలకు సరఫరా చేస్తున్న కంపెనీ రెఫరల్‌ మార్కెటింగ్‌ విధానంలో రిటైల్‌ ఔట్‌లెట్స్, దుకాణాల ద్వారా విక్రయించేలా చేసింది. డిస్ట్రిబ్యూటర్‌గా ఎన్‌రోల్‌ చేసుకున్న వారికి స్టార్‌ ఏజెంట్, స్టార్‌ రూబీ, స్టార్‌ పెరల్, స్టార్‌ డైమండ్, డబుల్‌ డైమండ్, క్రౌన్‌ డైమండ్, ప్లాటినం డైమండ్, టిటానియమ్‌ డైమండ్‌ పేర్లతో హోదాలు ఇచ్చారు. ఈ ద్వయం తమ ఉత్పత్తులను విక్రయించడం కోసం మనీ సర్క్యులేషన్‌ స్కీమ్స్‌ అంతర్భాగంగా ఉండే మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌కు తెరలేపింది. సేల్స్‌ చేసిన డిస్ట్రిబ్యూటర్లకు 10 శాతం నుంచి 20 శాతం వరకు కమీషన్‌ ఇచ్చింది. వీరు ముద్రించిన బ్రోచర్‌లోనూ బిజినెస్‌ ప్లాన్‌గా డిస్ట్రిబ్యూటర్లు తమ కింద ఎంత మందిని చేర్చుకుంటే అంత లాభం వస్తుందని వివరించారు. తక్కువ కాలంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చంటూ ప్రచారం చేస్తూ 2007 డిసెంబర్‌ నుంచి చాలాకాలం పాటు మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌ వ్యవహారాలు సాగించారు. డిస్ట్రిబ్యూటర్లకు మంచి కమీషన్లు చెల్లిస్తూ ‘చెయిన్‌’ విస్తరించేలా చేసిన ఈ సంస్థ రాష్ట్రంతో పాటు కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రల్లోనూ కార్యకలాపాలు సాగించింది. పై స్థాయిలో ఎన్‌రోల్‌ చేయించుకున్న వ్యక్తికి ప్రతి స్థాయి నుంచి కమీషన్లు అందడంతో ఇది మల్టీలెవల్‌ మార్కెటింగ్‌ కిందికే వచ్చి చేరింది.  

2 లక్షలకు పైగా సభ్యులు, రూ.347 కోట్ల టర్నోవర్‌
నానో ఎక్సెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ 2011 వరకు 2,06,181 మందిని సభ్యులు/డిస్ట్రిబ్యూటర్లుగా చేర్చుకుంది. వీరికి ప్రతి నెలా భారీగా కమీషన్లు చెల్లిస్తూ వ్యాపారాన్ని విస్తరించింది. నాలుగేళ్ల కాలంలో రూ.347,33,41,631 వ్యాపారం చేసి తన డిస్ట్రిబ్యూటర్లలో ఒకరికి ప్లాటినం డైమండ్, ఇద్దరికి టైటానియం డైమండ్, 10 మందికి క్రౌన్‌ డైమండ్, 23 మందికి డబుల్‌ డైమండ్‌ హోదాలనిచ్చింది. చివరకు విషయం వెలుగులోకి రావడంతో హరీష్‌బాబు, చిన్నారావులతో పాటు ఇతర నిందితులపై దేశ వ్యాప్తంగా పలు క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. ఒక్క కేరళ రాష్ట్రంలోనే నమోదైన 236 కేసుల్లో వీరు వాంటెడ్‌గా ఉన్నారు. 2011లో వీరి గుట్టురట్టు చేసిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు హరీష్‌బాబును అరెస్టు చేశారు. ఈ కేసును సీసీఎస్‌ పోలీసులకు అప్పగించారు. అప్పటికే త్రిసూర్‌లో నమోదైన 90 కేసుల్లో ఇతడు నిందితుడిగా ఉండటంతో అక్కడికి తరలించిన పోలీసులు చార్జ్‌షీట్‌ సైతం దాఖలు చేశారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న సహ నిందితుడు   చిన్నారావు కోసం త్రిసూర్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ ముమ్మరంగా గాలించింది. ఎట్టకేలకు గతవారం యూసుఫ్‌గూడలో అతడిని పట్టుకుని కేరళ తీసుకెళ్లారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement