పట్టుబడిన ‘మృగాడు’ | Chittoor District Police Solved Varshitha Murder Case | Sakshi
Sakshi News home page

పట్టుబడిన ‘మృగాడు’

Published Sun, Nov 17 2019 6:59 AM | Last Updated on Sun, Nov 17 2019 6:59 AM

Chittoor District Police Solved Varshitha Murder Case - Sakshi

చిత్తూరు ఎస్పీ సెంథిల్‌కుమార్‌

సాక్షి, కురబలకోట/బి.కొత్తకోట: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన చిన్నారి వర్షిత (5) హత్య కేసు మిస్టరీ వీడింది. చాక్లెట్‌ ఇస్తానని ఆశ చూపి, చిన్నారిని తనతో తీసుకెళ్లి, లైంగిక దాడికి పాల్పడి ఆపై హత్య చేసినట్లు తేలడంతో ప్రజలు రగిలిపోతున్నారు. నిందితుడు పి.రఫీని శనివారం పోలీసులు అరెస్టు చేయడంతో ఓ వైపు హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు మరోవైపు ఇలాంటి మృగాడిని పబ్లిక్‌గా శిక్షించాలని అంటున్నారు. ఈనెల 7న బి.కొత్తకోట మండలం గుట్ట పాళ్యంకు చెందిన చిన్నారి వర్షిత కురబలకోట మండలంలోని చేనేతనగర్‌ కళ్యాణ మండపం వద్ద దారుణ హత్యకు గురవడం విదితమే. ఈ కేసును సవాలుగా తీసుకు న్న పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేశారు. నిందితుడి ఊహాచిత్రాన్ని గీసి పత్రికలకు విడుదల చేశారు. ఇది కొంతవరకు ‘క్లూ’గా ఉపకరించింది. మొలకవారిపల్లె గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో  నిందితుడు మదనపల్లె పట్టణం బసినికొండకు చెందిన రఫీగా గుర్తించారు. చాలెంజ్‌గా తీసుకుని ఎట్టకేలకు అతడిని పట్టుకున్నారు. కురబలకోట మండలంలోని అత్తవారింటికి వచ్చి నిందితుడు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తేలింది.

ఇతని గురించి..
నిందితుడు రఫీ లారీ డ్రైవింగ్‌ కూడా వచ్చు.లైసెన్స్‌ లేక క్లీనర్‌గా చెప్పుకునేవాడు. మదనపల్లె బసినికొండకు చెందిన ఇతను ఐదేళ్ల క్రితం మొలకవారిపల్లెకు చెందిన నూరుద్దీన్‌ (ఎర్రబాషా)కుమార్తె షాహిదాను పెళ్లి చేసుకున్నాడు. ఆరునెలలకే ఇతని తీరు, నడవడిక నచ్చక పుట్టింటికి చేరింది. పెళ్లాం, పిల్లలను పెద్దగా పట్టించుకునే వాడు కాదు. చెడు అలవాట్లు ఉన్నాయి. ఏడాదిన్నర వయస్సున్న కుమారుడు సయ్యద్‌ అలీ ఉన్నాడు. ఇరుగు పొరుగు వారితో పాటు ఊరివారితో రఫీ పెద్దగా కలిసేవాడు కాదు. అప్పుడప్పుడూ అత్తారింటికి వచ్చివెళ్లేవాడు. ఇలా వచ్చి ఈ చిన్నారి దారుణ హత్యకు పాల్పడ్డాడు. 

‘మృగాడి’ కోసం మూడు రాష్ట్రాల్లో వేట
బి.కొత్తకోట: సంచలనం కలిగించిన ఐదేళ్ల చిన్నారి వర్షిత దారుణ హత్య కేసులో హంతకుడి కోసం పోలీసు ప్రత్యేక బృందాలు మూడు రాష్ట్రాల్లో తీవ్రంగా గాలించాయి. ప్రాంతాలు మారుతూ వచ్చిన హంతకుడు చివరకు పట్టుబడక తప్పలేదు. వర్షితను హత్య చేశాక రఫీ ఎవరికీ అనుమానం కలగకుండా గుండుకొట్టించుకుని పరారయ్యాడని గుర్తించారు. సీఎం ఆదేశాలతో జిల్లా ఎస్పీ సెంథిల్‌కుమార్‌ ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు. మూడు ప్రత్యేక పోలీసు బృందాలతో హంతకుడి కోసం వేట మొదలైంది. పొరుగు రాష్ట్రాల్లో సైతం వేట సాగించాయి. రఫీ ఇక్కడి నుంచి పరారై తెలంగాణలోని భద్రాచలంలో ఉన్నట్టు గుర్తించిన రెండు బృందాలు అక్కడికి వెళ్లేసరికి నిందితుడు ఛత్తీస్‌ఘడ్‌లోకి జారుకున్నాడు. అక్కడ మావోయిస్టులకు పట్టున్న జగదల్‌పూర్, కుంట ప్రాంతాల్లో ఉన్నట్టు గుర్తించి అక్కడికి వెళ్లి సీఐల బృందాలు సాధారణ వ్యక్తుల్లా సంచరించాయి.

అయితే అక్కడ కూడా దొరికినట్టే దొరికి తెలంగాణలోని చింతూరుకు రఫీ పారిపోయాడు. ఈ సమయంలో మదనపల్లె రూరల్‌ ఎస్‌ఐ దిలీప్‌కుమార్, హెచ్‌సీ దేవా, పీసీ ప్రకాష్‌ అందించిన సాంకేతిక సహకారం ఉపకరించింది. నిందితుడు మళ్లీ మనరాష్ట్రంలోకి వచ్చాడని తెలుసుకున్నారు. విజయవాడ, చిలకలూరిపేట, ఒంగోలు, నెల్లూరు, తిరుపతిలో సంచరిస్తూ పుంగనూరు చేరుకున్నాడు. అక్కడి నుంచి మదనపల్లె–పుంగనూరు మార్గంలోని 150వ మైలు వద్ద ఉండగా రఫీ పోలీసులకు పట్టుబడ్డాడు. మొత్తం మీద మూడు రాష్ట్రాల్లో 3వేల కిలోమీటర్లకు పైగా వాహనాల్లో పోలీసులు బృందాలు ప్రయాణించాల్సి వచ్చింది. రఫీని అరెస్ట్‌ చేయడంలో కీలకంగా పనిచేసిన సీఐలు సురేష్‌కుమార్, అశోక్‌కుమార్, సాధిక్‌ అలీ, ఎస్‌ఐలు సుకుమార్, దిలీప్‌కుమార్‌కు ప్ర త్యేక రివార్డులు ఇస్తామని ఎస్పీ ప్రకటించారు. 
  
చిన్నారిని చిదిమేసి..పై నుంచి విసిరేశాడు
కురబలకోట : పెళ్లికి తన తల్లిదండ్రులతో వచ్చిన చిన్నారి వర్షితను నిందితుడు రఫీ కల్యాణ మండపం ప్రహారీ గోడ నుంచి 23 అడుగుల దిగువన ఉన్న ఆవలివైపు విసిరేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. సంఘటన జరిగిన రోజు రాత్రి కల్యాణ మండపంలో 9.54 గంటలకు చిన్నారి వెంట నడచిన నిందితుడు 10.15 గంటలకు తిరిగి ఒక్కడే వచ్చాడు. లైంగికదాడి, హత్య.. నిమిషాల వ్యవధిలోనే అయిందని పోలీసుల దర్యాప్తులో తేలింది.

వర్షిత హత్యోదంతం కలచి వేసింది 
కురబలకోట : ‘‘చిన్నారి వర్షితను మా ఇంటాయన రేప్‌ చేసి చంపేయడం నన్ను తీవ్రంగా కలచి వేస్తోంది..నేనూ ఒక బిడ్డ తల్లినే కదా..బిడ్డ ఎవరిౖMðనా బిడ్డే.. ఆయన క్షమించరాని నేరం చేశాడు..అతడిని ఏం చేసినా బాధపడను..’’ అని నిందితుడు పి.రఫీ భార్య పి. షాహీదా వ్యాఖ్యానించింది. శనివారం అతన్ని పోలీసులు అరెస్టు చేసిన విషయంపై విలేకరులు వారింటికి వెళ్లి పరిశీలించినప్పుడు మరికొంత సమాచారం లభించింది. వీరికి స్వంత ఇల్లు కూడా లేదు. తల్లిదండ్రులు కూలి పనులతో కాలం వెళ్లదీస్తున్నారు. ఐదేళ్ల క్రితం ఎవరో చెప్పిన మాటలు విని అతనికి ఇచ్చి పెళ్లి చేసినట్లు చెప్పారు. ఆరునెలలు కూడా షాహీదా రఫీతో ఉండలేకపోయింది.  పెళ్లి అయిందనే మాటేగానీ ఏనాడూ పట్టించుకోలేదని తనను, బిడ్డను పట్టించుకోలేదని షాహీదా కన్నీటిపర్యంతమైంది. ఇప్పుడింత దారుణానికి పాల్పడం ఎంతో బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేసింది.

ఇలాంటోడని తెలీదు
మా అల్లుడు రఫీ ఇలాంటోడని తెలీదు. తెలిసుంటే అసలు ఇంటìకి కూడా రానిచ్చేవా ళ్లం కాదు. చిన్న బిడ్డలు దేవునితో సమానమంటారు. అట్లాంటి బిడ్డను అట్లా చేయడానికి వాడికెట్లా మనసొప్పిందో తెలియదు. మాకు, ఊరికి కూడా చెడ్డపేరు తెచ్చాడు. ఇలాంటి వాడిని ఏం చేసినా మేము కూడా బాధపడం 
–నూరుద్దీన్, నిందితుడి రఫీ మామ, 
అంగళ్లు, కురబలకోట   

తెల్లారి ఆరుకే గుండు కొట్టించుకున్నాడు
చిన్నారి వర్షిత హత్య కు గురైన మరుసటి రోజు పొద్దున్నే 6గంట లకే రఫీ అంగళ్లులోని మా సెలూన్‌కొచ్చాడు. గుండుకొట్టమన్నాడు. జుత్తు పెరగలేదు కదా అని అడిగా. గుండు కొట్టిస్తే వెంట్రుకలు బాగా వస్తాయి కదా అని అన్నాడు. దీంతో రఫీకి గుండుతోపాటు షేవింగ్‌ చేసి పంపా. ఆ తర్వాత ఇతనే వర్షితపై అఘాయిత్యం చేసి హత్య చేశాడని తెలిసి దిగ్బ్రాంతి చెందాను. òవీడే హంతకుడని తెలిసుంటే తుక్కురేగ్గొట్టి ఉంటాం. –వెంకట్రమణ, సెలూన్‌ షాపు నిర్వాహకుడు

రెండు రోజులకే గుర్తించాం
చిన్నారి వర్షిత హత్య జరిగిన రెండు రోజులకే రఫీని అనుమానించాం. సోషల్‌ మీడియా, పత్రికల్లో వచ్చిన ఫొటోలు ఆధారంగా గుర్తించాం. ఇతను పెళ్లి చేసుకున్నది మాఊరిలోనే. అప్పడప్పుడూ అత్తారింటికి వచ్చివెళ్లేవాడు. ఊరివాళ్లతో పెద్దగా కలిసేవాడు కాదు. ఇతని వేసుకున్న ఎర్ర చెప్పులు, బట్టలు, నడక, ఎత్తు, లావును బట్టి గుర్తించాం. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాం. తీగలాగితే డొంక కదిలింది.
–సిద్ధల కిరణ్, మొలకవారిపల్లె, కురబలకోట

ఆనాడు అలా చేసింటే...వరి్షత బతికి ఉండేది
ఏడాదిన్నర క్రితం రఫీ అంగళ్లులోని ఓ వాటర్‌ ప్లాంట్‌లో కొన్నాళ్లు పని చేశాడు. పక్కనున్న నర్సరీలో పనిచేసే ఒకామె కూతురు 12 ఏళ్ల బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఆరోజు గ్రామస్తులు అతడిని చితకబాది వదిలేశారు. ఆరోజే పోలీసులకు పట్టించి కఠినంగా శిక్షించి ఉంటే ఈనాడు వర్షిత మానవ మృగం చేతిలో బలైంది. తలచుకుంటేనే రక్తం సలసలా మరిగిపోతుంది.     ––ఎస్‌.హరికుమార్‌రెడ్డి, మొలకవారిపల్లె, కురబలకోట మండలం
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement