సాక్షి, ముంబై : ముంబైలో పరువు హత్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన మాట వినలేదనే ఆగ్రహంతో కన్న కూతురుని అతి దారుణంగా హత్య చేసి, ముక్కలు చేసి సూట్‌కేసులో పెట్టి తరలిస్తుండగా పట్టుబట్టాడో తండ్రి. తన మాట విననందుకే ఆమెను హతమార్చానని పోలీసుల ప్రాథమిక విచారణలో నిందితుడు అంగీకరించాడు.
ముంబైలోని తిట్వాలాకు చెందిన అరవింద్ తివారీ(47) ఒంటరిగా ఉంటున్నాడు. హతురాలు సహా ప్రిన్సీ (22) సహా నలుగురు కుమార్తెలు, భార్య స్వగ్రామం జౌన్‌పూర్‌లో ఉంటారు. అయితే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ప్రిన్సీ నాలుగు నెలల క్రితం కుటుంబానికి సాయపడేందుకు ఒక ప్రయివేటు ఉద్యోగంలో చేరింది. అక్కడే ఒక వ్యక్తిని ఇష్టపడింది. ఇది నచ్చని తండ్రి ఆమెను హెచ్చరించాడు. కుటుంబం పరువు తీస్తున్నావని వాదించాడు. ఈ నేపథ్యంలో వారి మధ్య కొంత వాగ్వాదం జరిగింది. దీంతో ఆమెను క్రూరంగా హత్య చేశాడు. అక్కడితో ఆగలేదు. మృతదేహాన్ని మూడు భాగాలు చేసాడు. తలతో సహా రెండు భాగాలను సూట్ కేసులో కుక్కి ముంబై సమీపంలోని థానేలో ఆటోలో ఎక్కాడు. అయితే సూట్‌కేసు దుర్వాసన రావడంతో ఆటో డ్రైవర్ తివారీని ప్రశ్నించాడు. దీంతో నిందితుడు సూట్‌కేసును ఆటోలోనే వదిలి పారిపోవడంతో అసలు విషయం వెలుగు చూసింది. కళ్యాణ్ రైల్వే స్టేషన్ సమీపంలో సీసీటీవీ ఫుటేజ్ సహాయంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నేరం తానే చేశానని ఒప్పుకున్నాడు. హతురాలి శరీర భాగాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు మిగిలిన ఇతర భాగాలకోసం విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment