గుంటూరు: పోలీసు శాఖలో కొందరు అధికారుల తీరు రోజురోజుకు ప్రశ్నార్థకంగా మారుతోంది. చివరకు శవాలను సైతం వదలకుండా దోచుకోవడంలో తాము మాత్రం తక్కువ తిన్నామా అన్నట్లు వ్యవహరిస్తూ పోలీసు శాఖ ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరిస్తున్నారు. అధికారులే నేరుగా రంగంలోకి దిగి దొంగల తరహాలో శవంపై ఉన్న బంగారు ఆభరణాలను చోరీ చేసిన ఘటన సభ్య సమాజం తలదించుకునేలా చేసింది. ఏకంగా అర్బన్ జిల్లా పరిధిలోని ఓ సీఐ తన చేతివాటం ప్రదర్శించి సుమారు 25 నుంచి 30 సవర్ల బంగారు ఆభరణాలను దర్జాగా తీసుకెళ్లి ఇంట్లో దాచుకున్నాడు. ఈ విషయమంతా మృతురాలి కుమార్తె అర్బన్ ఎస్పీని కలిసి ఫిర్యాదు చేయడంతో వెలుగు చూసింది.
ఘటన పూర్వాపరాలు...
అర్బన్ జిల్లా పరిధిలోని ఓ పోలీసు స్టేషన్ పరిధిలో 66 ఏళ్ల వయస్సు గల వృద్ధురాలు ఆమె నివాసంలో ఒంటరిగా నివాసం ఉంటుంది. గతేడాది మే 15న గుర్తు తెలియని అగంతకులు వృద్ధురాలిని తలపై మోది దారుణంగా హతమార్చారు. ఆపై మృతదేహాన్ని ఓ గదిలో పడేసి ఏసీ ఆన్‌చేసి ఇంటికి తాళాలు వేసి వెళ్లిపోయారు. మూడు రోజుల అనంతరం విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఏసీ పనిచేయక ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన స్థానికులు సమీపంలోని పోలీసులకు సమాచారం అందించడంతో అప్పుడు ఆ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న సీఐ, మరో కానిస్టేబుల్‌తో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని తాళాలు పగులగొట్టి ఇంట్లోకి వెళ్లారు. రక్తపు మడుగులో వృద్ధురాలి మృతదేహం పడి ఉండటంతో హత్య జరిగిందనే నిర్థారణకు వచ్చారు. ఈక్రమంలో మృతురాలు శరీరంపై, ఇంట్లో ఉన్న సుమారు 25 నుంచి 30 సవర్ల బంగారు ఆభణాలను సదరు సీఐ సర్దేశాడు. ఆవిషయాన్ని ఎక్కడా పోలీసుల రికార్డుల్లో నమోదు చేయలేదు. కేవలం హత్య కేసు మాత్రమే నమోదు చేసి చేతులు దులిపేసుకున్నారు. విషయాన్ని కృష్ణా జిల్లా దొగ్గంపూడిలో నివాసం ఉంటున్న వృద్ధురాలి కుమార్తెకు సమాచారం అందించడంతో హుటాహుటిన గుంటూరు చేరుకుని రక్తపు మడుగుల్లో విగతజీవిగా పడి ఉండటం చూసి కన్నీటి పర్యంతమైంది.
వెలుగు చూసిందిలా ....
ఈక్రమంలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి మృతురాలి తల్లికి అప్పగించారు. అంత్యక్రియల అనంతరం ఇంట్లో పరిశీలించగా ఎక్కడా బంగారు ఆభరణాలను కనిపించలేదు. ముందు రోజు కూడా తన తల్లి ఒంటిపై బంగారు ఆభరణాలు ఉన్నట్లు స్థానికుల ద్వారా తెలుసుకుంది. ముందుగా తాళాలు పగులగొట్టి ఇంట్లోకి వెళ్లింది. సీఐ మాత్రమే కావడంతో ఆయన తీరుపై అనుమానం వచ్చి పలుమార్లు సీఐను కలిసి ప్రశ్నించినా తనకు బంగారం విషయం తెలియదని, మళ్లీ ఇదే విషయాన్ని అడిగితే నిన్ను అనుమానించి కేసులో నిందితురాలిగా తేల్చాల్సి ఉంటుందని భయభ్రాంతులకు గురి చేశారని తెలిపింది. దీంతో బాధితురాలు గత్యంతరం లేని స్థితిలో ఇటీవల అర్బన్ ఎస్పీ సీహెచ్ విజయరావును కలిసి జరిగిన దొంగతనాన్ని వివరించి చెప్పడంతో అవాక్కైన ఎస్పీ విచారణకు ఆదేశించారు.
విచారణలో నమ్మలేని నిజాలు...
అర్బన్ జిల్లా పరిధిలోనే ప్రస్తుతం సదరు సీఐ విధులు నిర్వహిస్తుండటంతో నిఘా వర్గాల ద్వారా ఎస్పీ సమాచారం సేకరించి విచారణకు ఆదేశించారు. విచారణ అధికారిగా ఓ సీఐను నియమించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐను ఇటీవల ఓ పోలీసు స్టేషన్‌కు పిలిచించి విచారణ అధికారిగా వ్యవహరిస్తున్న సీఐ రెండు రోజులపాటు విచారించారు. చివరకు తన వద్ద నెక్లస్‌తోపాటు ఓ గాజు ఉన్నట్లు అంగీకరించి అప్పగించారని సమాచారం. మిగిలిన బంగారం కూడా సదరు సీఐ వద్దే ఉండి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటన పోలీసు శాఖలో అంతర్గతంగా చర్చనీయాంశంగా మారింది. ఇలాటి సీఐలపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటే మరో అధికారి ఇలాంటి చర్యలకు పాల్పడకుండా ఉంటారని చర్చించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment