
సాక్షి, భీమవరం : ప్రయివేట్ కంపెనీలో సివిల్ ఇంజనీరుగా పనిచేస్తూ విజ్ఞానంతో వికృత చేష్టలకు పాల్పడ్డాడో ప్రబుద్ధుడు. ఫేస్‌బుక్‌లో పరిచయమైన యువతి ఫోటోలను మార్ఫింగ్ చేసి ఆపై బ్లాక్ మెయిలింగ్‌కు దిగి మనోవేదనకు గురిచేశాడు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గానికి చెందిన యువతి భీమవరంలోని ఇంజనీరింగ్ కళాశాలలో చదువుకుంది. అనంతపురం జిల్లా మడకశిరకు చెందిన సేనపరిగి హిమతేజకు ఫేస్‌బుక్ ద్వారా పరిచయం అయింది. ఇది స్నేహంగా మారడంతో ఆమె తన ఫోటోలు పంపింది. ఒకరినొకరు ఇష్టపడ్డారు. తర్వాత అతడు మంచివాడు కాదని తెలుసుకుని ఫేస్‌బుక్ పరిచయాన్ని ఆపేసి, మాట్లాడటం మానేసింది.
ఆరు నెలల తర్వాత యువతి పేరుపై ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్‌లో నకిలీ అకౌంట్స్ క్రియేట్ చేశాడు. ఆమె స్నేహితురాళ్లకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి తర్వాత ఆ యువతి ఫోటోలను మార్ఫింగ్ చేసి వాళ్లకు పంపాడు. వారంతా ఆమెకు ఫోన్ చేసి ఇలాంటి ఫోటోలు అప్‌లోడ్ చేస్తున్నావేంటని అడగటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో బాధిత యువతి భీమవరం పోలీసులకు ఈ నెల 8న ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. నెల్లూరు జిల్లా నాయుడుపేటలో సివిల్ ఇంజనీరుగా పనిచేస్తున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment