భోపాల్: శివపురి జిల్లా ఆస్పత్రిలో చోటు చేసుకున్న ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ తీవ్రంగా స్పందించారు. వైద్యం కోసం వచ్చిన రోగిపై ఆస్పత్రి సిబ్బంది చూపిన నిర్లక్ష్యంపై ఆయన మండిపడ్డారు. ఆస్పత్రిలో మృతి చెందిన రోగి మృతదేహం కంటిని చీమలు పీక్కుతుంటున్నా పట్టించుకోకుండా.. నిర్లక్ష్యం వహించిన సిబ్బంది వైఖరిపై ముఖ్యమంత్రి విచారణకు ఆదేశించారు. ఈ మేరకు ఆయన ట్విటర్ వేదికగా స్పందించారు. ‘స్థానిక శివపురి జిల్లా ఆస్పత్రిలో రోగి మృతదేహం కంటిని చీమలు కుట్టేస్తున్నాఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం చేయడం దారుణం. ఇటువంటి ఘటనలు చోటుచేసుకోవడం మానవత్వానికి సిగ్గుచేటు. ఈ ఘటనకు కారణమైన వారిని ఎట్టి పరిస్థితుల్లో సహించకూడదు. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని ఆస్పత్రి అధికారులను ఆదేశిస్తున్నాను. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటానని’ కమల్‌నాథ్ ట్విట్ చేశారు.
తీవ్రమైన క్షయ వ్యాధితో బాధపడుతున్న బాల్‌చంద్ర లోధి (50) మంగళవారం ఉదయం శివపురి జిల్లా ఆస్పత్రి చేరారు. ఆస్పత్రిలో చేరిన ఐదు గంటల లోపు ఆ రోగి మృతి చెందారు. దీంతో అదే వార్డులో చికిత్స పొందుతున్న సదరు రోగులు ఆస్పత్రి సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న సిబ్బంది మృతదేహన్ని తీయటం పట్ల నిర్లక్ష్యం వహించారు. అయితే మృతదేహాన్ని మార్చరీకి తరలించకుండా అదే వార్డులో ఓ మూలగా పడేశారు. ఆ రోజు డ్యూటీలో ఉన్న డాక్టర్ కూడా రోగి మృత దేహాన్ని ఏ మాత్రం పట్టించుకోలేదు. దీంతో ఆ మృతదేహంపై చీమలు పాకుతూ.. కళ్లను పీకే ప్రయత్నం చేశాయి.
దీంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న మృతుడి (బాల్‌చంద్ర లోధి) భార్య ఆ చీమలను పారదోలింది. ఈ సంఘటన మొత్తాన్ని రికార్డు చేసిన కొంతమంది సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో ఆ వీడియో వైరల్ అవుతోంది. ఇటువంటి హృదయవిదారకమైన ఘటన చోటుచేసువడానికి కారణమైన ఆస్పత్రి సిబ్బందిపై సీఎం కమల్‌నాథ్ తీవ్రంగా స్పందించారు. తక్షణమే విచారణ జరిపి ఘటనకు సంబంధించిన వివరాలు తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. ఇక ఈ ఘటనకు సంబంధించి ఓ సర్జర్‌తో సహా అయిదుగురు మెడికోలపై సస్పెన‍్షన్ వేటు పడింది.
Comments
Please login to add a commentAdd a comment