ముందు భాగం నుజ్జయిన కళాశాల బస్సు
రాజోలు : డ్రైవర్ నిర్లక్ష్యంతో అదుపు తప్పిన కళాశాల బస్సు.. మదపుటేనుగులా విద్యార్థులతో పాటు రోడ్డుపై వెళుతున్న వారిని భీతావహులను చేసింది. 5గురు విద్యార్థులు సహా 8 మందిని తీవ్రంగా గాయపరిచింది. శనివారం ఉదయం 8.30 గంటలకు తాటిపాక నుంచి ఓడలరేవు వెళ్తున్న బీవీసీ ఇంజనీరింగ్ కాలేజీ బస్సు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న మొదట ట్రాక్టర్‌ను, మోటార్ సైకిల్‌ను, సైకిల్‌ను, తర్వాత రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. స్తంభం ముక్కలై బస్సు మీద పడడంతో విద్యార్థులు ప్రాణభయంతో హాహాకారాలు చేశారు. ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ కర్రి సత్యనారాయణ, మోటార్‌సైకిల్‌పై కుమారుడిని పదవ తరగతి పరీక్షకు తీసుకు వెళ్తున్న దీపాటి జగదీష్, సైకిలిస్ట్ రుద్రా సత్యనారాయణ, విద్యార్థులు పుచ్చకాయల దుర్గాప్రసాద్, దొడ్డా జ్యోతి శిరీష, మల్లిపూడి రాజేష్, కానూరి నరేష్, ప్రభుతేజ తీవ్రంగా గాయపడ్డారు.
బస్సు ముందు భాగం నుజ్జునుజ్జైంది. బస్సు డ్రైవర్ పరారయ్యాడు. గాయపడ్డ వారిలో కొందరిని స్థానిక ఎంఎస్ ఆస్పత్రికి , కొందరిని అమలాపురం కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని ఆర్డీవో పి.వి.రమణ, సీఐ క్రిష్టోఫర్, ఎస్సై లక్ష్మణరావు పరిశీలించారు. ఆస్పత్రిలో క్షతగాత్రులకు అందిస్తున్న వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు. ఘటన సమయంలో విద్యుత్ నిలిచిపోవడంతో 30 మంది విద్యార్థులకు పెను ముప్పు తప్పిందని స్థానికులు తెలిపారు. సఖినేటిపల్లి నుంచి ఓడలరేవు బయలుదేరిన బస్సును ప్రారంభం నుంచి డ్రైవర్ నిర్లక్ష్యంగా నడిపాడని, సోంపల్లి, పొదలాడ సమీపంలోనే కొద్దిలో ప్రమాదం తప్పిందని విద్యార్థులు చెప్పారు. రాజోలు, పి.గన్నవరం వైఎస్సార్ సీపీ కోఆర్డినేటర్లు బొంతు రాజేశ్వరరావు, కొండేటి చిట్టిబాబు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment