సీఐ ఎదుట తన గోడు విన్నవించుకుంటున్న సత్యనాగకుమారి
గన్నవరం: నవమాసాలు మోసి కని, పెంచి ప్రయోజకుడిని చేసిన ఒక్కగానొక్క కొడుకు విదేశాలకు వెళ్లి పట్టించుకోవడం లేదు...నమ్మిన బంధువులు ఆస్తులు కాజేసి నట్టేట ముంచారు..భర్తను కొల్పోయిన తాను నిలువనీడ లేక వృద్ధాప్యంలో రోడ్డున పడ్డానని ఓ వృద్ధురాలు బోరున విలపించడం చూపరులకు కంటతడి పెట్టించింది. జన్మనిచ్చిన తల్లి అనాథగా మరణించకుండా కనీసం వృద్ధాశ్రమంలోనైన చేర్పించే విధంగా తన కుమారుడితో మాట్లాడి న్యాయం చేయాలని ఆమె పోలీసులను శుక్రవారం వేడుకుంది. బాధిత వృద్ధురాలు తెలిపిన వివరాలు.. స్థానిక సొసైటీపేటకు చెందిన మరిమెళ్ల సత్యనాగకుమారి భర్త సుమారు 17 ఏళ్ల క్రితం చనిపోయాడు. ఆయన మరణంతో వచ్చిన ప్రమాద బీమా నగదు రూ.6 లక్షలతో కొడుకుని లండన్‌లో ఎంఎస్ చదివించింది.
చదువు అనంతరం అతను ప్రేమ వివాహం చేసుకుని ఉద్యోగరీత్యా అమెరికాలో స్థిరపడ్డాడు. అదే సమయంలో ఆమె సోదరుడైన ఫణింద్రకు వ్యాపారంలో తీవ్ర నష్టాలు రావడంతో దివాల తీశాడు. అతను చేసిన అప్పులకు తను హామీగా చెక్కులు ఇచ్చింది. అప్పులిచ్చిన వారి నుంచి ఒత్తిడి ఎక్కువైంది. అంతే కాకుండా పుట్టింటివారు ఇచ్చిన ఇంటిని జప్తు చేసేందుకు ప్రయత్నించడంతో వియ్యంకుడు ఒత్తిడి మేరకు తన కోడలు దీప్తి పేరున ఆస్తి రాసింది. కుమారుడు పట్టించుకోకపోవడంతో బంధువుల ఇంటి వద్ద తలదచుకుంటుంది. అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నానని, తన కుమారుడితో మాట్లాడి వృద్ధాశ్రమంలోనైన చేర్పించాలని సీఐ రవికుమార్ ఎదుట తన గోడు విన్నవించుకుంది. ఆమె ఫిర్యాదుపై స్పందించిన సీఐ విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment