భూమి కోసం ఘర్షణ | Conflict In Land Dispute In Karimabad | Sakshi
Sakshi News home page

భూమి కోసం ఘర్షణ

Published Wed, Aug 28 2019 11:03 AM | Last Updated on Wed, Aug 28 2019 11:05 AM

Conflict In Land Dispute In Karimabad - Sakshi

దాడిలో గాయపడిన వ్యక్తులు

సాక్షి, కరీమాబాద్‌ : వరంగల్‌ 21వ డివిజన్‌ కరీమాబా ద్‌ నానమియాతోట వద్ద వివాదాస్పద భూమి విషయమై మంగళవారం ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. బాధిత కుటుంబాలు, స్థాని కులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నానమియాతోటలోని సర్వేనెంబర్‌ 340, 341 లోని సుమారు ఎకరం భూమి తనదేనంటూ కరీమాబాద్‌కు చెందిన టీఆర్‌ఎస్‌ నాయకుడు, రియల్టర్‌ వొగిలిశెట్టి అనిల్‌కుమార్‌తో పాటు ఆయన అనుచరులు బాలకొంరెల్లి, లింగమూర్తి, సాధిక్, ఖాజా, రబ్బాని, రాజు రాతి ఖనీలు పాతేందుకు మంగళవారం ప్రయత్నించారు. దీంతో స్థానికంగా ఉన్న గుడిసెవాసులు అడ్డుకున్నారు.

ఈ క్రమంలో ఇరువర్గాల మద్య గొడవ జరగడంతో అనిల్‌కుమార్‌తో పాటు అతని అనుచరులు.. గుడిసెవాసులైన ఎండీ హసన్, ఎండీ ఆలం, ఎండీ అబ్బు, గౌసియాబేగం, ఎండీ బాబాపై పారతో దాడిచేయగా గాయపడ్డారు. వీరిని వెంటనే ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఇందులో ఎండీ హసన్‌ తీవ్రంగా గాయపడడంతో అతనిని గార్డియన్‌ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో మిల్స్‌కాలనీ పోలీసులకు జరిగిన సంఘటనపై ఫిర్యాదు చేసినట్లు గుడిసెవాసుల నాయకుడు ముక్కెర రామస్వామి తెలిపారు. కాందీశీకుల భూమి.. నానామియా తోటలోని 340, 341 సర్వే నం బర్లలోని భూమి కాందీశీకులదని, ఈ భూమి కోర్టు కేసులో ఉండగా ఇలా దాడి చేసి గాయపరిచారని రామస్వామి వివరించారు.

గాయపడిన వారిని సీపీఎం జిల్లా కార్యదర్శి వాసుదేవరెడ్డి, నాయకురాలు రత్నమాల పరామర్శించా రు. అలాగే మిల్స్‌కాలనీ సీఐ సత్యనారాయణ పూర్తి వివరాలు తీసుకున్నారు. ఇదిలా ఉండగా తమ కనీలు పాతేందుకు వెళ్తే అడ్డుకోవడంతో పాటు బాలకొంరెల్లి, సాదిక్, లింగమూర్తి, ఖా జాపాష, రబ్బాని నీలపై దాడిచేసి గాయపరిచినట్లు అనిల్‌కుమార్‌ తెలిపారు. ఇలాంటి సమస్య వస్తుందనే ఈ నెల 25న మిల్స్‌కాలనీ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.

భూమి ఎవరిదో తేల్చాలని తహసీల్దార్‌కు సూచించా..
వివాదాస్పదంగా మారిన కరీమాబాద్‌లోని నానామియాతోట వద్ద భూమి ఎవరిదో తేల్చాలని ఖిలావరంగల్‌ తహసీల్దార్‌ కిరణ్‌కుమార్‌కు సూచించాను. అప్పటివరకు ఎవరూ ఎలాంటి గొడవలకు దిగొద్దు. ఏది ఉన్నా సామరస్యంగా సమస్య పరిష్కరించుకోవాలి.
– నన్నపునేని నరేందర్, వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement