
తిరుమలగిరి: నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలం చింతలపాలెం పంచాయతీ కాంగ్రెస్‌కు చెందిన ఉప సర్పంచ్ దేపావత్ ధర్మానాయక్ (45) సోమవారం అర్ధరాత్రి దారుణ హత్యకు గురయ్యారు. పడుకున్న అతని మంచం కింద నాటు బాంబు పేల్చడంతో అక్కడికక్కడే మృతి చెందారు. రెండో భార్యే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. చింతలపాలెం పరిధిలోని నాగార్జునపేట తండాకు చెందిన ధర్మానాయక్.. మొదటి భార్య సావిత్రికి పిల్లలు లేకపోవడంతో ఆమె చెల్లెలు శిరీషను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ముగ్గురు సంతానం.
ఇద్దరి మధ్య వయస్సు భారీగా తేడా ఉండటంతో శిరీష తన భర్తతో సంసారం చేయడానికి అంతగా ఇష్టపడక పోయేది. దీంతో ఇదే తండాకు చెందిన ఆంగోతు రవితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. గతేడాది నవంబరులో వీరిద్దరు ఏపీలోని నంద్యాలకు పారిపోయారు. పెద్దలు సర్దిచెప్పి తిరిగి ఇంటికి తీసుకొచ్చినా వారి మధ్య సఖ్యత కుదరలేదు. ఈ క్రమంలో ధర్మానాయక్ సోమవారం రాత్రి తన ఇంట్లో పడుకున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు అర్ధరాత్రి మంచం కింద బాంబు పెట్టారు. ఒక్కసారిగా అది పేలడంతో అతని శరీరం ఛిద్రమైంది. లక్ష్మీబాంబులకు ఉపయోగించే పాస్పరస్ పదార్థాలను సేకరించారు.
Comments
Please login to add a commentAdd a comment