కోర్టు ఆదేశ పత్రాన్ని చూపుతున్న కళావతి
హైదరాబాద్ : తన భర్తకు వైరా ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తానని చెప్పి నమ్మించి, రూ.కోటి 20 లక్షలు తీసుకుని టిక్కెట్ ఇప్పించకపోగా తీవ్ర మానసిక వేదనతో చనిపోయేలా చేసిన కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ పెద్దలను ఖమ్మం జిల్లాకు చెందిన కళావతి డిమాండ్ చేశారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో బంజారా, లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కోళోత్ రవిచంద్ర చౌహాన్‌తో కలిసి పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. తన భర్త డాక్టర్ భూక్యా రాంజీ, ఖమ్మంలో శ్రీ హర్షిణి నర్సింగ్‌హోం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్వహిస్తూ పేదలకు, గిరిజనులకు ఎంతో సేవ చేశారని చెప్పారు.
ప్రజల్లో మంచి పేరున్న తన భర్తకు 2014 ఎన్నికల్లో ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే టిక్కెట్ ఇప్పిస్తానని నమ్మబలికి కోటీ 20 లక్షలను రేణుకాచౌదరి తీసుకున్నారని, వివిధ సమావేశాల నిర్వహణకు మరో కోటి వరకు అదనంగా ఖర్చు చేయించారని చెప్పారు. టిక్కెట్ ఇప్పించకపోగా, ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగితే కులం పేరుతో దూషించారని, గన్‌మెన్‌తో బయటకు వెళ్లగొట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మనో వేదనతోనే తన భర్త మృతిచెందారని చెప్పారు. ఆ తరువాత పలు మార్లు గిరిజన సంఘాల నాయకులతో, స్థానికులతో కలిసి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు ధర్నా చేసినట్టు చెప్పారు. పోలీసులను ఆశ్రయించడంతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారని, రాజకీయ ఒత్తిడితో దానిని నిర్వీర్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తాను న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్టు చెప్పారు.
కేసును రీఓపెన్ చేసి విచారించాలని గత నెల 6న కోర్టు ఆదేశించిందన్నారు. తనకు జరిగిన అన్యాయంపై ఎన్నోసార్లు కాంగ్రెస్ పెద్దలు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, జానారెడ్డి, మల్లు భట్టు విక్రమార్క, కుంతియాకు వివరించినట్టు చెప్పారు. వారు ఏమాత్రం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రేణుకాచౌదరిని పార్టీ నుంచి సస్పెండ్ చేసి, తాము మోసపోయిన నగదును వెంటనే ఇప్పించాలని కోరారు. ప్రస్తుతం ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ తన పిల్లలని సాదుకుంటున్నానని అన్నారు. ఇప్పటికైనా తనకు న్యాయం చేయకపోతే ఖమ్మం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదురుగా, హైదరాబాద్ గాంధీభవన్ ఎదురుగా ధర్నా చేస్తానన్నారు.
అప్పటికీ స్పందించకపోతే, ఢిల్లీలోని రాహుల్ గాంధీ ఇంటి ఎదురుగా దీక్ష చేస్తానని హెచ్చరించారు. ఢిల్లీలో రాహుల్‌గాంధీ ఇంటి ముందు ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు. బంజారా లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కేళోత్ రవిచంద్ర చౌహాన్ మాట్లాడుతూ .. గిరిజనులు, లంబాడీలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటారని చెప్పారు.
కేవలం రేణుకాచౌదరి కారణంగా గిరిజనులను కాంగ్రెస్ పార్టీ దూరం చేసుకోవడం సరికాదన్నారు. రేణుకాచౌదరిని పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ చేసి, బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేనట్టయితే, ఇంటింటికీ తిరిగి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని, తండాల్లోకి ఆ పార్టీ నాయకులను రానివ్వబోమని, అన్ని గిరిజన సంఘాలతో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment