జ్యోతి (ఫైల్)
సాక్షి, గుంటూరు: రాజధాని ప్రాంతంలో సంచలనం కలిగించిన జ్యోతి హత్యకేసులో అటు పోలీసులు.. ఇటు ప్రభుత్వ వైద్యులు అనుసరించిన తీరు, కేసును నీరుగార్చే కుట్రలు బట్టబయలయ్యాయి. ఈ కేసులో పోలీసులు జ్యోతి మృతదేహంపై దుస్తులు, వేలిముద్రలను సేకరించకుండా ఖననం చేయడం.. ఆ తరువాత దొంగచాటుగా మృతదేహాన్ని వెలికితీసి దుస్తులు సేకరించడంతో అనుమానాలు వెల్లువెత్తగా రీపోస్టుమార్టం నిర్వహించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో మరో చీకటి కోణం వెలుగు చూసింది. సంచలనాత్మకమైన కేసులో పకడ్బందీగా పోస్టుమార్టం నిర్వహించాల్సిన ప్రభుత్వ వైద్యులు తీవ్ర నిర్లక్ష్యం వహించిన తీరు బయటపడింది. మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ జి.విజయభారతి జ్యోతి మృతదేహానికి అసలు పోస్టుమార్టమే నిర్వహించకుండా పొట్టపై చిన్న గాటు పెట్టి కుట్లు వేసి పంపించిన వైనం బయటపడడంతో అటు జిల్లా ఉన్నతాధికారులు, ఇటు పోలీసు అధికారులు ఉలిక్కి పడ్డారు. జ్యోతి తలపై రాడ్డు లాంటి ఆయుధంతో బలంగా కొట్టడం వల్లే ఆమె మృతిచెందిందనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే పోస్టుమార్టం సమయంలో మృతదేహం తలపై చిన్న గాటు కూడా పెట్టిన దాఖలాలు లేవంటే పోస్టుమార్టం ఏవిధంగా నిర్వహించారో అర్థం చేసుకోవచ్చు. జ్యోతి హత్య కేసులో ప్రభుత్వ వైద్యురాలు ఈ విధంగా వ్యవహరించడం వెనుక అధికార పార్టీ నాయకుల ఒత్తిడి ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదంతా చూస్తుంటే ఇవి నిర్లక్ష్యం వల్ల జరిగిన తప్పులు కావని, కుట్రపూరితంగా కేసును పక్కదారి పట్టించేందుకే పథకం ప్రకారం చేసినవనే విమర్శలు వినిపిస్తున్నాయి.
డాక్టర్ విజయభారతిపై చర్యలు షురూ..
జ్యోతి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ విజయభారతిని రెండు రోజుల క్రితం పిలిపించిన జిల్లా కలెక్టర్ కోన శశిధర్ ఆమె తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆమె ఇచ్చిన పోస్టుమార్టం నివేదికను పరిశీలించి రీపోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాత వేటు వేసేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఆమెను సస్పెండ్ చేసి వదిలేస్తారా.. లేక క్రిమినల్ కేసు సైతం నమోదు చేస్తారా? అనే విషయంపై ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే జ్యోతిని రాడ్డు లాంటి బలమైన ఆయుధంతో తలపై బలంగా కొట్టడం వల్ల తల లోపల పుర్రె ముక్కలు ముక్కలైనట్లు రీపోస్టుమార్టంలో తేలినట్లు తెలుస్తోంది. జ్యోతిది కేవలం హత్య మాత్రమేనని, ఆమెపై ఎటువంటి లైంగిక దాడులు జరగలేదని కూడా తేలినట్లు సమాచారం.
స్నేహితులతో కలిసి జ్యోతిని హతమార్చిన శ్రీనివాసరావు
జ్యోతిని హతమార్చేందుకు శ్రీనివాసరావు ఏవిధంగా కుట్ర చేశాడనే వైనాన్ని పోలీసులు పూర్తిగా ఆధారాలతో సేకరించినట్లు తెలిసింది. అతని వద్ద పనిచేసే పవన్ పోలీసుల అదుపులో అసలు విషయాలు వెల్లడించినట్లు సమాచారం. అయితే జ్యోతిని హతమార్చేందుకు శ్రీనివాసరావు తన వద్ద పనిచేసే పవన్ సహాయం తీసుకున్నాడా.. అసలు జ్యోతిని ఎలా హతమార్చారు.. శ్రీనివాసరావుకు తగిలిన గాయం ఎవరు చేశారు.. అనే దానిపై ఆరా తీస్తున్నారు. అయితే శ్రీనివాసరావు పోలీసుల ఎదుట నేరాన్ని అంగీకరించకపోవడంతో ఆసుపత్రి నుంచి నేడో, రేపో డిశ్చార్జి చేసి అరెస్టు చేసేందుకు పోలీసు ఉన్నతాధికారులు సమాయత్తం అవుతున్నట్లు తెలిసింది. అయితే రాజధాని ప్రాంతంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుందనే ఆరోపణల నుంచి తప్పించుకునేందుకే అధికార పార్టీ నేతలు కేసును పక్కదారి పట్టించేందుకు అటు పోలీసులు, ఇటు ప్రభుత్వ వైద్యులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తేవడంతో పాటు భారీ మొత్తంలో డబ్బులు కూడా చేతులు మారాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంలో ఎవరెవరిపై వేటు పడుతుందో వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment