హత్య చేయించి.. అసత్యాలు వల్లించి.. | Conspiracy in the YS Viveka murder case | Sakshi
Sakshi News home page

హత్య చేయించి.. అసత్యాలు వల్లించి..

Published Sun, Mar 17 2019 4:49 AM | Last Updated on Sun, Mar 17 2019 4:49 AM

Conspiracy in the YS Viveka murder case - Sakshi

సాక్షి, అమరావతి: చంద్రబాబు మరోసారి దుర్మార్గమైన రాజకీయాలకు పాల్పడ్డారు. అజాత శత్రువుగా గుర్తింపు పొందిన 40ఏళ్ల సీనియర్‌ నేత వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యపై ఆయన నీచరాజకీయాలకు తెగించారు. తనకు అలవాటైన రీతిలో కేసును నీరుగార్చేందుకు దిగజారుడు రాజకీయాలకు పాల్పడ్డారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు వీలుగా వైఎస్సార్‌ జిల్లాలో వివేకానందరెడ్డిని టీడీపీ ముఖ్యనేతలే అంతమొందించారన్నది ప్రజలందరికీ అవగతమైంది. దాంతో అసత్య ఆరోపణలతో వైఎస్‌ కుటుంబంపై బురదజల్లడం ద్వారా కేసును పక్కదారి పట్టించేందుకు చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు పాల్పడ్డారు. మీడియా ముందుకు శుక్రవారం రాత్రి వచ్చిన ఆయన.. వివేకానందరెడ్డి హత్యపై స్పందించిన తీరు అందరినీ విస్మయపరిచింది. సీఎం పదవిలో ఉన్న చంద్రబాబు బాధ్యతాయుతంగా స్పందించి కేసుపై నిష్పక్షపాతంగా విచారించి దోషులను శిక్షిస్తాం అని చెప్పాల్సి ఉండగా.. రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా శవ రాజకీయాలకు పాల్పడ్డారు. అబద్ధపు ఆరోపణలు, ఊహాజనిత సందేహాలను లేవనెత్తుతూ వైఎస్‌ కుటుంబంపై ఎదురుదాడికి పాల్పడ్డారు. తద్వారా కేసు విచారణను ఏ విధంగా పక్కదారి పట్టించాలో ఆయన పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. కానీ, వాస్తవాలు మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. చంద్రబాబు లేవనెత్తిన అంశాలు.. వాటిల్లో వాస్తవాలు ఇవిగో ఇలా ఉన్నాయి..

వివేకా గుండెపోటుతో మరణించినట్లు చెప్పలేదు
చంద్రబాబు : వైఎస్‌ వివేకానందరెడ్డి గుండెపోటుతో మృతి చెందారని వైఎస్‌ కుటుంబ సభ్యులు ఎలా చెబుతారని ప్రశ్నించారు. అది హత్య అని ఎందుకు చెప్పలేదని సందేహం వ్యక్తంచేయడం ద్వారా ప్రజలను తప్పుదారి పట్టించేందుకు యత్నించారు. చంద్రబాబు నిస్సిగ్గుగా అసత్య ఆరోపణలు చేశారు.
వాస్తవం : వివేకానందరెడ్డి గుండెపోటుతో మృతిచెందినట్లు వైఎస్‌ కుటుంబసభ్యులు అసలు చెప్పనేలేదు. మొదటి నుంచీ అనుమానాస్పద మృతేనని చెప్పారు. వైఎస్‌ అవినాష్, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌ రెడ్డి శుక్రవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ కూడా వివేకానందరెడ్డిది సహజ మరణం కాదని స్పష్టంగా చెప్పారు. ఆయనది అనుమానాస్పద మృతేనని అన్నారు. అంతేగానీ, ఆయన గుండెపోటుతో మృతిచెందినట్లు అసలు చెప్పనేలేదు. 

అవినాష్‌ ఎవరెవరితో మాట్లాడారో అంటూ అభాండాలు..
చంద్రబాబు : వివేకానందరెడ్డి మృతి చెందారనే విషయం అవినాష్‌కు ఎవరు చెప్పారు.. ఆయన ఎవరెవరితో మాట్లాడారో అని చంద్రబాబు ఊహాజనిత ప్రశ్నలు వేసి కేసును పక్కదారి పట్టించేందుకు యత్నించారు. 
వాస్తవం : వైఎస్‌ అవినాష్‌ ఉ.6.30గంటలకు తన ఇంటి నుంచి బయటకువచ్చారు. జమ్మలమడుగులో పార్టీలో కొందరి చేరికలు ఉన్నందున అక్కడికి వెళ్లేందుకు బయల్దేరారు. అంతలోనే వివేకానందరెడ్డి బావమరిది శివప్రకాష్‌రెడ్డి ఆయనకు ఫోన్‌చేశారు. బావ వివేకానందరెడ్డి చనిపోయారంట అని బోరున విలపిస్తూ చెప్పి అక్కడికి వెళ్లాలని చెప్పారు. దాంతో అవినాష్‌రెడ్డి వెంటనే వివేకానందరెడ్డి నివాసానికి వెళ్లారు. మృతదేహాన్ని చూసి వెంటనే అంటే 6.45గంటలకు పోలీసులకు ఫోన్‌చేశారు. పావుగంట నిరీక్షించినప్పటికీ పోలీసులు రాలేదు. దాంతో మళ్లీ ఏడు గంటలకు, 7.07గంటలకు, 7.09 గంటలకు పోలీసులకు ఫోన్లు చేశారు. 7.13 నిమిషాలకు సీఐ వచ్చారు. వాస్తవాలు ఇలా ఉంటే.. వైఎస్‌ అవినాష్‌ ఎవరెవరితో మాట్లాడారో అంటూ చంద్రబాబు ఉద్దేశ్యపూర్వకంగా సందేహాలు లేవనెత్తి పోలీసుల విచారణను ప్రభావితం చేసేందుకు యత్నించారు.

మృతదేహాన్ని పోలీసులే ఆస్పత్రికి తీసుకెళ్లారు
చంద్రబాబు : వివేకానందరెడ్డి మృతదేహానికి పంచనామా చేయకుండా వైఎస్‌ కుటుంబ సభ్యులు ఆసుపత్రికి ఎందుకు తీసుకువెళ్లారని చంద్రబాబు మరో పచ్చి అబద్ధాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు యత్నించారు.  
వాస్తవం : వివేకానందరెడ్డి మృతదేహాన్ని వైఎస్‌ కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకువెళ్లనే లేదు. వైఎస్‌ అవినాష్‌ సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి వచ్చిన సీఐకు ఆ మృతదేహాన్ని అప్పగించారు. సీఐ తమ సిబ్బందితో కలిసి మృతదేహాన్ని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అంతేగానీ.. ఇందులో వైఎస్‌ కుటుంబసభ్యులు చేసిందేమీ లేదు. పంచనామాతోపాటు దర్యాప్తునకు సంబంధించిన ఇతర సాంకేతిక అంశాలను పోలీసులే చూసుకుంటారన్నది అందరికీ తెలిసిన విషయమే. 

పోస్టుమార్టానికి ముందే హత్యేనని కుటుంబసభ్యులు చెప్పారు..
చంద్రబాబు : పోస్టుమార్టం అయ్యే వరకు వివేకానందరెడ్డిది హత్య అని కుటుంబసభ్యులు ఎందుకు చెప్పలేదని చంద్రబాబు ప్రశ్నించారు. 
వాస్తవం : వివేకానందరెడ్డి కుమార్తె సునీత డాక్టర్‌. అమె వచ్చేంత వరకు పోస్టుమార్టం చేయొద్దని మాత్రమే వైఎస్‌ కుటుంబ సభ్యులు పోలీసులు, ఆసుపత్రి అధికారులకు చెప్పారు. ఆయనది అనుమానాస్పద మృతేనని మొదటి నుంచి చెప్పిన కుటుంబ సభ్యులు.. డా.సునీత వచ్చి మృతదేహాన్ని చూసి నిర్ధారించిన తరువాత ఆయనది హత్యేనని తేల్చారు. అంటే పోస్టుమార్టానికి ముందే వివేకానందరెడ్డిని హత్యచేశారని కుటుంబ సభ్యులు చెప్పారు. అంతేగానీ.. పోస్టుమార్టం చేసి డాక్టర్లు చెప్పిన తరువాతే వైఎస్‌ కుటుంబసభ్యులు అది హత్య అని అన్నారని చంద్రబాబు అవాస్తవాలు చెప్పడం సిగ్గుచేటు.

ఆధారాలు ఎందుకు చెరిపేశారోనని అసత్యాలు..
చంద్రబాబు : వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యానంతరం సంఘటనా స్థలంలో ఆధారాలను కుటుంబ సభ్యులు చెరిపేశారని చంద్రబాబు మరో అసత్య ఆరోపణ చేశారు..
వాస్తవం : వివేకానందరెడ్డి నివాసానికి చేరుకుని.. ఆయన మృతిచెందిన విషయాన్ని నిర్ధారించుకోగానే వైఎస్‌ అవినాష్‌ సీఐకి ఫోన్‌చేశారు. సీఐ రాగానే మృతదేహాన్ని ఆయనకు అప్పగించి ఆసుపత్రికి తీసుకువెళ్లాలని సూచించారు. సంఘటనా స్థలంలో ఆధారాలు చెరిపేయడం అన్నది పూర్తిగా అవాస్తవం. వైఎస్‌ కుటుంబ సభ్యులు నిబంధనల ప్రకారం వివేకానందరెడ్డి మృతదేహాన్ని సీఐ, పోలీసులకు అప్పగించారు. తదుపరి ఏం చర్యలు తీసుకోవాన్నది పోలీసులే చూసుకోవాలి. చంద్రబాబు సందేహిస్తున్న విధంగా ఏదైనా విషయం ఉంటే.. వైఎస్‌ కుటుంబ సభ్యులు మృతదేహాన్ని సీఐకి ఎందుకు అప్పగిస్తారు? కుటుంబసభ్యులే హడావుడిగా ఆసుపత్రికి తీసుకువెళ్లేవారు కదా అని నిపుణులు చెబుతున్నారు. కానీ, చంద్రబాబు ఉద్దేశ్యపూర్వకంగానే వైఎస్‌ కుటుంబ సభ్యులపై బురదజల్లుతూ కేసు విచారణను తప్పుదారి పట్టించేలా మాట్లాడారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement