ప్రతీకాత్మక చిత్రం
మొయినాబాద్(చేవెళ్ల) : ఇంటిపక్కనే ఉంటున్న యువతిని ఓ యువకుడు రెండేళ్లుగా ప్రేమిస్తున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి వెంట తిప్పుకున్నాడు. పెళ్లికి ప్రియురాలు ఒత్తిడి చేసినప్పుడల్లా దాటవేస్తూ వచ్చాడు. కట్నానికి ఆశపడి వేరొకరిని పెళ్లి చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. విషయం తెలిసి ప్రియురాలు పెళ్లి చేసుకోవాలని నిలదీయడంతో ఇప్పుడు కాదుపొమ్మన్నాడు. ఈ దుర్మార్గానికి పాల్పడింది ఓ కానిస్టేబుల్. ఈ సంఘటన మండల పరిధిలోని చిన్నమంగళారంలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నమంగళారం గ్రామానికి చెందిన తలారి శ్రీనివాస్(26) చేవెళ్ల పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. చిన్నమంగళారం గ్రామంలోనే తన ఇంటి పక్కనే ఉండే ఓ యువతిని రెండు సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి వెంటతిప్పుకున్నాడు. తనను పెళ్లి చేసుకోవాలని యువతి ఏడాదిగా శ్రీనివాస్‌ను ఒత్తిడి చేస్తుండగా.. దాటవేస్తూ వచ్చాడు.
ఇదే విషయమై కొన్ని రోజుల క్రితం యువతి చేవెళ్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. చేవెళ్ల పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్ తనను ప్రేమిస్తున్నాడని తెలిపింది. గ్రామ పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంటానని ఒప్పుకోవడంతో అప్పట్లో కేసు నమోదు చేయలేదు. కాగా ఇటీవల కానిస్టేబుల్ శ్రీనివాస్ కట్నానికి ఆశపడి మరో యువతిని పెళ్లి చేసుకోవాలని చూస్తున్నట్లు ప్రియురాలికి తెలిసింది.
దీంతో తనను పెళ్లి చేసుకుంటానని, మళ్లీ పెళ్లి చూపులు ఎందుకు చూస్తున్నావంటూ నిలదీసింది. శ్రీనివాస్ పెళ్లికి నిరాకరించడంతో పాటు నీతో నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పడంతో తనకు న్యాయం చేయాలని యువతి పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment