ఆర్‌ఎంపీ వైద్యుడు కోడి శ్రీనివాస్
మంచాల : వైద్యం పేరుతో క్షుద్ర పూజలు చేసి అమాయక ప్రజల నుండి లక్షలు దండుకున్న సంఘటన మంచాల మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాలు... యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం చిన్నకాపర్తి గ్రామానికి చెందిన కోడి శ్రీనివాస్ పదేళ్ల క్రితం మంచాల గ్రామానికి ఆర్‌ఎంపీ వైద్యుడిగా వలస వచ్చి అక్కడే నివాసం ఉంటున్నాడు. వైద్యం కోసం వచ్చిన ప్రజలకు నాటు వైద్యం చేసేవాడు.
అధిక సంపాదన ఆశతో అమాయక ప్రజలను నమ్మించి క్షుద్ర పూజలు చేస్తుండేవాడు. మహబూబ్ నగర్‌కు చెందిన ఓ మహిళ నగరంలోని కర్మన్‌ఘట్‌లో స్థిరపడింది. పదిహేను సంవత్సరాల వయస్సు గల ఆమె కుమారుడి మానసికస్థితి మార్పు విషయంలో నగరంలో అనేక వైద్యశాలలను సంప్రదించినా ఫలితం లేదు. దీంతో యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడం గ్రామంలోని అజీజ్‌బాబా అనే మంత్రగాడిని ఆశ్రయించింది.
అతడికి సుమారు రూ.50వేల వరకు సమర్పించుకుంది. అయినా నయం కాకపోవడంతో అజీజ్‌బాబా మంచాలలో ఉంటున్న శ్రీనివాస్ వద్దకు పంపించాడు. ఖచ్చితంగా అతడు నయం చేస్తాడని చెప్పాడు. బాబా మాటలు నమ్మిన ఆ మహిళ తన కుమారుడిని తీసుకొని వచ్చి శ్రీనివాస్‌ను ఫిబ్రవరి నెలలో కలిసింది. నయం చేస్తానని చెప్పి ఆమెను వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లి క్షుద్ర పూజలు చేయడం ప్రారంభించాడు.
అందుకు ఆమె వద్ద నుండి రూ.లక్షకు పైగా వసూలు చేశాడు. ఈమధ్య కాలంలో ఆమె తన కొడుకుని తీసుకొని దుబాయిలో ఉంటున్న తన భర్త వద్దకు వెళ్లింది. దీంతో శ్రీనివాస్‌కు అందుబాటులోకి రాలేదు. అయితే శ్రీనివాస్ మాత్రం బాధితురాలి బంధువులకు ఫోన్ చేసి మీ కొడుకుకు నయం చేశాను, నాకు మరిన్ని డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేశాడు. లేకుంటే మీ కొడుకుని తిరిగి అనారోగ్యానికి గురిచేస్తానని బెదిరించాడు.
దీంతో భయాందోళనకు చెందిన ఆ మహిళ సోమవారం మంచాలకు వచ్చి క్షుద్ర పూజలు చేసిన శ్రీనివాస్‌ను కలిసింది. ఇద్దరి మధ్యా మాటా మాటా పెరిగి గొడవ జరిగింది. దీంతో బాధితురాలు మంచాల పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు మంచాల సీఐ గంగారాం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాడు.
పోలీసుల అదుపులో...
క్షుద్ర పూజలు చేసి అమాయక ప్రజల నుండి డబ్బులు వసూలు చేసిన ఆర్‌ఎంపీ వైద్యుడు శ్రీని వాస్, అతనితో పాటు కొయ్యలగూడంకు చెందిన అజీజ్ బాబాను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పూర్తి స్థాయిలో విచారణ చేసి వివరాలు తెలియజేస్తామని సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment