భర్త మహబూబ్ బాషాతో నసీమాబేగం పెళ్లినాటి ఫొటో(ఫైల్), పోలీసు కానిస్టేబుల్ మహబూబ్ బాషా
సాక్షి,కర్ణాటక, బళ్లారి: అదనపు కట్నం కోసం కట్టుకున్న భార్యను గర్భవతి అని తెలిసినా కూడా చిత్రహింసలకు గురి చేస్తూ వేధిస్తున్న ఓ కానిస్టేబుల్‌పై భార్య మహిళా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వరకట్నం విషయంలో పోలీసులు కూడా అతీతులు కాదని బళ్లారి జిల్లా పోలీసు కానిస్టేబుల్ నిరూపించారు. ఈసందర్భంగా బళ్లారి నగరానికి చెందిన నసీమా బేగం(25) అనే మహిళ తన భర్త కానిస్టేబుల్ మహబూబ్ బాషాపై మహిళా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పాటు సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో కూడా ఫిర్యాదు చేసింది. ఆమె మహిళా పోలీసు స్టేషన్‌లో తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బళ్లారి నగరంలోని కౌల్‌బజార్‌కు చెందిన నసీమా బేగంను తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన రూ.3 లక్షల నగదుతో పాటు మరో 10 తులాలు బంగారం లాంఛనాలుగా ఇచ్చి జిల్లాలోని మరియమ్మనహళ్లికి చెందిన మహబూబ్ బాషాతో ఏడాదిన్నర క్రితం ముస్లిం సంప్రదాయం ప్రకారం అన్ని విధాలుగా ఘనంగా వివాహం జరిపించారు.
పెళ్‌లైన తర్వాత రెండు నెలలు సజావుగా వారి వైవాహిక జీవితం సాగిన అనంతరం కట్నం కోసం భర్త వేధింపులు మొదలు పెట్టారు. ప్రస్తుతం నసీమా బేగం ఆరు నెలల గర్భవతి కూడా అయినప్పటికీ పెళ్లి సందర్భంలో మాట్లాడిన మరో రెండు లక్షలు నగదు ఇవ్వాలని సంవత్సరం నుంచి వేధింపులతో పాటు ఆమెను చిత్రహింసలకు గురి చేసేవారు. కూతురుని కట్నం కోసం వేధిస్తున్నారని తెలిసి మనోవేదనతో తన తండ్రి ఇటీవల మృతి చెందినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. కట్నం కోసం వేధించడంతో పాటు కొట్టడం, మానసికంగా చిత్రహింసలు చేయడం అలవాటు చేసుకున్న మహబూబ్ బాషా తీరు మారదని నిర్ధారించుకున్న ఆమె చివరకు పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం జిల్లాలోని హొసపేటె నగరంలోని తుంగభద్ర డ్యాం పోలీసు స్టేషన్‌లో పని చేస్తున్న మహబూబ్ బాషాపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. ఈసందర్భంగా మహిళా పోలీసు స్టేషన్ సబ్‌ఇన్‌స్పెక్టర్ మాట్లాడుతూ నసీమా బేగం తన భర్తపై అదనపు కట్నం ఇవ్వాలని వేధిస్తున్నారని ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment