కిడ్నాప్‌కు గురైన జసిత్
సాక్షి, మండపేట (తూర్పు గోదావరి): ‘నేను పెడితేనే కాని బాబు అన్నం తినడు.. ఎక్కడున్నాడో? ఎలా ఉన్నాడో? ఏమైనా తిన్నాడో లేదో? ఎందుకు ఎత్తుకెళ్లారో తెలీడం లేదు. ఏం కోరినా ఇస్తాం.. మా బాబును క్షేమంగా అప్పగిస్తే చాలు’ అంటూ కిడ్నాప్‌నకు గురైన బాలుడు జసిత్ తల్లి, నిండు గర్భిణి నాగావల్లి కన్నీరు మున్నీరవుతోంది. కన్న బిడ్డకోసం సోమవారం రాత్రి నుంచి ఆమె కంటి మీద కునుకు లేకుండా వేయికళ్లతో ఎదురుచూస్తోంది. ఎవరకు దగ్గరకు వెళ్లినా బాబు ఆచూకీ తెలిసిందా అంటూ ఆమె పడుతున్న ఆత్రుత చూపరుల హృదయాలను కలచివేస్తోంది.
‘ఏ కేసూ పెట్టం. మా బిడ్డను క్షేమంగా అప్పగించండి’ అంటూ ఆమె కిడ్నాపర్లను వేడుకుంటోంది. శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి చెందిన నూకా వెంకటరమణ, నాగావల్లి దంపతులు తూర్పుగోదావరి జిల్లా మండపేటలో బ్యాంకు ఉద్యోగులుగా పని చేస్తున్నారు. వీరి నాలుగేళ్ల కుమారుడు జసిత్ ఇంటికి సమీపంలోని ఓ కార్పొరేట్ పాఠశాలలో ఎల్‌కేజీ చదువుతున్నాడు. సోమవారం రాత్రి 7.30 గంటలకు అపార్ట్‌మెంట్ పిల్లలతో ఆడుకుని, నాన్నమ్మతో కలిసి తిరిగి మేడ మెట్లు ఎక్కుతుండగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇదే సమయంలో వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు ఆమె ముఖంపై కొట్టి, బాలుడిని ద్విచక్ర వాహనంపై బైపాస్ రోడ్డు వైపు తీసుకు వెళ్లిపోయారు. ఇది జరిగి ఒకరోజు గడిచినా ఇంకా కిడ్నాపర్ల చెరలోనే ఉన్నాడు.
8 ప్రత్యేక బృందాలతో
ఈ కిడ్నాప్ ఓ మిస్టరీగా మారింది. ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి పోలీసులు అన్ని కోణాల్లోను ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఏలూరు రేంజ్ డీఐజీ ఎస్‌కే ఖాన్ మంగళవారం ఘటనా స్థలాన్ని పరిశీలించి బాలుడి తల్లిదండ్రులు, నానమ్మ పార్వతిలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. డీఎస్పీ జేవీ సంతోష్, సీఐ కె.మంగాదేవి తదితరులతో చర్చించారు. ఎస్పీ అద్నాన్‌నయీం అస్మి మండపేట చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బాలుడి జాడ తెలుసుకొనేందుకు 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అనుమానిత ప్రాంతాల్లో సీసీ పుటేజ్‌ల పరిశీలించారు.
వెంకటరమణ, నాగవల్లి సహచర బ్యాంకు ఉద్యోగుల నుంచి వివరాలు, అనుమానితుల కాల్ డేటా వివరాలను సేకరిస్తున్నారు. గతంలో తాను పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లిలో పని చేసినప్పుడు బ్యాంకులో నకిలీ బంగారం తాకట్టు పెట్టిన వ్యక్తిని పోలీసులకు పట్టించినట్టు వెంకటరమణ తెలపడంతో ఆ కోణంలో కూడా విచారణ చేస్తున్నట్టు సమాచారం. వెంకటరమణకు ఎవరితోనైనా వ్యక్తిగత తగాదాలు ఉన్నాయా? ఆయన స్వస్థలమైన శ్రీకాకుళం జిల్లాలో ఎవరితోనైనా విభేదాలు ఉన్నాయా అనే కోణంలోనూ ప్రత్యేక బృందాలు విచారణ చేస్తున్నట్టు తెలిసింది.
డిప్యూటీ సీఎం బోస్ పరామర్శ
అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న డిప్యూటీ సీఎం, రెవెన్యూ, స్టాంప్స్ రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ బాలుడి తండ్రి వెంకటరమణతో ఫోన్‌లో మాట్లాడారు. అధైర్య పడవద్దని, కిడ్నాపర్లను పట్టుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన పోలీసులు అధికారులతో దీనిపై సమీక్షించారు. త్వరితగతిన బాలుడిని రక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు బాధితులను పరామర్శించారు.
అన్ని కోణాల్లోనూ దర్యాప్తు
కిడ్నాప్ కేసును అన్ని కోణాల్లోను దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ అద్నాన్ నయిం అస్మి తెలిపారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశామని, త్వరితగతిన నిందితుల్ని అదుపులోకి తీసుకుని బాలుడిని సురక్షితంగా తీసుకువస్తామన్నారు.
చిన్నారి కోసం ఎదురుచూపులు
జసిత్ కోసం తల్లిదండ్రులు, నానమ్మ పార్వతి నిద్రాహారాలు లేకుండా ఎదురు చూపులు చూస్తున్నారు. నా చేతుల్లోంచే బిడ్డను లాక్కుపోయారంటూ నానమ్మ పార్వతి బోరున విలపిస్తోంది. నా కుమారుడిని క్షేమంగా అప్పగించండి మీరు కోరింది ఇస్తామంటూ మీడియా ద్వారా తండ్రి వెంకటరమణ కిడ్నాపర్లను వేడుకుంటున్నాడు. జసిత్ కిడ్నాప్ ఘటన స్థానికుల హృదయాలను కలచివేస్తోంది. చిన్నారి క్షేమంగా ఇంటికి చేరుకోవాలని, ఆచూకి తెలపాలంటూ వాట్సాప్, ఫేస్‌బుక్ తదితర సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. మరోవైపు స్థానికులు, బ్యాంకు ఉద్యోగులు, విజయలక్ష్మి నగర్‌లోని వారి ఇంటికి చేరుకుని తల్లిదండ్రులను పరామర్శిస్తున్నారు. ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, మున్సిపల్ మాజీ చైర్మన్ చుండ్రు శ్రీవరప్రకాష్, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు వి.సాయికుమార్ వెంకటరమణను పరామర్శించారు. బాలుడిని సురక్షితంగా తీసుకురావాలని వారు పోలీసులకు విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment