– బాబు వారణాసి
తాండూరు : తాండూరులో నిబంధనలకు విరుద్ధంగా లారీల ద్వారా ఓవర్ లోడ్ రవాణా సాగిస్తున్నారు. తాండూరు ప్రాంతం నుంచి నిత్యం 2వేలకు పైగా లారీలు నాపరాతిని ఇతర ప్రాంతాలకు తరలిస్తుంటాయి. ఇందుకోసం రాయల్టీ ఫీజు కింద ఒక్కో వాహనానికి రూ.2 వేలు చెల్లించాలి. కానీ అధికారుల నిఘా లేక పోవడంతో రాయల్టీ చెల్లించకుండా పెద్దసంఖ్యలో లారీలు సరిహద్దులు దాటివెళ్తున్నాయి.
ఓవర్ లోడ్‌తో సాగుతున్న ఈ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. ట్రాన్స్‌పోర్టు నిర్వాహకుల వద్ద పర్సెంటీలు తీసుకుంటున్న రవాణా శాఖ అధికారులు.. అక్రమంగా రాకపోకలు సాగిస్తున్న వాహనాల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఇందుకు కృతజ్ఞతగా ప్రతినెలా రూ.లక్షల్లో ముడుపులు అందుకుంటున్నారు. సాక్షాత్తూ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి నియోజకవర్గంలోనే సాగుతున్న వ్యవహారంపై విమర్శలు వస్తున్నాయి.
తాండూరు పట్టణం జిల్లాలోనే ప్రధాన వ్యాపార కేంద్రంగా కొనసాగుతోంది. స్థానికంగా నాపరాయి, సుద్ద, ఎర్రమట్టి భూగర్భ నిక్షేపాలున్నాయి. తాండూరులో సిమెంట్ కర్మాగారాలు, నాపరాతి పాలిషింగ్ యూనిట్లు ఉండటంతో నిత్యం రూ.కోట్లలో వ్యాపారం, లావాదేవీలు జరుగుతాయి. తాండూరు నుంచి నిత్యం సిమెంట్, సుద్ద, నాపరాతి, నిత్యావసర సరుకుల రవాణా పెద్దఎత్తున జరుగుతోంది. 2 వేల వరకు లారీలు ప్రతిరోజూ ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్తాయి.
ఇందుకోసం ప్రతినెలా రవాణా శాఖ నేషనల్ పర్మిట్ వాహనాలకు రూ.3,500, లోకల్ లారీలకు రూ.2,500 వసూలు చేస్తున్నారు. ఆర్టీఏ శాఖ అధికారులు మధ్యవర్తులతో కలిసి ఈ తంతంగాన్ని కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో తాండూరులోని లారీ పార్కింగ్ ఏరియాలో ప్రత్యేక ట్రాన్స్‌పోర్టులు వెలిశాయి. వీటి ద్వారా నిబంధనలకు విరుద్ధంగా పరిమితికి మించి ఓవర్‌లోడ్‌తో రాకపోకలు సాగిస్తున్నారు. ట్రాన్స్‌పోర్ట్‌ల నిర్వాహకుల నుంచి క్రమం తప్పకుండా మామూళ్లు తీసుకుంటున్న కారణంగా రవాణాశాఖ అధికారులు ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి రూ.లక్షల్లో గండి పడుతోంది.
బ్రోకర్లదే హవా..
తాండూరులోని రవాణా శాఖ కార్యాలయం వారానికి రెండు రోజులు మాత్రమే సేవలు అందుతాయి. దీంతో ఈ రెండు రోజులు ఆఫీసు సందడిగా ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారానే ఆర్టీఏ సేవలు అందిస్తున్నామని ప్రభుత్వం ఓ వైపు ప్రకటనలు చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం దీనికి పూర్తి విరుద్ధంగా ఉంటోంది. ఆన్‌లైన్‌లో లైసెన్స్ పొందాలనుకునే వారికి ఆరు నెలల పాటు తిరిగినా కూడా పని పూర్తి కాదు.
ఈ తలనొప్పి ఎందుకని భావిస్తున్న జనాలు రూ.వెయ్యి అదనంగా పెట్టి పని పూర్తి చేసుకుంటున్నారు. కార్యాలయం ఎదుట మధ్యవర్తులు దుకాణాలు ఏర్పాటు చేసుకొని ఆర్టీఏ ద్వారా లభ్యమయ్యే ధ్రువీకరణ పత్రాలకు ఒక్కోదానికి ఒక్కొ రేటు నిర్ణయించి.. వసూలు చేసి పంచుతున్నారు. దీనిపై అడిగేం దుకు డిస్ట్రిక్ట్ ట్రాన్స్‌పోర్ట్ ఆపీసర్ ప్రవీణ్‌కుమార్‌రెడ్డికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆయన స్పందించలేదు.
డబ్బులిస్తేనే పని
తాండూరు పట్టణంలో ఏర్పాటు చేసిన ఆర్టీఏ కార్యాలయంలో లైసెన్స్ పొం దాలన్నా, కొత్త వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్న ప్రభుత్వ ఫీజుతో పాటు అ దనంగా చెల్లించాల్సిందే. లేదంటే ఒకటికి ప దిసార్లు తిరిగినా పనికాదు. మధ్యవర్తులను ఆశ్రయిస్తే చటుక్కున పని అయిపోతుంది. నేరుగా వెళ్లి రూల్స్ మాట్లాడితే.. అధికారులు చుక్కలు చూపిస్తున్నారు.
– బాబు వారణాసి,తాండూరు
Comments
Please login to add a commentAdd a comment