
చండీగఢ్ : అవినీతి నిర్మూలన, నకిలీ నోట్ల కట్టడి అంటూ మోదీ ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసి.. జనాలను ముప్ప తిప్పలు పెట్టిన వైనాన్ని ఇప్పటికి మర్చిపోలేదు. పెద్ద నోట్ల రద్దు అనంతరం కేంద్ర ప్రభుత్వం కొత్త రంగుల్లో నూతన కరెన్సీని విడుదల చేసింది. పాపం ఈ కొత్త రంగుల కరెన్సీ వల్ల ఓ బంగారం షాపు యజమాని దాదాపు రెండు లక్షల రూపాయల వరకూ మోసపోయాడు. మోసగాళ్లు ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాంక్ పేరుతో సొంత కరెన్సీని ప్రింట్ వేసి.. ఈ ఘరానా మోసానికి పాల్పడ్డారు. మోసపోయిన బాధితుడు ఇక నేను జీవితంలో కోలుకోలేను అంటూ విలపిస్తున్నాడు.
వివరాలు.. శ్యామ్ సుందర్ వర్మ అనే వ్యక్తికి లుధియానాలో జ్యూవెలరి షాప్ ఉంది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ఓ జంట బంగారం కొనాలని శ్యామ్ సుందర్ షాప్‌కి వచ్చింది. దాదాపు 56 గ్రాముల బంగారాన్ని కొనుగోలు చేశారు. దీని విలువ దాదాపు 1. 90 లక్షల రూపాయల వరకూ ఉంటుందని తెలిసింది. బంగారం కొన్న అనంతరం సదరు జంట మాకు చాలా అర్జెంట్ పని ఉందంటూ ఓ నోట్ల కట్టను ఇచ్చేసే అక్కడి నుంచి హాడవుడిగా బయటపడ్డారు.
అనంతరం శ్యామ్ సుందర్ వారు ఇచ్చిన నోట్లను పరిశీలించగా అవి నకిలీ నోట్లుగా తేలింది. సదరు జంట 500 రూపాయల నోట్ల కట్టను ఇచ్చారు. అవి చూడ్డానికి ఒరిజినల్ 500 రూపాయల నోట్ల రంగులోనే ఉన్నాయి. కానీ రిజర్వ్ బ్యాంక్ అని ఉండాల్సిన చోట మాత్రం ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాంక్ అని ఉందని బాధితుడు తెలిపాడు. వచ్చిన వాళ్లు తనకు నకిలీ నోట్లు ఇచ్చారని అర్థం చేసుకున్న శ్యామ్ సుందర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ వ్యాపారం ప్రారంభించడానికి తనకు ఏళ్లు పట్టిందని.. ఈ నష్టాన్ని పూడ్చడం తనకు సాధ్యం కాదంటూ వాపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment