
ఆత్మహత్యకు పాల్పడిన పెరిసా, అనిల్ కుమార్ మృతదేహాలు
సాక్షి, శంషాబాద్ : ఏడాదిన్నర కిందట పెళ్లి చేసుకున్న దంపతుల మధ్య చోటు చేసుకున్న మనస్పర్థలు ఆత్మహత్యకు దారితీశాయి. ఒకేతాడుతో ఫ్యాన్‌కు ఉరేసుకుని దంపతులిద్దరూ ఆత్మహత్య చేసుకున్న విషాదకర సంఘటన శంషాబాద్ పట్టణంలోని రుద్రాకాలనీలో చోటు చేసుకుంది. ఆర్‌జీఐఏ సీఐ మహేష్‌కుమార్, కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. శంషాబాద్‌లోని రుద్రాకాలనీలో నివాసముంటున్న అంజయ్య, సువర్ణ దంపతుల చిన్న కుమార్తె పెరిసా(25)కు గతేడాది జనవరి మాసంలో తమిళనాడులోని చెన్నైలో నివాసముంటున్న అనిల్‌కుమార్(28)తో వివాహం జరిగింది. పెళ్లయిన కొద్దిరోజుల నుంచే అనిల్‌కుమార్ మద్యం తాగి తరచూ భార్యతో గొడవకు దిగుతూ ఉండేవాడు. దీంతో ఏడాదిన్నరగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.
తండ్రి అంజయ్య సోమవారం ఉదయం నగరంలోని నాచారంలో నివాసముంటున్న కుమార్తె పెరిసాకు ఫోన్ చేసి ఇంటికి రావాల్సిందిగా కోరాడు. తండ్రి దగ్గరికి వచ్చిన పెరిసాతో అప్పటికే అనిల్‌కుమార్ ఫోన్‌లోనే గొడవకు దిగాడు. రాత్రికి అతడు కూడా శంషాబాద్‌కు చేరుకున్నాడు. రాత్రి కూడా వారిద్దరూ గొడవ పడ్డారు. గదిలోకి వెళ్లిన ఇద్దరూ మంగళవారం ఉదయం 10 గంటల వరకు కూడా తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన తండ్రి తలుపులు బద్దలు కొట్టాడు. అప్పటికే ఫ్యాన్‌కు ఒకే తాడుతో ఇద్దరూ ఉరేసుకుని కనిపించడంతో వారిని కిందికి దింపి పోలీసులకు సమాచారం అందించాడు. విషయం తెలుసుకున్న ఆర్‌జీఐఏ పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. సంఘటన స్థలంలో తన చావుకు ఎవరూ కారణం కాదని పెరిసా రాసిన సూసైడ్ నోటు పోలీసులకు దొరికింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment