జగ్గారెడ్డికి రిమాండ్‌ | Court Verdict 14 Days Judicial Remand For Ex MLA Jagga Reddy | Sakshi
Sakshi News home page

Published Wed, Sep 12 2018 3:05 AM | Last Updated on Thu, Jul 11 2019 8:35 PM

Court Verdict 14 Days Judicial Remand For Ex MLA Jagga Reddy - Sakshi

జగ్గారెడ్డిని జైలుకు తరలిస్తున్న పోలీసులు

సాక్షి, హైదరాబాద్‌: మనుషుల అక్రమ రవాణాకు పాల్పడ్డారన్న కేసులో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ పార్టీ నేత తూర్పు జయప్రకాశ్‌రెడ్డి అలియాస్‌ జగ్గారెడ్డికి సికింద్రాబాద్‌లోని సిటీ సివిల్‌ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. సోమవారం రాత్రి ఆయన్ను అరెస్టు చేసిన పోలీసులు మంగళవారం ఉదయం గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం ఈ మేరకు తీర్పు చెప్పింది. అంతకుముందు వాదనల సందర్భంగా జగ్గారెడ్డికి బెయిల్‌ మంజూరు చేయాలని ఆయన తరఫు న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. మనుషుల అక్రమ రవాణాకు సంబంధిం చిన కేసు అయినందున హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది. అలాగే పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌పై విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది. దీంతో పోలీసులు జగ్గారెడ్డిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఆయనకు జైలు అధికారులు యూటీ నంబర్‌ 6403 కేటాయించారు. 

పక్కా ఆధారాలతోనే అరెస్ట్‌: డీసీపీ సుమతి 
మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మనుషుల అక్రమ రవాణాకు పాల్పడినట్లు తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని హైదరాబాద్‌ నార్త్‌జోన్‌ డీసీపీ బి. సుమతి తెలిపారు. మంగళవారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ 2004లో జరిగిన ఈ వ్యవహారంపై తమకు సోమవారం ఉదయం 10.30 గంటలకు సమాచారం అందిందని, ఎస్సై అంజయ్య సుమోటోగా కేసు నమోదు చేయగా మధ్యాహ్నానికి తాము ఆధారాలు సేకరించామన్నారు. ఆయన్ను సాయంత్రం అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నేరం అంగీరించారని చెప్పారు. నేరం జరిగి ఎన్నాళ్లయినప్పటికీ సమాచారం, ఆధారాలు ఉన్నప్పుడు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 

ఒక్కొక్కరి నుంచి రూ. 5 లక్షలు తీసుకున్నారు... 
జగ్గారెడ్డి 2004 సెప్టెంబర్‌ 24న నాటికి ఏడేళ్ల వయసున్న తన కుమార్తె స్థానంలో 17 ఏళ్ల యువతిని, నాలుగేళ్ల వయసున్న కుమారుడి స్థానంలో 15 ఏళ్ల బాలుడిని, భార్యగా మరో మహిళను చూపుతూ పాస్‌పోర్టులు పొందారని సుమతి చెప్పారు. దీనికి అవసరమైన పత్రాలను సంగారెడ్డిలోని తేజ జూనియర్‌ కాలేజీ, కరుణ స్కూల్స్‌ నుంచి సేకరించారన్నారు. పాస్‌పోర్టు దరఖాస్తుల్లో పేర్లు తన కుటుంబీకులవే పొందుపరిచినా భార్య మినహా మిగిలిన ఇద్దరి పుట్టిన తేదీలు మార్చి గుర్తుతెలియని ముగ్గురి ఫొటోలు జత చేశారన్నారు. అలాగే నాడు ఎమ్మెల్యే హోదాలో లెటర్‌హెడ్‌పై తనతోపాటు ఆ ముగ్గురికి అమెరికా వీసా కోసం అమెరికన్‌ కాన్సులేట్‌కు లేఖ రాశారన్నారు. అలా వీసాలు సంపాదించి ముగ్గురు వ్యక్తులతో కలసి అమెరికా వెళ్లారన్నారు. జగ్గారెడ్డితోపాటు నాటి కాంగ్రెస్‌ నేత కుసుమ కుమార్‌ కూడా అమెరికా వెళ్లారని సుమతి తెలిపారు. అక్కడ వారంపాటు ఉన్న జగ్గారెడ్డి, కుసుమ కుమార్‌ తిరిగి వచ్చేయగా... ఆ ముగ్గురూ నేటికీ అక్కడే ఉండిపోయారని వివరించారు. దీనిపై జగ్గారెడ్డిని ప్రశ్నించగా అప్పట్లో మధు అనే దళారి ఆ ముగ్గురినీ నాటి పీఏ ద్వారా తన వద్దకు తెచ్చాడని, ఒక్కొక్కరి నుంచి రూ. 5 లక్షల చొప్పున తీసుకుని సహకరించానని జగ్గారెడ్డి అంగీకరించినట్లు సుమతి పేర్కొన్నారు. 2015 ఆఖరులో ఆ పాస్‌పోర్టు ఎక్స్‌పైర్‌ కావడంతోపాటు దానిపై అమెరికా స్టాంపింగ్స్‌ ఉండటంతో సంగారెడ్డి చిరునామాతో మరో పాస్‌పోర్టు కోసం జగ్గారెడ్డి దరఖాస్తు చేసుకుని 2016 జనవరిలో పొందారన్నారు. 

9 సెక్షన్ల కింద కేసు... 
ప్రజాప్రతినిధిగా ఉన్న సమయంలో సొంత లెటర్‌హెడ్‌ ద్వారా తప్పుడు వివరాలు ఇవ్వడంతోపాటు ప్రభుత్వ విభాగాలను మోసం చేసి మనుషుల అక్రమ రవాణాకు పాల్పడ్డారని ఆరోపిస్తూ పోలీసులు ఆయనపై ఐపీసీ, పాస్‌పోర్ట్‌ చట్టం, ఇమ్మిగ్రేషన్‌ యాక్ట్‌ల కింద కేసు నమోదు చేశారు. మొత్తం తొమ్మిది సెక్షన్లలో మూడు నాన్‌–బెయిలబుల్‌ సెక్షన్లని, వాటి కింద ఏడేళ్లు, అంతకుమించి శిక్షపడే అవకాశం ఉందని సుమతి తెలిపారు. 

కేసీఆర్, హరీశ్‌రావుల కుట్ర: జగ్గారెడ్డి 
సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుల కుట్ర ఫలితంగానే పోలీసులు తనను అరెస్ట్‌ చేశారని జగ్గారెడ్డి ఆరోపించారు. మంగళవారం ఉదయం సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్‌లో రాహుల్‌ గాంధీ సభ తర్వాత కాంగ్రెస్‌ పార్టీ పుంజుకోవడాన్ని జీర్ణించుకోలేకే కేసీఆర్, హరీశ్‌రావు తనను జైల్లో పెట్టిస్తున్నారన్నారు. తద్వారా సంగారెడ్డిలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించుకోవాలని పథకం వేశారన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement