
మహిళ ఒంటిపై గాయాలు, కువైట్ ఆస్పత్రిలో పద్మ
మలికిపురం, (రాజోలు): ఉపాధి కోసం కువైట్ వెళ్లిన ఓ మహిళ యజమాని చేతుల్లో చిత్ర హింసలకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కువైట్ నుంచి ‘చింతలమోరి నేటి పౌరుల సంఘం’ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... తూర్పు గోదావరి జిల్లా మలికిపురం మండలం కేశనపల్లి గ్రామానికి చెందిన నల్లి పద్మ ఉపాధి నిమిత్తం 2011లో కువైట్ వెళ్లింది. ఏడాదిపాటు ఆమె కుటుంబ సభ్యులకు ఫోన్లు చేసి మాట్లాడుతూ ఉండేది. అయితే 2012 నుంచి పద్మ ఫోన్ చేయడం లేదు. దీంతో ఆమె చనిపోయిందని వారు భావించారు.
కానీ పద్మ తీవ్ర గాయాలపాలై సోమవారం కువైట్‌లోని అదాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ప్రవాసాంధ్రులు గుర్తించారు. ఈ విషయాన్ని వెంటనే ఆమె కుటుంబీకులకు తెలియజేశారు. పద్మను ఇంట్లో యజమాని చిత్రహింసలు పెట్టేవాడని అక్కడి వారు చెబుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమెకు సాయం చేసి స్వదేశం తీసుకురావాలని ‘నేటి పౌరుల సంఘం’ సభ్యులు కృషి చేస్తున్నారని, భారత ప్రభుత్వం కూడా సహకరించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment