'శబ్దమే శాపం' ఆమెకు! అత్యంత అరుదైన వ్యాధి..ఆఖరికి.. | Sakshi
Sakshi News home page

'శబ్దమే శాపం' ఆమెకు! అత్యంత అరుదైన వ్యాధి..ఆఖరికి పిల్లల నవ్వులు కూడా..!

Published Thu, Feb 22 2024 6:29 PM

Karen Cook Face Pain Hyperacusis Even Childrens Laughter Also Torture - Sakshi

కొన్ని వ్యాధులు ఓ పట్టాన అర్థం కావు. ఎందుకొస్తాయో కూడా తెలియదు. అవి మొత్తం కుటుంబాన్నే అతలాకుతలం చేసేస్తాయి. ఆ వ్యాధులకు చికిత్స లేకపోవడంతో ఇంటిల్లపాది పడే యాతన అంతా ఇంతకాదు. ఇటు బాధితులకి, వారి కుటుంబానికి ఓ ప్రత్యక్ష నరకం లాంటిది ఆ సమస్య అని చెప్పొచ్చు. ఇక్కడొక మహిళ ఎంత దయనీయమైన వ్యాధితో బాధపడుతుందో వింటే కంగుతింటారు. ఇదేం వ్యాధిని రా బాబు! అని నోరెళ్లబెడతారు. 

ఏం జరిగిందంటే..బ్రిటన్‌కి చెందిన 49 ఏళ్ల కరెన్ కుక్ 'హైపరాక్యుసిస్' అనే అరుదైన వ్యాధితో బాధపడుతోంది. దీని కారణంగా చిన్న శబ్ధాన్ని కూడా భరించలేదు. ఎంతలా అంటే గాలి వీచినా..చెట్ల ఆకుల శబ్దం వరకు ఏ చిన్న శబ్దం విన్నా.. తట్టుకోలేక అల్లాడిపోతుంది. ఈ వ్యాధి కారణంగా భర్త, పిల్లలకు దూరంగా ఒంటరిగా బతుకుతోంది. చెప్పాలంటే తన ఇంట్లోనే ఆమె ఓ ఖైదీలా జైలు శిక్ష అనుభవించేలా చేసింది ఆ వ్యాధి. ఎందుకంటే? భర్త మాట్లాడినా.. ఆఖరికి తన పిల్లలు నవ్వినా తట్టుకోలేదు. కనీసం క్రిస్మస్‌ పండుగ రోజు కూడా ఆమె వేరే గది కిటికి నుంచి తన కుంటుంబం ఆనందంగా సెలబ్రేట్‌ చేసుకువడాన్ని చూడాల్సిందే తప్ప వారితో కలిసి ఎంజాయ​ చేయలేదు. ఆమెకు ఈ వ్యాధి 2022లో అకస్మాత్తుగా వచ్చింది. తర్వాత క్రమక్రమంగా పరిస్థితి దిగజారి తన ఇంట్లోనే తాను వేరుగా ఉండే స్థితికి వచ్చేసింది. ఇంతకీ హైపరాక్యుసిస్ అంటే ఏమిటంటే ..

హైపరాక్యుసిస్ అంటే..
హైపరాక్యుసిస్‌ అనేది ఆ వ్యాధి తీవ్రత బట్టి వివిధ రకాలుగా ఉంటుంది. ఈ వ్యాధి బారినపడ్డ వారికి నిత్యం వినిపించే శబ్దాలే వాళ్లకి  బిగ్గరగా వినిపిస్తున్నట్లు ఉంటుంది. ఇది చాలా బాధకరంగా ఉంటుంది. ఇలాంటి వ్యక్తలకు నాణేలు శబ్దం నుంచి.. కుక్క అరవడం, కారు ఇంజిన్ శబ్దం, ఎవరైనా చూయింగ్‌ గమ్ నమలడం, వాక్యూమ్ క్లీనర్ శబ్దం ఇలా దేన్ని  భరించలేరు. ప్రతీ శబ్దం వారిపై ప్రభావం చూపిస్తుంటుంది. 

తల పగిలిపోయేంత నొప్పి..
ఇక కరెన్‌ ఈ వ్యాధి కారణంగా ఇయర్ ప్లగ్స్, ఇయర్ డిఫెండర్స్ వంటివి పెట్టుకుంటూ ఉంటుంది. కేవలం సైగలు, రాతలతోనే కుటుంబంతో సంభాషిస్తారామె. ఇది తనకు ఎగజిమ్ముతున్న లావా లాంటి పదార్థాన్ని చెవిలో పోసినట్లు అనిపిస్తుందని వేదనగా చెబుతోంది కరెన్‌. అంతేగాదు తల పగిలిపోయేలా, తలంతా నొప్పిగా అనిపిస్తుందట. ఒకరకమైన మైగ్రెన్‌ నొప్పిలా ఉంటుందని అంటోంది. ఒక్కోసారి ఇది భరించలేకు తలను రెండు ముక్కలు చేయాలనిపిస్తుందని ఆవేదనగా చెబుతోంది. ఈ వ్యాధి వల్ల మాతృత్వాన్ని ఆస్వాదించలేకపోతున్నానంటూ కన్నీటిపర్యంతమయ్యింది. తన ఏడేళ్ల, పదుకొండేళ్ల పిల్లలకు దూరమయ్యానని వేదనగా చెప్పుకొచ్చింది.

చివరికి తన భర్తతో కలిసి ఆనందంగా బయటకు వెళ్లలేను, అస్సలు ఏం చేయలేనంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఒకరకంగా తన జీవితాన్ని మొత్తం కోల్పోయానని బాధగా చెప్పారామె. ఇక కరెన్‌ విమాన సిబ్బందిగా పనిచేసేది. దాన్నేమె ఉద్యోగం గాక గుర్తింపుగా భావించేదని కరెన్‌ భర్త నిక్‌ అన్నారు. తాము ఎప్పుడూ ఎలాంటి ప్లాన్‌లు లేకుండా హాయిగా ట్రిప్స్‌కి వెళ్లిపోయి ఎంజాయ్‌ చేసేవాళ్లం ఇప్పుడూ పరిస్థితి అర్థంకానీ విధంగా భారంగా మారిపోయిందన్నారు. 

అయితే ఈ వ్యాధికి చికిత్స మాత్రం లేదట. ఇలాంటి సమస్యతో బాధపడే కొందరు రోగులకు వైట్ నాయిస్ వంటి శబ్దాలను వినేలా చేసి ఆ శబ్దాలను భరించే స్థాయిలను అభివృద్ధి చేస్తున్నట్లు యూకే జాతీయ ఆరోగ్య కమిషన్‌ పేర్కొంది. ఇక్కడ వైట్‌ నాయిస్‌ అంటే నిరంతరం బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపించే చిన్న శబ్దాలు. అయితే ఈ వినసొంపైన చిన్న శబ్దాలు ప్రకృతికి సంబంధించివైనా ఉండొచ్చు. కానీ కరెన్‌ విషయంలో ఇది కూడా పనిచేయలేదు. ఆఖరికి పలురకాల థెరఫీలను ప్రయత్నించారు. అవి కూడా పనిచేయలేదు. తన పిల్లల గురించే తాను ఈ వ్యాధి చికిత్స కోసం 18 నెలలుగా అన్వేషిస్తున్నట్లు తెలిపారు. కరెన్‌ ఏదో ఒక రోజు తన వ్యాధి నయమయ్యే చికిత్స లభిస్తుందని ఆశగా ఎదురచూస్తుంది. నిజంగా ఇది మాటల్లో చెప్పలేనంత దయనీయమైన స్థితి కదూ.!

(చదవండి: రెడ్‌లైట్‌ థెరఫీతో షుగర్‌ వ్యాధిని తగ్గించొచ్చా? పరిశోధనలో షాకింగ్‌ విషయాలు)

Advertisement
Advertisement