కేవైసీ అప్‌డేట్‌ పేరుతో.. | Cyber Crime Cases File in Hyderabad | Sakshi
Sakshi News home page

సై‘డర్‌’ క్రైమ్‌!

Published Sat, May 23 2020 9:43 AM | Last Updated on Sat, May 23 2020 9:43 AM

Cyber Crime Cases File in Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: నగరంలో వెలుగులోకి వస్తున్న సైబర్‌ నేరాలు దడపుట్టిస్తున్నాయి. ఒక్కోసారి ఒక్కో పంథాలో రెచ్చిపోతున్న నేరగాళ్లు అందినకాడికి దండుకుంటున్నారు.  ఐదుగురి నుంచి రూ.3.57 లక్షలు కాజేశారు. బాధితులు శుక్రవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసులు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.  

మలక్‌పేట ప్రాంతానికి చెందిన వ్యక్తికి ఫేస్‌బుక్‌ ద్వారా జెర్సీ క్లారా అనే యువతిగా చెప్పుకున్న సైబర్‌ నేరగాడితో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లు ఇరువురూ ఫేస్‌బుక్‌ ద్వారానే చాటింగ్‌ చేసుకున్నాక... ఫోన్‌ నంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. ఓ సందర్భంలో తనకు త్వరలో పదోన్నతి రావాల్సి ఉందని, దానికోసం ప్రార్థన చేయమంటూ జెర్సీ కార్లా నగరవాసికి చెప్పింది. అలానే చేశానంటూ మరుసటి రోజు బాధితుడు వాట్సాప్‌ ద్వారా సందేశం ఇచ్చాడు. కొన్ని రోజుల తర్వాత తనకు పదోన్నతి వచ్చిందని, దానికి నీ ప్రార్థనలే కారణంటూ ఫోన్‌ చేసి కృతజ్ఞతలు చెప్పింది. అందుకు ఓ బహుమతి పంపుతున్నానని పేర్కొంది. నా తర్వాత రెండుమూడు రోజులకు కొరియర్‌ సంస్థ నుంచి అంటూ కొందరు కాల్‌ చేశారు. మీ పేరుతో విదేశాల నుంచి వచ్చిన ఖరీదైన బహుమతులకు కస్టమ్స్‌ డ్యూటీ కట్టాల్సి ఉందని అన్నారు. దీంతో బాధితుడు జెర్సీని సంప్రదించగా... తాను కట్టడం మర్చిపోయానని, ఆ పార్శిల్‌లో మొత్తం 13 వేల డాలర్లు ఉన్నట్లు చెప్పింది. దీంతో బాధితుడు కొరియర్‌ సంస్థకు చెందిన వారిగా చెప్పిన వారికికు పలు దఫాలుగా రూ.1.26 లక్షలు చెల్లించాడు. వారు మరికొంత మొత్తం డిమాండ్‌ చేయడంతో తాను మోసపోయినట్లు గుర్తించి సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేశాడు.  

నగరానికి చెందిన ఓ వ్యక్తి ఈ–మెయిల్‌ను సైబర్‌ నేరగాళ్లు హ్యాక్‌ చేశారు. అందులో ఉన్న కాంటాక్టŠస్‌ నుంచి ఒకదాన్ని ఎంపిక చేసుకున్నారు. ఆ మెయిల్‌ కలిగిన వ్యక్తి మాదిరిగానే అతడి స్నేహితుడికి ఈ–మెయిల్‌ పంపారు. అందులో తనకు అర్జంట్‌గా రూ.50 వేలు కావాలంటూ చెప్పి తమ బ్యాంకు ఖాతా వివరాలు పొందుపరిచారు. దీనిని అందుకున్న వ్యక్తి తన స్నేహితుడే ఈ–మెయిల్‌ పంపి ఉంటాడని భావించి ఆ మొత్తం చెల్లించాడు. చివరకు విషయం తెలుసుకుని సైబర్‌ ఠాణాలో ఫిర్యాదు చేశాడు.  

టోలీచౌకీ ప్రాంతానికి చెందిన ఓ టిఫిన్‌ సెంటర్‌ నిర్వాహకురాలికి ఫోన్‌ చేసిన సైబర్‌ నేరగాళ్లు తమకు అల్పాహారం కావాలంటూ ఆర్డర్‌ ఇచ్చారు. అందుకు నగదును ఆన్‌లైన్‌లో చెల్లిస్తున్నామంటూ చెప్పారు. ఆమెకు గూగుల్‌ పే ద్వారా క్యూఆర్‌ కోడ్స్‌ పంపారు. సదరు నిర్వాహకురాలు వాటిని స్కాన్‌ చేయడంతో తన ఖాతా నుంచి రూ.60 వేలు నేరగాళ్లకు వెళ్ళిపోయాయి.  

పేటీఎం ఖాతాకు చెందిన కేవైసీ అప్‌డేట్‌ పేరుతో నేరగాళ్లు నగరవాసికి ఫోన్‌ చేశారు. అతడి ఫోన్‌లో క్విక్‌ సపోర్టు యాప్‌ డౌన్‌లోడ్‌ చేయించారు. దాని ద్వారా బాధితుడి బ్యాంకు ఖాతా వివరాలు సంగ్రహించేందుకు రూ. 10 పేటీఎం ఖాతాలో డిపాజిట్‌ చేయాలంటూ సూచించారు. అతడు అలా చేస్తున్నప్పుడు బ్యాంకు ఖాతా వివరాలు సంగ్రహించి అందులో నుంచి రూ.79 వేలు కాజేశారు.  

ఓ రిటైర్డ్‌ ఉద్యోగికి బ్యాంకు అధికారులుగా ఫోన్‌ చేసి, ఏటీఎం కార్డు అప్‌డేట్‌ పేరుతో వల వేశారు. అతడి ఖాతా వివరాలు, ఓటీపీ తెలుసుకుని రూ.42 వేలు స్వాహా చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement