వివరాలు వెల్లడిస్తున్న సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్
సాక్షి, సిటీబ్యూరో: కారు షోరూమ్ యజమానినంటూ బ్యాంక్ అధికారులకు ఫోన్లు చేసి బ్యాంక్ ఖాతా వివరాలు చెప్పి తన వ్యక్తిగత బ్యాంక్ ఖాతాకు రూ.8 లక్షలు బదిలీ చేయించుకుని మోసం చేసిన ప్రధాన నిందితుడితో పాటు మరో ముగ్గురిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.మూడు లక్షల నగదు, వోక్స్ వ్యాగన్ పోలో కారు, ఏడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో క్రైమ్స్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని, ఏసీపీ శ్రీనివాస్‌తో కలిసి సీపీ సజ్జనార్ మంగళవారం వివరాలు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన అరుణ్‌కుమార్ 12వ తరగతి వరకు చదువుకున్నాడు, ఓ దాడి కేసులో దస్నా జైలుకు వెళ్లిన అతడికి వీరేందర్ సాహూ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అతడి నుంచి నేరాలు చేయడంపై అవగాహన పెంచుకున్న అరుణ్‌కుమార్ తన స్నేహితులైన మోహిత్ కుమార్, మనోజ్‌కుమార్, ఢిల్లీకి చెందిన లోకేశ్ తమర్‌లతో కలిసి తొలుత వీరేంద్ర సాహూకు కమీషన్ పద్ధతిన బ్యాంక్ ఖాతాలు సమకూర్చేవారు. అనంతరం స్వయంగా మోసాలు మోదలు పెట్టిన అరుణ్ కుమార్ సైబర్ నేరాలను ఎంచుకున్నాడు.
ఇందులో భాగంగా ఇంటర్నెట్‌లో పలు నగరాల్లోని కారు షోరూమ్ వివరాలు సేకరించి ఆయా సంస్థల్లోని సేల్స్ టీమ్స్‌కు ఫోన్లు చేసి షోరూమ్ యజమాని పేరు, బ్యాంక్ పేరు, ఖాతాల వివరాలు సేకరించేవాడు. దీంతో పాటు కార్లు కొనుగోలు చేస్తున్నట్లు చెప్పడంతో అతడి వలలో పడిన షోరూం నిర్వాహకులు క్యాన్సల్డ్ చెక్‌ను వాట్సాప్ ద్వారా పంపేవారు. పూర్తి వివరాలు సేకరించిన అనంతరం అరుణ్‌కుమార్ పథకం ప్రకారం సదరు షోరూమ్ బ్యాంక్ ఖాతా ఉన్న అధికారులకు ఫోన్ చేసి మీ బ్యాంక్‌లో భారీగా ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేయాలనుకుంటున్నట్లు చెప్పి వారిని వలలో వేసుకునేవాడు. వారు తన మాటలతో సంతృప్తి చెందినట్లు భావించిన అనంతరం ఒరిజినల్ చెక్‌ను బ్యాంక్‌కు పంపిస్తానని తన షోరూమ్ బ్యాంక్ ఖాతా నుంచి ఇతర బ్యాంక్ ఖాతాలకు డబ్బులు జమచేయించుకునేవాడు. ఇదే తరహాలో సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని ఓ బ్యాంక్ మేనేజర్ రూ.8,20,000 బదిలీ చేశాడు. అనంతరం తాను మోసపోయినట్లు గుర్తించిన అతను ఈ నెల 10న సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన ఇన్‌స్పెక్టర్ కె.శ్రీనివాస్ నేతృత్వంలోని బృందం టెక్నికల్ డాటాతో ఉత్తరప్రదేశ్‌లో నిందితుడిని అదుపులోకి తీసుకుని ట్రాన్సిట్‌వారంట్‌పై మంగళవారం సిటీకి తీసుకొచ్చారు. న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ‘కారు షోరూమ్ ఉద్యోగులు యజమాన్య వివరాలను గుర్తు తెలియని వ్యక్తులతో ఫోన్ లో షేర్ చేయవద్దు. వాట్సాప్‌లలో కూడా చెక్‌లు పంపవద్దు. అలాగే బ్యాంక్ అధికారులు కూడా తమ కస్టమర్లు చెక్ ఇచ్చిన తర్వాతే నగదు బదిలీచేయాలి’ అని సీపీ సజ్జనార్ సూచించారు. ముఠాను పట్టుకున్న సిబ్బందిని రివార్డులతో సత్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment