సాక్షి, సిటీబ్యూరో: సంగీత పరికరాలను థాయ్‌లాండ్ నుంచి తక్కువ ధరకు సరఫరా చేస్తానంటూ ఎర వేసిన సైబర్ నేరగాళ్లు నగరవాసి నుంచి రూ.3.2 లక్షలు కాజేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్ కేవీఎం ప్రసాద్ దర్యాప్తు ప్రారంభించారు. చాదర్‌ఘాట్‌కు చెందిన రాఘవేంద్ర చారి ‘కీ బోర్డు’ ఖరీదు చేసేందుకు ఇంటర్‌నెట్‌లో సెర్చ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన దృష్టి నెప్టాల్‌ఇన్‌స్ట్రూమెంట్స్.కామ్ అనే సైట్‌పై పడటంతో అందులో వెతికారు. ఆ తర్వాత ఆ సైట్ నుంచి చస్ అమానీ పేరుతో ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. థాయ్‌లాండ్‌కు చెందిన తమ కంపెనీ తక్కువ ధరకు ‘కీ బోర్డు’ విక్రయిస్తుందంటూ ఎర వేశాడు.
ఆశపడిన రాఘవేంద్ర కొంత మొత్తం వారు సూచించిన ఖాతాలో వేశారు. కొన్ని రోజులు వేచి చూసినా తన వాద్య పరికరం రాకపోవడంతో వెబ్‌సైట్‌లో ఉన్న కంపెనీ ఫోన్ నెంబర్‌కు కాల్ చేశాడు. అవతలి వైపు నుంచి జార్జ్‌గా చెప్పుకున్న వ్యక్తి మాట్లాడుతూ తాము చస్ అమానీని ఆరు నెలల క్రితమే ఉద్యోగం నుంచి తొలగించామని, మా సైట్ వల్ల నష్టపోయిన మీకు తక్కువ ధరకు కీబోర్డ్ అందించడానికి సిద్ధంగా ఉన్నామంటూ చెప్పడంతో రాఘవేంద్ర దాదాపు రూ.6 లక్షల విలువైన రెండింటిని బుక్ చేశారు.
అడ్వాన్స్ చెల్లించాలంటూ జార్జ్ చెప్పడంతో కొంత డిపాజిట్ చేశారు. మిగిలిన సొమ్ము కీబోర్డ్స్ డెలివరీ అయిన తర్వాత ఇవ్వాలంటూ చెప్పాడు. బాధితుడికి ఓ బుకింగ్ ఐడీని సైతం ఇచ్చిన నేరగాళ్లు దీన్ని వినియోగించి తమ వెబ్‌సైట్ ద్వారా కీబోర్డ్ ఎక్కడి వరకు వచ్చాయో ట్రాక్ చేసుకోవచ్చని నమ్మించారు. ఓ దశలో ఢిల్లీ వరకు సరుకు వచ్చినట్లు ట్రాక్ అయింది. ఆపై ఢిల్లీలో కస్టమ్స్ క్లియెరెన్స్ లేకపోవడంతో డెలివరీ ఆగిందంటూ జార్జ్ ఫోన్ చేసి చెప్పి మరికొంత డిపాజిట్ చేయమన్నాడు. ఆపై నాగ్‌పూర్‌లో కస్టమ్స్ క్లియరెన్స్ అని చెప్పి మరికొంత మొత్తమ్మీద రూ.3.2 లక్షలు స్వాహా చేశారు. చివరకు మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.
Comments
Please login to add a commentAdd a comment