సాక్షి, సిటీబ్యూరో: సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియా కేంద్రంగా సెలబ్రిటీలకు సవాల్ విసురుతున్నారు. ప్రముఖుల పేర్లు, వివరాలు, ఫొటోలు వినియోగిస్తూ యువతులకు వలవేస్తున్నారు. సిటీ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఇటీవల ఈ తరహా కేసులు మూడు నమోదయ్యాయి. ఇలాంటి నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, పూర్తి వివరాలు నిర్ధారించుకోనిదే వ్యక్తిగత వివరాలు, ఫొటోలు పంపిస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సెలబ్రెటీలకు సంబంధించి నమోదైన మూడు కేసుల్లో ఒక కేసులో నిందితుడిని పట్టుకున్న అధికారులు మిగిలిన కేసులను సాంకేతికంగా దర్యాప్తు చేస్తున్నారు.
విజయ్ దేవరకొండగా పేరుతో..
నిజామాబాద్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ పేరుతో ఫేస్‌బుక్‌లో నకిలీ ప్రొఫైల్ క్రియేట్ చేశాడు. తాను ఆయన పర్సనల్ మేనేజర్‌ను అని, ఆయన్ను కలవాలంటే సంప్రదించాలంటూ ఓ ఫోన్ నంబర్ పొందుపరిచాడు. విజయ్ దేవరకొండ గొంతును అనుకరించగలగటం కూడా ఈ యువకుడికి కలిసి వచ్చింది. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న అతను పలువురు యువతులతో విజయ్ దేవరకొండ మాదిరిగా మాట్లాడాడు. ఎవరైనా కలవాలని కోరితే... తనను కాదని, మొదట తన డబ్బింగ్ ఆర్టిస్టును కలవాలంటూ తనకు సంబంధించిన మరో నంబర్ ఇచ్చేవాడు. దీనికి కాల్ చేసిన వారితోనూ మాట్లాడటం, చాటింగ్ చేయడం చేశాడు. ఓ యువతికి ప్రేమ పేరుతో ఎర వేసిన ఈ యువకుడు ఆమె కలిసేందుకు హైదరాబాద్‌కు వచ్చేశాడు. ఈ లోగా విజయ్ దేవరకొండ సంబంధీకులు సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. సాంకేతికంగా దర్యాప్తు చేపట్టిన అధికారులు నగరానికి వచ్చిన సదరు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.
డైరెక్టర్ అజయ్ భూపతినంటూ...
కేవలం హీరోలే కాదు... దర్శకుల పేరుతోనూ సైబర్ నేరగాళ్లు తమ ‘పని’ పూర్తి చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆర్‌ఎక్స్ 100 సినిమా దర్శకుడు అజయ్ భూపతి పేరుతో అమ్మాయిలకు వల వేసిన ఉదంతం ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఆయన పేరుతో ప్రొఫైల్ క్రియేట్ చేసిన సైబర్ నేరగాళ్లు ఫేస్‌బుక్ కేంద్రంగా యువతుల వివరాలు సేకరించాడు. ఇలా పరిచయం చేసుకుని వారితో వాట్సాప్ ద్వారా చాటింగ్ చేయడం మొదలెట్టాడు. వారితో తాను అజయ్ భూపతిగానే వారితో పరిచయం చేసుకున్నాడు. తాను త్వరలో విజయ్ దేవరకొండ, విశాల్‌లతో సినిమా తీయబోతున్నానని, అందులో నటించే అవకాశం కల్పిస్తానంటూ పలువురిని నమ్మించాడు. ఇలా ఎంపిక పేరుతో ఆ యువతుల నుంచి వ్యక్తిగత ఫొటోలు సైతం సేకరించి వారిని వేధించడం మొదలెట్టాడు. ఇటీవల ఈ విషయం తెలుసుకున్న దర్శకుడు అజయ్ భూపతి తీవ్రంగా పరిగణించారు. తన పేరును వినియోగిస్తూ, యువతులను మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
ప్రముఖ నిర్మాణ సంస్థ పేరుతో...
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ పేరుతో మోసాలకు తెర లేపిన వ్యవహారం గత వారం వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియా కేంద్రంగా ఈ సంస్థ పేరుతో సైబర్ క్రిమినల్స్ ప్రొఫైల్ క్రియేట్ చేశారు. దీని ఆధారంగా ఆ సంస్థలో పని చేసే డిజైనర్, మేకప్ మ్యాన్స్‌గా తమను తాము పరిచయం చేసుకున్నారు. వీరిని సంప్రదించిన యువతులతో సినిమాలో నటించే అవకాశం ఇస్తామంటూ ఎర వేశారు. ఓ ప్రముఖ హీరోతో తమ సంస్థ తమిళ చిత్రం నిర్మించబోతోందని, అందులో హీరోయిన్‌గా నటించడానికి అవకాశం ఇస్తానంటూ నమ్మబలికారు. అయితే ఈలోపు విషయం గీతా ఆర్ట్స్ నిర్వాహకులకు తెలిసింది. దీంతో ఆ సంస్థ మేనేజర్ తమ బ్యానర్ పేరు చెప్పి అమ్మాయిలను మోసం చేస్తున్న వ్యక్తి పై చర్యలు తీసుకోవాలంటూ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ కేసుల్ని సాంకేతికంగా దర్యాప్తు చేస్తున్న అధికారులు బాధ్యుల్ని గుర్తించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
అవకాశాలు అంత తేలికకాదు
ఈ సైబర్ నేరగాళ్లు ఎక్కువగా యువతులనే టార్గెట్ చేసుకుంటున్నారు. సినీ హీరో, దర్శకుడు, నిర్మాణ సంస్థ.. ఇలా వివిధ పేర్లు చెబుతూ నటించే అవకాశాల పేరుతో ఎర వేస్తున్నారు. ఆడిషన్లు నిర్వహిస్తామంటూ, అందుకు ఎంపికలు జరుగుతాయంటూ ఫొటోలు సంగ్రహిస్తున్నారు. సినిమాల్లో అవకాశాలు రావడం అంత తేలికకాదని, సోషల్‌మీడియా ద్వారా ఆ ఎంపికలు జరగవని గుర్తుంచుకోవాలి. నేరుగా సంప్రదించిన తర్వాతే ఎదుటి వారికి ఫొటోలు పంపడం వంటివి చేయాలి. అలా కాకుంటే బ్లాక్‌మెయిలింగ్ తదితర తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
– సైబర్ క్రైమ్ పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment