సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని బేగంపేట ప్రాంతానికి చెందిన డాక్టర్ కమ్ డిజైనర్‌ను సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేశారు. ఈయన రూపొందించిన వస్త్ర డిజైన్లు నచ్చాయంటూ సంప్రదించారు. ఖరీదు చేసేందుకు వస్తున్నామంటూ చెప్పి కస్టమ్స్ డ్రామా ఆడారు. మొదట రూ.65 వేలు కాజేసిన నేరగాళ్లు మరో రూ.1.5 లక్షలకు ఎర వేయడంతో డాక్టర్‌కు అనుమానం వచ్చింది. ఆయన బుధవారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. బేగంపేటకు చెందిన ఓ వైద్యుడు బీబీనగర్‌లోని ఎయిమ్స్‌లో పని చేస్తుంటారు. ఈయనకు వస్త్రాల డిజైనింగ్‌పైనా పట్టుంది. తాను రూపొందించిన డిజైన్లలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వెబ్‌సైట్‌లో పొందుపరుస్తూ ఉంటారు. వీటిని చూసిన సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటూ రంగంలోకి దిగారు. సదరు డాక్టర్‌కు వాట్సాప్ ద్వారా ఫోన్ చేసిన ఓ వ్యక్తి తన పేరు టేలర్ రైట్ అని, తాను లండన్ నుంచి మాట్లాడుతున్నట్లు పరిచయం చేసుకున్నాడు. సదరు వెబ్‌సైట్‌లో ఉన్న వస్త్రాల డిజైన్లు తనను ఆకట్టుకున్నాయంటూ వారం రోజుల పాటు సంప్రదింపులు జరిపాడు. ఆపై వాటిని తాను ఖరీదు చేస్తానని, అందుకోసం ఇండియాకు వస్తున్నానంటూ చెప్పాడు. ఇది జరిగిన మరుసటి రోజు ముంబై కస్టమ్స్ విభాగం పేరుతో వైద్యుడికి ఫోన్ వచ్చింది. మిమ్మల్ని కలవడానికి, మీరు రూపొందించిన డిజైన్లు ఖరీదు చేయడానికి లండన్ నుంచి టేలర్ ౖరైట్ అనే వ్యక్తి వచ్చాడంటూ చెప్పారు.
ఆయన తనతో పాటు 75 వేల డాలర్లు తీసుకువచ్చారని, కస్టమ్స్ నిబంధనల ప్రకారం అంత మొత్తంలో విదేశీ కరెన్సీ తీసుకురావడం నేరం కావడంతో అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. తన కోసం వచ్చిన విదేశీయుడు కష్టాల్లో చిక్కుకున్నారని భావించిన డాక్టర్ ఆయన్ను విడిచిపెట్టాలంటే ఏం చేయాలంటూ ఫోన్ చేసిన వారిని కోరాడు. పన్నుగా చెల్లించాల్సిన రూ.65 వేలు పంపాల్సిందిగా ఓ బ్యాంకు ఖాతా నెంబర్ ఇచ్చారు. నిజమేనని నమ్మిన వైద్యుడు ఆ మొత్తం ట్రాన్స్‌ఫర్ చేశారు. ఆపై మరోసారి కాల్ చేసిన నేరగాళ్లు టేలర్‌ను విడిచిపెట్టామని, ఆ నగదు మాత్రం ఆయనకు ఇవ్వడం కుదరదని చెప్పారు. దాన్ని నేరుగా మీ బ్యాంకు ఖాతాలోకే పంపిస్తామంటూ ఎర వేశారు. అలా చేయడానికి ప్రాసెసింగ్ చార్జీలుగా రూ.1.5 లక్షలు చెల్లించాలని వారు చెప్పడంతో వైద్యుడికి అనుమానం వచ్చింది. దీంతో ఆయన బుధవారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న ఇన్‌స్పెక్టర్ జి.వెంకట్రామిరెడ్డి దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక ఆధారాలను బట్టి ఈ నేరం చేసింది నైజీరియన్లుగా అనుమానిస్తున్నారు.
బ్యాంక్ ఉద్యోగినితోనే స్కానింగ్ చేయించి..
‘ఓఎల్‌ఎక్స్ నేరగాళ్లు’ నగరానికి చెందిన ఓ బ్యాంకు ఉద్యోగినినే టార్గెట్‌గా చేసుకున్నారు. ఆమెతోనే వారు పంపిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేయించి, రూ.44 వేలు కాజేశారు. సదరు బ్యాంకు ఉద్యోగిని ఇటీవల తన ఫర్నిచర్ విక్రయించడానికి ఓఎల్‌ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దీన్ని చూసిన ఓ వ్యక్తి ఆమెను సంప్రదించి ఖరీదు చేయడానికి ఆసక్తి చూపారు. తాను ఆర్మీ ఉద్యోగినంటూ పరిచయం చేసుకున్న అతగాడు తమ నిబంధనల ప్రకారం డబ్బు చెల్లించడం నిషేధమని చెప్పాడు. గూగుల్ పే ద్వారా చెల్లిస్తానంటూ చెప్పడంతో ఆమె అంగీకరించారు. ఆమె గూగుల్ పే ఖాతా ఉన్న ఫోన్‌నంబర్‌కు ఓ క్యూఆర్ కోడ్ పంపిన సైబర్ నేరగాళ్లు దాన్ని స్కాన్ చేయాలని సూచించారు. ఆపై అందులో ‘ప్రొసీడ్ టు పే’ అంటూ కనిపించడం, దాని కింద కొంత మొత్తం కనిపిస్తుండటంతో సందేహించిన ఆమె అనుమానం వ్యక్తం చేశారు. అలా చేస్తేనే డబ్బు మీ ఖాతాలోకి వస్తుందని, కింద కనిపిస్తున్న మొత్తం తమ ఖాతాలో ఉన్న బ్యాలెన్స్ అని చెప్పాడు. దీంతో ఆమె పే చేయడంతో నగదు ఆమె నుంచి అతడి ఖాతాలోకి వెళ్ళిపోయింది. ఆ మొత్తం రిఫండ్ ఇస్తామంటూ చెప్పిన అవతలి వ్యక్తి ఇలా మరో రెండుసార్లు చేయించాడు. మొత్తం రూ.44 వేలు పోగొట్టుకున్న బ్యాంకు ఉద్యోగిని బుధవారం హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న ఇన్‌స్పెక్టర్ మధుసూదన్ దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment