ఫోన్‌ హ్యాక్‌.. #*#4636#*#* ఇది డయల్‌ చేస్తే | Cyber Criminals Hacking Mobiles And OTP Passwords Hyderabad | Sakshi
Sakshi News home page

'ఖాతా'ర్నాక్‌ హ్యాక్‌

Published Mon, Jun 8 2020 7:40 AM | Last Updated on Mon, Jun 8 2020 7:40 AM

Cyber Criminals Hacking Mobiles And OTP Passwords Hyderabad - Sakshi

కుత్బుల్లాపూర్‌: కరోనా మహమ్మారితో కలవరపడుతున్న ప్రజలను సైబర్‌ క్రైమ్స్‌ కునుకు లేకుండా చేస్తున్నాయి. ఉద్యోగాలు కోల్పోవడం, వ్యాపారాలు కుదేలవడం వంటి పరిమాణాలతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారిలో కొంత మందికి వచ్చే కాల్స్‌తో వారి బ్యాంక్‌ ఖాతాలను ఖాళీ చేస్తున్నాయి. ఫోన్, ఈ–మెయిల్, క్యూఆర్‌ కోడ్స్, ఓటీపీ హ్యాక్‌.. ఇలా పలురకాల దారుల్లో మోసాలు జరుగుతున్నాయి. ఎంతలా అంటే 2019 సంవత్సర కాలంలో సైబర్‌ కేసులు మొత్తం 477 నమోదైతే 2020లో గడిచిన ఐదు నెలలో 485 కేసులు నమోదవడం చూస్తుంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. లాక్‌డౌన్‌లో ఎక్కువగా కేసులు పెరిగాయి. 2016 నుంచి ఇప్పటి వరకు నమోదైన 1,636 సైబర్‌ కేసుల్లో కొన్ని విచిత్రంగా ఉంటాయి. వీటిలో బాధితులు అసలు మాకు బ్యాంక్‌ ఓటీపీ రాలేదని, అయినా మా ఖాతాలు ఖాళీ అయ్యాయని చెప్పడం చూస్తుంటే మనం వాడే ఫోన్‌ని సైతం ఎలా హ్యాక్‌ చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. బ్యాంక్‌ ఖాతాల నుంచి సొమ్ము బదిలీ కావాలంటే ముఖ్యమైంది బ్యాంక్‌ వారు పంపే ‘ఓటీపీ’నే. అయితే ఈ ఓటీపీ మన ఫోన్‌కు రాకుండానే ఖాతా ఖాళీ అవుతుందంటే మన ఫోన్‌ హ్యాక్‌ అయ్యిందా అన్నది ఓ సారి చెక్‌ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు మన ఫోన్‌ హ్యాక్‌ అయ్యిందా..? అవలేదా..? అయితే ఎలా మళ్లీ మన కంట్రోల్‌లోకి తెచ్చుకోవాలి..? వంటి సెక్యూరిటీ అంశాలు మీ కోసం..

ఇలా తెలుసుకోండి.. 
#*#4636#*#* : ఇది డయల్‌ చేస్తే మన ఫోన్‌లోని పూర్తి టెక్నికల్‌ వివరాలు అంటే సిగ్నల్‌ స్ట్రెంత్, మొబైల్‌ సెక్యూరిటీ, కాల్‌ ఫార్వడింగ్‌ వివరాలు, బ్యాండ్‌ విడ్త్, లోకల్‌ ఏరియా వివరాలు ఇలా మీ ఫోన్లో ఉన్న చిన్నచిన్న వివరాలు అన్ని చూపిస్తుంది. ఈ కోడ్‌ ద్వారా మన ఫోన్‌ సిమ్‌ సెట్టింగ్స్‌ కూడా మార్చుకోవచ్చు.  

నోట్‌: ఈ కోడ్స్‌ ఎంటర్‌ చేసిన తర్వాత ఒక్కో ఫోన్‌లో ఒక్కో మోడల్‌ను అనుసరించి ఫ్లాష్‌ మెసేజ్‌లు కనిపిస్తాయి. తదనుగుణంగా మనం పరిశీలించుకోవాలి. అదేవిధంగా పైకోడ్స్‌లో ఏవి డయల్‌ చేసినా ‘ఎనబల్‌’ అని కనిపిస్తే ఫార్వర్డింగ్‌లో ఉన్నట్లు లెక్క.. అయితే కాల్‌ ఫార్వర్డింగ్‌ వేన్‌ నాట్‌ రీచబల్‌ అని వస్తే సదరు నెంబరును సరి చూసేకుని అది మీకు సంబంధించినది అయితే అలాగే కంటిన్యూ అవ్వవచ్చు.   

ఇలా తెలుసుకోండి..  
మన ఫోన్‌ నుంచి మనకు తెలియకుండా ఎవరికైనా కాల్‌ ఫార్వర్డ్‌ అవుతుండటం, ఎస్‌ఎంఎస్‌లు వెళ్తుండటం వంటి విషయాలను డయల్‌ ప్యాడ్‌ నుంచి కొన్ని కోడ్స్‌ ఎంటర్‌ చేసి తెలుసుకోవచ్చు.  
#21# ఈ కోడ్‌ ఎంటర్‌ చేసి డయల్‌ చేస్తే మీ ఫోన్‌ కాల్‌ ఫార్వర్డ్‌ అవుతుందా? కాల్‌ డైవర్షన్‌ వంటివి జరుగుతున్నాయా లేదో తెలుసుకోవచ్చు. డయల్‌ చేసిన కొన్ని సెకన్లలో స్క్రీన్‌పై ఫ్లాష్‌ మెసేజ్‌ వస్తుంది. అక్కడ కనిపించే డైలాగ్‌ బాక్స్‌లో మన సమాచారం తెలుస్తుంది. ఇక్కడ ఫార్వడింగ్‌ అని వస్తే మీ మొబైల్‌ హ్యాక్‌ అయిపోయినట్లే.  
#62# ఫార్వడింగ్‌ అని వస్తే ఈ కోడ్‌ డయల్‌ చేయాలి. ఈ కోడ్‌ని రిపిటెడ్‌గా మూడుసార్లు చేస్తే మీ కాల్స్‌ లేదా ఎస్‌ఎంఎస్‌లు ఏమైనా ఫార్వడింగ్‌ ఆగిపోతాయి.  
#002# ఈ కోడ్‌ని డయల్‌ చేస్తే ఎప్పటికీ మన ఫోన్‌ నుంచి కాల్స్‌ ఫార్వర్డ్‌ అవ్వవు. ముఖ్యంగా సిమ్‌ అప్పుడప్పుడు వాడే వారు, రోమింగ్‌లో వేరే ఫోన్‌ నంబరు వాడే వారికి ఈ కోడ్‌ ఉపయోగపడుతుంది. ఇప్పటి వరకు ఏమైనా కాల్‌ ఫార్వడింగ్‌ ఉంటే అన్ని ఎరైస్‌ అయిపోతాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement