సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మహేష్ కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ సర్వర్‌ను హ్యాక్ చేసి రూ.12.93 కోట్లు కొల్లగొట్టిన వ్యవహారంలో కీలకాంశాలను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. యూరోపియన్ దేశమైన రొమేనియాకు చెందిన ఐపీ అడ్రస్‌తో జావా స్క్రిప్ట్ ఫైల్(జేఎస్‌డబ్ల్యూ) పంపడం ద్వారా ఈ పని చేసినట్లు తేల్చారు. బ్యాంక్ డబ్బును ‘పంచుకున్న’గ్యాంగ్స్‌లో రెండింటిని పట్టుకున్న అధికారులు మరో రెండింటి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.
అడ్మిన్ మెయిల్‌ను స్ఫూఫ్ చేసి...
లక్నోకు చెందిన లక్కీ డార్క్ నెట్‌లో చేసిన ప్రకటనతో సైబర్ నేరగాళ్లు రంగంలోకి దిగారు. వీరిలో గతేడాది జూలైలో తెలంగాణ కో–ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ సర్వర్‌ను హ్యాక్ చేసి రూ.1,96,88,136 కాజేసిన నైజీరియన్లు ఉన్నారు. అలా వీరికి హైదరాబాద్‌లోని కో–ఆపరేటివ్ బ్యాంకులపై అవగాహన ఉండటంతో ప్రాథమిక పరిశీలన చేసి మహేష్ బ్యాంక్ ను ఎంచుకున్నారు. రొమేనియాకు చెందిన ఐపీ అడ్రస్‌తో అంతర్జాతీయంగా సేవలు అందించే ఎం247 సంస్థ వీపీఎన్‌ను వాడుకున్నారు.
వీటి ద్వారా గతేడాది నవంబర్‌లో మహేష్ బ్యాంకునకు సంబంధించిన అన్ని కార్యాలయాల్లోని కంప్యూటర్లకూ ఒకేసారి కీ–లాగర్స్ పంపారు. ఆ బ్యాంక్ అడ్మిన్ మెయిల్ ఐడీని స్ఫూఫ్ చేసిన సైబర్ నేరగాళ్లు దాని నుంచి ఆర్టీజీఎస్ అప్‌డేట్ పేరుతో జేఎస్‌డబ్ల్యూ ఫైల్ పంపారు. బ్యాంక్ నెట్‌వర్క్‌కు సరైన ఫైర్‌వాల్స్ లేకపోవడంతో ఈ కీ–లాగర్స్‌తో కూడిన మెయిల్ కంప్యూటర్ల వరకు చేరింది. అక్కడ పనిచేసే సిబ్బందికి సైతం సైబర్ సెక్యూరిటీపై అవగాహన లేకపోవడంతో ప్రొసీడ్ అని కొట్టడంతో కీ–లాగర్స్ వారి కంప్యూటర్లలో ఇన్‌స్టాల్ అయిపోయాయి. దీని ద్వారానే గత నెల 22, 23 తేదీల్లో బ్యాంక్ చెస్ట్ ఖాతాకు సంబంధించిన రూ.12.93 కోట్లను స్వాహా చేశారు.
పరారీలో నగరానికి చెందిన గ్యాంగ్స్...
ఈ విషయం తెలుసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు నిపుణుల సాయంతో ఆ రెండు కంప్యూటర్లనూ స్వాధీనం చేసుకున్నారు. వాటికి ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించి హ్యాకర్లకు సంబంధించిన ఆ«ధారాలు సేకరించారు. యూపీ వాసి లక్కీతో పాటు నాగోల్‌లోని శాన్విక ఎంటర్‌ప్రైజెస్, కేపీహెచ్‌బీలోని ఫార్మాహౌస్‌లకు చెందిన కరెంట్ ఖాతాలను వినియోగించిన రెండు ముఠాలను ఇప్పటికే అరెస్టు చేశారు. మరో రెండు గ్యాంగ్స్ పరారీలో ఉన్నాయి.
అంతర్జాతీయ దర్యాప్తు అవసరం
అపెక్స్ బ్యాంక్, మహేష్ బ్యాంక్ సర్వర్లను హ్యాక్ చేయడానికి వాడిన ఐపీ అడ్రస్‌లు, వీపీఎన్ సర్వీస్‌లు ఒకటే. దాని కోసం అంతర్జాతీయ స్థాయిలో దర్యాప్తు చేయాల్సి ఉంది. తొలుత ఎం247 సంస్థ నుంచి లాగిన్ వివరాలు తెలియాలి. అది కూడా అంతర్జాతీయ సంస్థ అయినందున ఆయా దేశాలతో సంప్రదింపులు జరపాల్సి ఉంటుంది.
– నగర పోలీసు ఉన్నతాధికారి
Comments
Please login to add a commentAdd a comment