పోలీసుల అదుపులో సంతోష్‌రెడ్డి
జూబ్లీహిల్స్: కరోనా సమయంలో లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించి యువతీ, యువకులు నిర్వహిస్తున్న ఓ ప్రైవేట్ పార్టీని బంజారాహిల్స్ పోలీసులు భగ్నం చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెం. 2లోని ఓ హోటల్‌లో శనివారం రాత్రి ఎనిమిది మంది యువకులు, ఆరుగురు యువతులతో పాటు ఓ విదేశీ యువతితో కలిసి రేవ్ పార్టీ జరుగుతున్నట్లు సమాచారం అందడంతో టాస్క్‌ఫోర్స్, బంజారాహిల్స్ పోలీసులు అర్ధరాత్రి దాడులు నిర్వహించి వారిని అదుపులోకి తీసుకున్నారు. సదరు యువకులు శనివారం ఉదయం నాలుగు గదులను అద్దెకు తీసుకున్నట్లు తెలిసింది. సాయంత్రం తర్వాత కొందరు యువతులతో పాటు ఓ విదేశీ యువతి అక్కడికి వచ్చారు. (బంజారాహిల్స్‌లో రేవ్ పార్టీ, 8 మందిపై కేసు)
అర్ధరాత్రి దాటిన తర్వాత రేవ్ పార్టీ చేసుకునేందుకు ప్రయత్నాలు చేసిన వీరు మద్యం మత్తులో చిందులేస్తున్నట్లు సమాచారం అందడంతో బంజారాహిల్స్ పోలీసులు దాడులు నిర్వహించి అందరినీ అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా రష్యాకు చెందిన ఓ ఈవెంట్ ఆర్గనైజర్‌ను కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే రేవ్ పార్టీల నిర్వహణలో ఆరితేరిన సంతోష్‌రెడ్డి అనే ఓ పబ్ నిర్వాహకుడు పార్టీకి కూడా సూత్రధారి కావడం గమనార్హం. అతనే ఈ పార్టీ ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఏడాది ప్రారంభంలో జూబ్లీహిల్స్ రోడ్ నెం. 10లోని టాట్ పబ్‌లో సంతోష్‌రెడ్డి సుమారు 30 మంది యువతులతో కలిసి రేవ్ పార్టీ ఏర్పాటు చేసి పోలీసులకు దొరికిపోయాడు. ఆరు నెలలు గడవకముందే మరోసారి పార్టీ నిర్వహిస్తూ పట్టుబడ్డాడు. ఈ ఘటనలో సంతోష్‌రెడ్డితో పాటు భానుకిరణ్, విజయ రామారావు, నగరానికి చెందిన ఓ మంత్రి బంధువు రఘువీర్‌రెడ్డి ఉన్నట్లు సమాచారం.
నిబంధనలకు విరుద్ధంగా పార్టీ
శనివారం రాత్రి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం అందడంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులతో కలిసి దాడి చేశాం. రూమ్ నంబర్ 721లో ముగ్గురు యువకులు, నలుగురు యువతులు సోషల్ డిస్టెన్స్ లేకుండా మద్యం సేవిస్తూ పార్టీ చేసుకోవడం గమనించి వారిని అదుపులోకి తీసుకున్నాం. సంతోష్‌రెడ్డి పుట్టిన రోజు వేడుకలకు హాజరైనట్లు వారు తెలిపారు. వీరందరిపై లాక్‌డౌన్ నిబంధనల ఉల్లంఘనల చట్టం ప్రకారం ఏపిడమిక్ యాక్ట్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, ఎక్సైజ్ చట్టాల కింద కేసులు నమోదు చేశాం. నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నాం.– కళింగరావు, ఇన్‌స్పెక్టర్
Comments
Please login to add a commentAdd a comment