
వివరాలు వెల్లడిస్తున్న అదనపు డీసీపీ కేసీఎస్ రఘువీర్ ,నిందితులు
సాక్షి, సిటీబ్యూరో: విదేశీ ఉద్యోగం పేరుతో ఎరవేసిన సైబర్ నేరగాళ్లు దీనికోసం ప్రత్యేక వెబ్‌సైట్ సృష్టించారు. ఉద్యోగానికి ఎంపిక య్యావంటూ రూ.33 వేలు కట్టించుకున్నారు. ఆ మొత్తం తిరిగి ఇచ్చేస్తున్నామంటూ ఓ లింకు పంపారు... బాధితుడు దానిని ఓపెన్ చేసి, వివరాలు నింపడంతో మరో రూ.1.18 లక్షలు కోల్పోయాడు... ఢిల్లీ కేంద్రంగా సాగిన ఈ దందాను ఛేదించిన సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు అదనపు డీసీపీ కేసీఎస్ రఘువీర్ సోమవారం వెల్లడించారు. ఇన్‌స్పెక్టర్ బి.మధుసూదన్, ఎస్సై వెంకటేష్‌లతో కలిసి వివరాలు వెల్లడించారు.
బోగస్ వెబ్‌సైట్ క్రియేట్ చేసి...
బీహార్‌కు చెందిన సుమంత్ భరద్వాజ్ నేతృత్వంలో ఢిల్లీకి చెందిన ప్రదీప్‌గుప్త, హర్యానాకు చెందిన సునీల్ రాణా ముఠాగా ఏర్పడ్డారు. ఢిల్లీలోని జనక్‌పురి వెస్ట్ ప్రాంతంలో కాల్ సెంటర్ నిర్వహిస్తున్న వీరు (ఠీఠీఠీ. టజిజీn్ఛఛ్చిట్ఛ్ఛట.ౌటజ.జీn) పేరుతో బోగస్ వెబ్‌సైట్ రూపొందించారు. ఇందులో దేశ వ్యాప్తంగా ఉన్న అనేక మల్టీ నేషనల్ కంపెనీలతో పాటు విదేశాల్లోని సంస్థల్లో ఉద్యోగాలు ఉన్నాయంటూ ప్రచారం చేశారు. ఉద్యోగాల కోసం ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసే నిరుద్యోగులు దీనిని చూసి ఆకర్షితులై అందులో తమ వివరాలు పొందుపరుస్తున్నారు. తిలక్‌నగర్ ప్రాంతానికి చెందిన ఓ విద్యార్థి కెనడాలో ఉద్యోగం చేయాలనే ఉద్దేశంతో తన వివరాలను ఈ వెబ్‌సైట్‌లో పొందుపరిచాడు. జూలై 27న కాల్‌సెంటర్ నుంచి ఇతడికి ఫోన్ చేసిన నేరగాళ్లు ఉద్యోగానికి ఎంపికయ్యావంటూ చెప్పారు. విద్యార్థి వారి మాటలు నమ్మడంతో అసలు పని ప్రారంభించారు. ఉద్యోగానికి సంబంధించిన అపాయింట్‌మెంట్ ఆర్డర్ ఇచ్చేందుకు కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయని తెలిపారు.
రిఫండ్ చేస్తామంటూ...
వివిధ కార్యకలాపాల నిమిత్తం కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుందని, అపాయింట్‌మెంట్ లెటర్‌తో పాటు ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించేస్తామని తెలిపారు. అందుకు అతను సమ్మతించడంతో ఎడ్యుకేషన్ వెరిఫికేషన్ కోసం రూ.13,003, మేనేజ్‌మెంట్ ఫ్రొఫైల్ క్రియేట్ చేసేందుకు మరో రూ.20,886 చెల్లించాలన్నారు. ఈ మొత్తాలను తమ వెబ్‌సైట్‌లో ఉన్న లింకు ద్వారా పే చెయ్యాలని చెప్పడంతో విద్యార్థి అలానే చేశాడు. ఆగస్టు 16న రోబిన్ డిసౌజా పేరుతో కాల్ చేసిన వ్యక్తి అపాయింట్‌మెంట్ ఆర్డర్ సిద్ధంగా ఉందని చెప్పాడు. అప్పటి వరకు చెల్లించిన రూ.33,889 రిఫండ్ రావాలంటే ఇందులో సూచించినట్లు చేయాలని ఓ లింకు పంపించాడు. విద్యార్థి ఆ లింకు ఓపెన్ చేయగా, అందులో తన డెబిట్ కార్డు నెంబర్, సీవీవీ కోడ్‌లతో పాటు తనకు వచ్చిన ఓటీపీ ఫిల్ చేయమని ఉంది. బాధితుడు అలానే చేయడంతో బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.1.18 లక్షలు సైబర్ నేరగాళ్లు కాజేశారు.
దేశ వ్యాప్తంగా రూ.10 కోట్లు స్వాహా...
దీంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దర్యాప్తు చేపట్టిన ఇన్‌స్పెక్టర్ బి.రమేష్, ఎస్సై వెంకటేష్ నేతృత్వంలోని బృందం సాంకేతిక ఆధారాలను బట్టి నిందితులు ఢిల్లీలో ఉన్నట్లు గుర్తించింది. సదరు కాల్ సెంటర్‌పై దాడి చేసి ముగ్గురు నిందితులను అరెస్టు చేసింది. అదే సెంటర్‌లో పని చేస్తున్న 11 మంది మహిళల సహా 19 మందికి నోటీసులు జారీ చేసి ఈ నెల 17న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ ముఠా చేతిలో టోలిచౌకికి చెందిన మరో బాధితుడు రూ.2 లక్షలు మోసపోయినట్లు వెలుగులోకి వచ్చింది. ప్రాథమిక విచారణలో గత నెలలో ఈ గ్యాంగ్ బ్యాంకు ఖాతాల్లో రూ.34 లక్షల లావాదేవీలు కనిపించాయి. వీరిపై విశాఖపట్నం, చెన్నై, అలçహాబాద్, భోపాల్‌ల్లోనూ కేసులు ఉన్నట్లు తేలింది. మొత్తమ్మీద రూ.10 కోట్ల వరకు స్వాహా చేసినట్లు అనుమానిస్తున్నారు. ఇటీవల మధ్యప్రదేశ్ పోలీసులు వీరికి నోటీసులు ఇవ్వడంతో కాల్ సెంటర్‌ను మరో ప్రాంతానికి మార్చి దందా కొనసాగించారు. పూర్తి వివరాలు సేకరించేందుకు నిందితులను పోలీసు కస్టడీకి తీసుకోనున్నారు.
బ్యాక్‌డోర్ అంటే నమ్మొద్దు
ఇటీవల ఈ తరహా జాబ్‌ఫ్రాడ్స్ పెరుగుతున్నాయి. బ్యాక్‌డోర్ ద్వారా ఉద్యోగాలు అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దు. వివిధ చార్జీల పేరు చెప్పి డబ్బు కట్టమంటే పూర్తి మోసమని గుర్తుంచుకోండి. హైదరాబాద్‌లో అన్ని మల్టీ నేషనల్ కంపెనీల కార్యాలయాలు ఉన్నాయి. వాటిలో ఉద్యోగమంటూ ఎవరైనా ఎర వేస్తే అక్కడికి వెళ్లి సరిచూసుకోండి. లేదా సైబర్ క్రైమ్ పోలీసుల సాయం కోరండి. మరోపక్క ఆయా సంస్థలకు డిపాజిట్లు చెల్లించాల్సి వస్తే సదరు బ్యాంకు ఖాతాలు వ్యక్తిగత పేర్లు, మారుమూల ప్రాంతాల బ్రాంచ్‌ల్లో ఉండవని గుర్తుంచుకోవాలి.– కేసీఎస్ రఘువీర్,సైబర్‌క్రైమ్ అదనపు డీసీపీ
Comments
Please login to add a commentAdd a comment