ఏపీ ప్రభుత్వ పాత్రపై.. అనుమానాలు | Cyberabad Commissioner Sajjanar Press Meet Over It Grids Data Scam | Sakshi
Sakshi News home page

ఏపీ ప్రభుత్వ పాత్రపై.. అనుమానాలు

Published Tue, Mar 5 2019 2:33 AM | Last Updated on Tue, Mar 5 2019 8:00 AM

Cyberabad Commissioner Sajjanar Press Meet Over It Grids Data Scam - Sakshi

ఓ మిస్సింగ్‌ కేసు దర్యాప్తు కోసం కేవలం మూడున్నర గంటల్లో డీఎస్పీ నేతృత్వంలోని బృందం ఇంత దూరం రావడం ఇదే తొలిసారి. సైబరాబాద్‌ పోలీసుల దర్యాప్తును అడ్డుకోవడానికి, నైతికంగా దెబ్బతీయడానికి ఏపీ టీడీపీ నాయకులు, మంత్రులు, పోలీసులు సోషల్‌ మీడియా వేదికగా, మీడియా ద్వారా అనేక ఆరోపణలు చేస్తున్నారు. ఐటీ గ్రిడ్స్‌ కేసుకు సంబంధించిన ఏపీకి చెందిన కొందరు కీలక వ్యక్తులు, నేతలు, నాయకులు చేస్తున్న ట్వీట్లు, ఆరోపణల్నీ పరిగణనలోకి తీసుకుంటున్నాం. – సైబరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ఓటర్ల డేటా కుంభకోణం విషయలో.. ఏపీ ప్రభుత్వం పాత్రపై అనుమానాలు బలపడుతున్నాయి. మాదాపూర్‌లోని ఐటీ గ్రిడ్స్‌ సంస్థ కేంద్రంగా జరిగిన ఈ భారీ డాటా కుంభకోణం వెనక ఎవరున్నా ఉపేక్షించేది లేదని సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ సోమవారం స్పష్టం చేశారు. అవసరమైతే అక్కడి మంత్రులు, అధికారులకూ నోటీసులు జారీచేస్తామని పేర్కొన్నారు. ఈ కేసు దర్యాప్తును అడ్డుకోవడానికి ఏపీ పోలీసులు అనేక ప్రయత్నాలు చేశారని, ఫిర్యాదుదారుడు లోకేశ్వర రెడ్డిపై వారి ప్రవర్తనకు సంబంధించి కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డ్‌ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేశామన్నారు. ప్రాథమికంగా డేటా చోరీ అయినట్లు కేసు నమోదు చేసినా.. ప్రభుత్వంతో ఉన్న అవగాహన ఒప్పందం నేపథ్యంలోనే ఈ సమాచారమంతా ఐటీ గ్రిడ్స్‌కు చేరిందా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

తన కార్యాలయంలో మీడియాకు ఆయన పలు అంశాలు వెల్లడించారు. డేటా ఎనలిస్ట్‌ లోకేశ్వరరెడ్డి.. ‘సేవా మిత్ర’ అనే యాప్‌ నిర్వహిస్తున్న ఐటీ గ్రిడ్స్‌ సంస్థ తీరుపై మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న మాదాపూర్‌ పోలీసులు అయ్యప్ప సొసైటీలో ఉన్న ఐటీ గ్రిడ్స్‌ కార్యాలయంలో శని, ఆదివారాల్లో సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో ఆఫీసులో ఉన్న ఉద్యోగులు రేగొండ భాస్కర్, ఫణి కడలూరి, చంద్రశేఖర్, విక్రమ్‌ గౌడ్‌ సమక్షంలో.. వారికి అవసరమైన నోటీసులు జారీ చేసే అనేక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఐబాల్, డెల్‌ సీపీయూ, జెబ్రానిక్స్‌ సీపీయూలు రెండు, ఎం–క్యాబ్‌ సర్వీసెస్‌లను సీజ్‌ చేశారు.  

‘సేవా మిత్ర’ పేరుతో..
ప్రాథమికంగా విశ్లేషించిన అంశాల ప్రకారం ఏపీ ఓటర్లకు చెందిన డాటా కలర్‌ ఫొటోలతో ఐటీ గ్రిడ్‌ వద్ద అందుబాటులో ఉంది. తెలుగుదేశం పార్టీ కోసం నిర్వహిస్తున్న ‘సేవా మిత్ర’యాప్‌ కోసం ఈ డాటా వినియోగించారు. దీంతో పాటు ఆధార్, ప్రభుత్వ లబ్ధిదారులు, వివిధ రాజకీయ పార్టీల కార్యకర్తల వివరాలు అందులో పొందుపరిచారు. ఈ యాప్‌ను వినియోగిస్తున్న తెలుగుదేశం పార్టీ క్యాడర్, స్థానికులు ఏ పార్టీ సానుభూతిపరుల అనేది గుర్తిస్తున్నారు. ఆయా వ్యక్తులు ఏ పార్టీకి ప్రిఫరెన్స్‌ ఇస్తున్నారు అనే అంశాన్నీ తెలుసుకుంటున్నారు. ఏపీలో ఓటర్ల తొలగింపు అక్రమాలపై అక్కడ 40–50 కేసులు నమోదయ్యాయి. వీటి వెనక ఈ సేవామిత్ర యాప్‌ పాత్ర ఉందని అనుమానిస్తున్నారు. అసలు రహస్య, వ్యక్తిగత డాటాలు ఐటీ గ్రిడ్‌ సంస్థకు ఎలా చేరాయి? వీరెందుకు ఆ వివరాలను తమ వద్ద ఉంచుకున్నారు? అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇందులో భాగంగా అవసరమైన సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతూ ఏపీ ప్రభుత్వంతో పాటు ఎన్నికల సంఘం, ఆధార్‌ వివరాలు నిర్వహించే యూఐడీఏఐ సంస్థలకూ లేఖలు రాయనున్నారు. ఐటీ గ్రిడ్‌కు సాంకేతిక సేవలు అందిస్తున్న అమేజాన్‌ వెబ్‌ సంస్థకూ నోటీసులు జారీ అయ్యాయి.  
 
అజ్ఞాతంలో అశోక్‌
ఐటీ గ్రిడ్‌ కేసులో పోలీసులు విచారణకు రావాలని కోరితో నిరాకరించిన ఆ సంస్థ డైరెక్టర్‌ అశోక్‌.. సైబరాబాద్‌ పోలీసులపై హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లో అనేక అవాస్తవాలు, నిరాధార ఆరోపణలు పేర్కొన్నారు. కాగా, ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న అశోక్‌ కోసం గాలిస్తున్న సైబరాబాద్‌ పోలీసులు అవసరమైతే అరెస్టు చేయాలని నిర్ణయించారు. ఈ వ్యవహారంలో ఎవరి పాత్రపై అనుమానాలు వచ్చినా విచారణకు పిలిపించాలని భావిస్తున్నారు. అవసరమైతే ఏపీ ప్రభుత్వానికి అక్కడి అధికారులకు కూడా నోటీసులు జారీ చేయాలని నిర్ణయించారు. ఐటీ గ్రిడ్‌ సంస్థ తమ కంప్యూటర్లు, సర్వర్‌ నుంచి కొంత డాటా తొలగించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అలాంటిది ఏదైనా జరిగినా పూర్తి డాటాను ఎట్టిపరిస్థితుల్లోనూ రిట్రీవ్‌ చేస్తామని సైబరాబాద్‌ అధికారులు చెప్తున్నారు.  
 
ఏపీ పోలీసుల అత్యుత్సాహం
ఐటీ గ్రిడ్‌ ఉద్యోగి భాస్కర్‌కు సైబరాబాద్‌ పోలీసులు నిబంధనల ప్రకారం అవసరమైన నోటీసులు ఇచ్చిన తర్వాతే ఆయన సమక్షంలో సంస్థ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. ఈ దర్యాప్తును అడ్డుకోవడానికి, అడ్డంకులు సృష్టించడానికి ఏపీ పోలీసులు అనేక ప్రయత్నాలు చేశారు. భాస్కర్‌ అదృశ్యమయ్యారంటూ శనివారం సాయంత్రం 5.30 గంటలకు పెదకాకాని పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేశారు. దీని దర్యాప్తు కోసం ఏకంగా ఓ డీఎస్పీ, ఇన్‌స్పెక్టర్లతో కూడిన బృందం రాత్రి 9 గంటలకల్లా హైదరాబాద్‌ చేరుకుంది. మాదాపూర్‌ పోలీసుస్టేషన్‌కు వచ్చి భాస్కర్‌ అప్పగించాలని ఒత్తిడి చేసింది. దీనికి సైబరాబాద్‌ పోలీసులు ససేమిరా అనడంతో వెనుతిరిగింది. భాస్కర్‌ ఇంటికి వెళ్లిన ఏపీ పోలీసులు ఆయన కుటుంబీకులపై ఒత్తిడి తెస్తూ వాంగ్మూలాలను నమోదు చేసుకోవాలని చూశారు.

ఆదివారం ఉదయం ఏపీ పోలీసులు లోకేశ్వరరెడ్డి ఇంటిపై దాడి చేశారు. అక్రమంగా ఆయన ఇంట్లో జోరపడటంతో పాటు ఫిర్యాదు చేయడంపై తీవ్రంగా బెదిరించారు. దీనిపై లోకేశ్వర రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. లోకేశ్వరరెడ్డి ఫిర్యాదుతో సోమవారం కేపీహెచ్‌బీ పోలీసులు.. అక్రమంగా ఇంట్లోకి ప్రవేశించడం, బెదిరించడం ఆరోపణలపై ‘గుర్తుతెలియని నిందితులపై’కేసు నమోదు చేశారు. ‘ఓ మిస్సింగ్‌ కేసు దర్యాప్తు కోసం కేవలం మూడున్నర గంటల్లో డీఎస్పీ నేతృత్వంలోని బృందం ఇంత దూరం రావడం ఇదే తొలిసారి’అని సజ్జనార్‌ పేర్కొన్నారు.

సైబరాబాద్‌ పోలీసుల దర్యాప్తును అడ్డుకోవడానికి, నైతికంగా దెబ్బతీయడానికి ఏపీ టీడీపీ నాయకులు, మంత్రులు, పోలీసులు సోషల్‌మీడియా వేదికగా, మీడియా ద్వారా అనేక ఆరోపణలు చేస్తున్నారు. ఐటీ గ్రిడ్‌ కేసుకు సంబంధించిన ఏపీకి చెందిన కొందరు కీలక వ్యక్తులు, నేతలు, నాయకులు చేస్తున్న ట్వీట్స్, ఆరోపణల్నీ పరిగణలోకి తీసుకుంటున్నామని, అవసమైతే వీటి పైనా చర్యలు ఉంటాయని సైబరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌ స్పష్టం చేశారు.  
 
ఓట్ల తొలగింపులోనూ ఐటీ గ్రిడ్‌ పాత్ర
ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు భారీగా తొలగింపు వెనుక ఐటీ గ్రిడ్‌ పాత్ర ఉన్నట్లు సైబరాబాద్‌ పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తులో అశోక్‌ వాంగ్మూలం కీలకం. ఆయన వచ్చి లొంగిపోయి, సమాచారం ఇవ్వకుంటే అరెస్టు చేయాలని నిర్ణయించారు. ఈ డాటాను ఐటీ గ్రిడ్‌ చోరీ చేసిందా? లేక ఏపీ ప్రభుత్వం, అధికారులు ఇచ్చారా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఈ డాటా మొత్తం ఆంధ్రా వాళ్లది అయినప్పటికీ దుర్వినియోగం జరిగింది సైబరాబాద్‌లో. ఈ నేపథ్యంలోనే ఈ కేసును తామే దర్యాప్తు చేస్తామని సజ్జనార్‌ స్పష్టం చేశారు. ఈ కేసు దర్యాప్తును రెండు రోజులుగా అశోక్‌ అడ్డుకుంటున్నారు. కేసు దర్యాప్తు కోసం సైబరాబాద్‌ పోలీసులు నాలుగు టీమ్స్‌ ఏర్పాటు చేశారు. మాదాపూర్‌ ఏసీపీ నేతృత్వంలో స్థానిక, సైబర్‌క్రైమ్‌ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.  
 
భాస్కర్‌ నుంచి వివరాల సేకరణకు యత్నం
ఐటీ గ్రిడ్‌లో సోదాల కోసం సైబరాబాద్‌ పోలీసులకు సహకరించిన ఆ సంస్థ ఉద్యోగి భాస్కర్‌ను ఏపీ పోలీసులు సోమవారం ప్రశ్నించారు. ఆయన ఇంటికి వెళ్లిన తర్వాత అక్కడకు చేరుకున్న ఏపీ పోలీసులు.. సైబరాబాద్‌ అధికారుల దర్యాప్తు విధానం, అడిగిన ప్రశ్నలు, తెలుసుకున్న వివరాలు ఏంటని ఆరా తీశారు. భాస్కర్‌ను అడిగి కొన్ని ఇతర వివరాలు తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ‘మా దర్యాప్తులో వేలు పెట్టొద్దం’టూ సజ్జనార్‌ ఏపీ పోలీసులకు స్పష్టం చేశారు. ఈ విషయంపై అక్కడి డీజీపీకి లేఖ రాస్తామన్నారు. ఏపీ ప్రజలు, ఓటర్లకు చెందిన వ్యక్తిగత, సున్నిత డాటా ఐటీ గ్రిడ్‌కు చేరడంపై నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా ఐటీ గ్రిడ్‌కు వైజాగ్‌కు చెందిన బ్లూఫ్రాగ్‌ సంస్థకు ఉన్న సంబంధాలను సైతం ఆరా తీయాలని దర్యాప్తు అధికారులు నిర్ణయించారు. అసలు ఐటీ గ్రిడ్‌ సంస్థ ఎలా ఏర్పాటైంది? దాని వెనుక ఎవరు ఉన్నారు? ఎప్పటి నుంచి పని చేస్తోందనే తదితర వివరాలు కోరుతూ రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌కు సైబరాబాద్‌ పోలీసులు లేఖ రాయనున్నారు. 

చదవండి:
తెలుగు ‘జోకర్‌బర్గ్‌’ డేటా చౌర్యం!

డేటా చోరీ స్కాం, విస్తుగొలిపే వాస్తవాలు

ఆంధ్రప్రదేశ్‌లో భారీ డేటా స్కామ్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement