గొడవ చేసి.. గోడకేసి కొట్టి | Cyberabad Police Commissioner Sandeep Sandilya revealed the pregnant women murder case | Sakshi
Sakshi News home page

ఆర్థిక పరిస్థితులు.. వివాహేతర సంబంధాలే..

Published Wed, Feb 14 2018 2:05 AM | Last Updated on Wed, Feb 14 2018 11:43 AM

Cyberabad Police Commissioner Sandeep Sandilya revealed the pregnant women murder case - Sakshi

నిందితులు అనిల్‌ఝా, మమతాఝాలను అరెస్టు చేసిన పోలీసులు

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో సంచలనం సృష్టించిన 8 నెలల గర్భిణి బింగి హత్య ఆర్థిక పరిస్థితులు.. వివాహేతర సంబంధానికి అడ్డువస్తోందనే కోణంలోనే జరిగిందని సైబరాబాద్‌ పోలీసులు తేల్చారు. ఈ కేసులో నిందితులు మమతాఝా(37), ఆమె భర్త అనిల్‌ఝా(75), కుమారుడు అమర్‌కాంత్‌ఝా(21)ను అరెస్టు చేశామని, బింగి గర్భానికి కారకుడైన వికాస్‌ కాశ్యప్‌(35) పరారీలో ఉన్నాడని సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సందీప్‌ శాండిల్యా వెల్లడించారు. నిందితుల నుంచి ఎలక్ట్రానిక్‌ కట్టింగ్‌ మెషీన్, కాషాయ రంగు పైజమా, చున్నీ, స్కా ర్ఫ్, ఫాస్ట్‌ట్రాక్‌ హ్యాండ్‌బ్యాగ్, ప్లాస్టిక్‌ హ్యాండ్‌ గ్లవ్స్, పాలిథీన్‌ బ్యాగ్, రెండు సెల్‌ఫోన్లు, ధ్వంసమైన ఒక సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌లో మంగళవారం ఆయన మీడియాకు పూర్తి వివరాలు తెలిపారు.

వివాహేతర సంబంధాలే కారణం..
బిహార్‌లోని బాంకా జిల్లా మోహన్‌ మల్టీ గ్రామానికి చెందిన బింగి అలియాస్‌ పింకి (32)ది నిరుపేద కుటుంబం. రాజస్తాన్‌ లోని ఓ ఇటుకల తయారీ పరిశ్రమలో పనిచేసే ఆమె తండ్రి దబ్బోలెయ్యా ఏడాదికోసారి సొంతూరు వచ్చి వెళతాడు. మృతురాలికి తల్లి, ఇద్దరు అక్కాచెల్లెళ్లు, ఒక సోదరుడు ఉన్నాడు. 13 ఏళ్ల క్రితం ఉత్తరప్రదేశ్‌లోని సన్బల్‌ జిల్లాలోని చాందూసి టౌన్‌కు చెందిన దినేశ్‌ను బింగి వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు కుమారులు దేవ్‌(10), జతిన్‌(8), కుమార్తె నందిని(5) ఉన్నారు. వీరి దాంపత్యంలో విబేధాలు తలెత్తాయి. అదే సమయంలో చాందూసికే చెందిన వికాస్‌తో బింగికి వివాహేతర సంబంధం ఏర్పడింది. వికాస్, కుమారుడు జతిన్‌తో కలసి 2017 జనవరిలో బింగి సొంతూరు మోహనమల్టీకి వెళ్లింది. అక్కడ వికాస్‌కు మమతాఝాతో సాన్నిహిత్యం ఏర్పడింది. ఆర్థిక ఇబ్బందులతో మమతా ఝా కుటుంబానికి ఉన్న 3 ఎకరాలు తనఖా పెట్టి.. అప్పులను తీర్చాలని హైదరాబాద్‌ వచ్చారు.

నెలన్నర క్రితం బింగి రాక..
మమతాఝా కుమారుడు అమర్‌కాంత్‌ అప్పటికే హైదరాబాద్‌లోని దలాల్‌ స్ట్రీట్‌ బార్‌లో వెయిటర్‌గా చేస్తుండటంతో వికాస్‌ను గతేడాది జూన్‌లో అతడితో పంపింది. తర్వాత మమత, అనిల్‌ఝా హైదరాబాద్‌ వచ్చారు. వారు సిద్ధిఖీనగర్‌లోని ప్లాట్‌ నంబర్‌ 895 ఇంట్లో నివాసముంటున్నారు. వికాస్, మమత సిద్ధిఖీనగర్‌లోనే చాట్‌బండార్‌ నిర్వహిస్తూ రోజుకు రూ.500 నుంచి రూ.1,000 వరకు సంపాదిస్తున్నారు. ఈ క్రమంలో వికాస్‌ చిరునామా తెలుసుకున్న బింగి నెలన్నర క్రితం కుమారుడు జతిన్‌తో  హైదరాబాద్‌ వచ్చింది. అప్పటి నుంచి వికాస్, మమత మధ్య గొడవలు మొదలయ్యాయి. బింగి 8నెలల గర్భిణి కావడంతో ఆస్పత్రికి తీసుకెళితే ఫీజులు, ఆ తర్వాత శిశువు పుడితే వికాస్‌ డబ్బులన్నీ ఆమెకే పెట్టాలని భావించిన మమత.. బింగి హత్యకు ప్రణాళిక రచించింది.

నిందితులతో మాట్లాడినా 
ఈ నెల 11న తెల్లవారుజామున సిద్ధిఖీనగర్‌ లో ఇంటింటికీ వెళ్లి పోలీసులు సోదాలు చేసినా  ఆధారాలు లభించలేదు. నిందితులు మమతాఝా, అనిల్‌ఝాతో పోలీసులు మాట్లాడినా  వివరాలు రాబట్టలేక పోయారు. హత్య చేశాక కూడా పదో తేదీ వరకు చాట్‌బండార్‌ నిర్వహించిన వికాస్‌ పోలీసు నిఘా ఎక్కువై పారిపోయాడు. ఈ నెల 3నే అమర్‌కాంత్‌ సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి బిహార్‌ వెళ్లినట్టు సీసీ ఫుటేజీ ద్వారా గుర్తించారు. కాగా, మోహనా మల్టీ గ్రామానికి వెళ్లిన పోలీసులు బింగి కుటుంబ స్థితి దారుణంగా ఉన్నాయని గుర్తించారు. బింగి ఫొటో కూడా దొరకలేదు. ఆమె తమ్ముడు పింటూ  సోదరి మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ఆసక్తి చూపలేదు. దీంతో  దహనసంస్కారాలు చేసేందుకు సిద్ధమవుతున్నామని  అధికారులు చెబుతున్నారు. జతిన్‌(8)ను పిల్లల పునరావాస కేంద్రానికి తరలించి.. తండ్రి దినేశ్‌కు సమాచారం అందించారు.

గొడవ చేసి.. గోడకేసి కొట్టి
జనవరి 27 రాత్రి 12 గంటల ప్రాంతంలో మమత, వికాస్‌.. బింగితో గొడవపడ్డారు. ఈ క్రమంలో మమత.. బింగి మెడ పట్టుకుని బలంగా గోడవైపు తోసేసింది. దీంతో బింగి కుప్పకూలిపోగా మమత, వికాస్‌ ఆమె నోరు, కాళ్లు, చేతులు గట్టిగా పట్టుకున్నారు. మిగతా ఇద్దరూ ఆమె శరీరంపై ఇష్టమొచ్చినట్టు పిడిగుద్దులు కురిపించడంతో ఆమె చనిపోయింది. ఆమె మృతదేహాన్ని ఒకరోజు బాత్‌రూమ్‌లోనే ఉంచారు. సాక్ష్యాలు లేకుండా చేయాలనే ఉద్దేశంతో మరుసటి రోజు అమర్‌కాంత్‌ బయటకు వెళ్లి ఎలక్ట్రికల్‌ కటింగ్‌ మెషీన్, రెండు గోనె సంచులు తీసుకొచ్చాడు. మెషీన్‌తో బింగి తల, మొండెం, కాళ్లు, చేతులు ముక్కలుగా చేసి ప్లాస్టిక్‌ పాలిథిన్‌ కవర్‌లో చుట్టి రెండు గోనె సంచుల్లో ప్యాక్‌ చేశారు. అమర్‌కాంత్‌ తాను పనిచేస్తున్న బార్‌ ఫ్లోర్‌ మేనేజర్, ఒడిశా వాసి సిద్ధార్థ బర్దన్‌ యమహా బైక్‌(ఏపీ10ఏఎల్‌9947) తీసుకుని గోనె సంచులను తీసుకెళ్లి బొటానికల్‌ గార్డెన్‌ సమీపంలో పడేసి వెళ్లిపోయారు.

సీసీ కెమెరా దృశ్యాలే కీలకం..
తొలుత సీసీ కెమెరాలకు చిక్కిన కార్ల యజమానులను ప్రశ్నించిన పోలీసులకు ఎటువంటి సమాచారం లభించలేదు. దీంతో బైక్‌లపై దృష్టిపెట్టగా.. బైక్‌పై నీలిరంగు చొక్కా ధరించి.. ముఖానికి కళ్లద్దాలు పెట్టుకున్న వ్యక్తి, మరో మహిళ వెనక కూర్చున్న దృశ్యాలు కనబడ్డాయి. హైడ్రైన్‌ కెమెరాల ద్వారా వారి వద్ద బ్యాగులు గుర్తించారు. అయితే నిందితుల ముఖాలు సరిగా లేక విచారణ ఆలస్యమైంది. ఆ బైక్‌ బౌద్ధనగర్‌కు చెందిన విజయ్‌కుమార్‌ బాద్రే పేరు మీద ఉందని గుర్తించి విచారించారు. 2009లో ఆ బైక్‌ను విజయ్‌ శశికుమార్‌గౌడ్‌కు విక్రయించగా.. అది పలువురి చేతులు మారి సిద్ధార్థ బర్దన్‌ చేతికి వచ్చింది. మూడేళ్ల క్రితం ఈ బైక్‌ కొనుగోలు చేసిన  బర్దన్‌.. హాఫీజ్‌నగర్‌లో రాంగ్‌రూట్‌లో వస్తుంటే  పోలీసులు విధించిన ‘స్పాట్‌ పేమెంట్‌ చలాన్‌’ద్వారా కేసును ఛేదించగలిగారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement