అగ్నికి ఆహుతవుతున్న దామోదర్‌రెడ్డి ద్విచక్రవాహనం దృశ్యం
పీ కొత్తపల్లి,(పామిడి): పట్టణ మున్సిపాలిటీ పరిధిలోని పీ కొత్తపల్లి–పామిడి స్టేషన్ పెట్రోల్‌బంకు మధ్య దాదిమి దామోదర్‌రెడ్డిపై గురువారం తెల్లవారుజామున జరిగిన బాంబుల దాడి ఓ నాటకమని ఎస్‌ఐ రవిశంకర్‌రెడ్డి తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాల మేరకు... దామోదర్‌రెడ్డికి ఫైనాన్స్ కింద రూ.3 లక్షలు అప్పు ఉందన్నారు. ఆ అప్పు ఎగ్గొటేందుకు పన్నాగంగా ఈ బాంబులదాడికి తెరలేపాడన్నారు. తన ద్విచక్ర వాహనాన్ని తానే తగిలేసి బాంబులదాడిలో ఆహుతైనట్లు నమ్మించాడన్నారు.
తనపై బాంబులదాడి జరగడంతో డబ్బును దొంగిలించారన్న నెపంతో ఫైనాన్స్ డబ్బులను ఎగ్గొట్టాలన్నదే అతని ఎత్తుగడలో భాగమన్నారు. మరోవైపు తనపై దాడి జరగడానికి ఆస్తి వివాదమే కారణమని దామోదర్‌రెడ్డి చెబుతున్నాడు. తండ్రి సంజీవరెడ్డి, సోదరులు శివశంకర్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి కుమారులు సుఖసాగర్‌రెడ్డి, అనిల్‌కుమార్‌రెడ్డితో పాటు మరో గుర్తు తెలియని వ్యక్తి తనపై బాంబుల వర్షం కురిపించారనీ, తాను సొమ్మసిల్లి పోవడంతో చనిపోయాననుకొని తన వద్ద ఉన్న రూ.10 లక్షలతో ఉడాయించినట్లు చెప్పాడు. రాజకీయ ఒత్తిళ్లతోనే పోలీసులు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని, దర్యాప్తులో నిజానిజాలు తేలతాయని ఎస్‌ఐ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment