చెన్నై, టీ.నగర్: ఆస్తి తగాదాలో మామను హతమార్చిన కోడలిని మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. అరియలూరు జిల్లా, సెందురై సమీపంలోని కావేరిపాళయం గ్రామానికి చెందిన రంగస్వామి (65) రైతు. ఈయనకు భార్య పళని (60), ముగ్గురు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు రామలింగంకు వివాహమై ఒక బిడ్డ ఉంది. ఇలాఉండగా ఐదు నెలల క్రితం అనారోగ్యంతో రామలింగం మృతి చెందాడు. అతని భార్య రాణి (35) బిడ్డతోపాటు అదే ఇంట్లో నివసిస్తోంది. ఇలా ఉండగా రాణి తరచూ మామ రంగస్వామితో తమకు రావాల్సిన ఆస్తిని విభజించి ఇవ్వాల్సిందిగా కోరుతూ వచ్చింది. సోమవారం రాత్రి రంగస్వామి వ్యవసాయ పనులు పూర్తి చేసుకుని మద్యం సేవించి ఇంటికి వచ్చాడు.
ఆ సమయంలో కోడలు రాణి తనకు చేరాల్సిన ఆస్తిని పంచి ఇవ్వాల్సిందిగా మామను దుర్భాషలాడింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆగ్రహించిన రాణి దుడ్డుకర్రతో మామ తలపై మోదింది. తీవ్రంగా గాయపడిన అతను సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. సమాచారం అందుకున్న సెందురై పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి పంపారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మంగళవారం రాణిని అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment