న్యూఢిల్లీ : దేశ రాజధానిలో దుండగులు రెచ్చిపోయారు. ఓ కుటుంబాన్ని దోచుకున్న ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు.. వారిని వెంబడించిన పోలీసులపై సైతం కాల్పులు జరిపి పారిపోయారు. ఈ ఘటన వాయువ్య ఢిల్లీలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. బాధితుడు వెల్లడించిన వివరాల మేరకు.. వరుణ్ అనే వ్యక్తి భార్య, బిడ్డలతో ఆదివారం సరదాగా గడపడానికి బయటికి వెళ్లాడు. ఈ క్రమంలో తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఇంటికి తిరిగి వచ్చాడు. లోపలికి వెళ్తున్న క్రమంలో అక్కడే కాపుకాసిన ముగ్గురు వ్యక్తులు.. ముఖానికి మస్క్ వేసుకొని మోటారు సైకిళ్లపై వచ్చారు. గన్‌తో వరుణ్‌ను బెదిరించారు. దీంతో భయాందోళనకు గురైన వరుణ్.. తనను, తన కుటుంబాన్ని ఏం చేయవద్దని వారిని బతిమిలాడాడు. తమని ప్రాణాలతో విడిచిపెట్టాలంటే ఏం కావాలో చెప్పాలంటూ వేడుకున్నాడు.
ఈ నేపథ్యంలో దుండగులు అతడి చేతికి ఉన్న బ్రేస్‌లేట్, పర్స్, ఫోన్ తీసుకొని పారిపోయారు. దీంతో వరుణ్ వెంటనే పోలీసులకు ఫోన్ చేయగా... పెట్రోలింగ్ టీమ్ దుండగులను వెంబడించింది. ఈ క్రమంలో తప్పించుకునేందుకు దుండగులు పోలీసులపై కాల్పులు జరిపారు. అయితే ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు.
కాగా గత కొద్ది నెలలుగా ఢిల్లీ నేరాలకు కేరాఫ్ ఆడ్రస్‌గా మారి అక్కడి ప్రజలను భయందోళనకు గురి చేయడం పాలకులకు, అధికారులకు సవాలుగా మారింది. ఇటీవలే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ఘటనలపై స్పందిస్తూ నగరంలో శాంతి భద్రతలను కాపాడటానికి తాను కేంద్రంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. అదే విధంగా గత ఏడాదితో పోలిస్తే ఇప్పుడు నగరంలో నేరాలు తగ్గాయని ఢిల్లీ పోలీసు పీఆర్‌వో మధు వర్మ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment