న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి మొదలైన తర్వాత పీపీఈ కిట్ల వినియోగం బాగా పెరిగింది. సాధారణంగా వైరస్ బారి నుంచి కాపాడుకునేందుకు ధరించే ఈ కిట్‌ని.. ఓ వ్యక్తి దొంగతనం చేయడానికి వాడి.. ఏకంగా 13 కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని చోరి చేశాడు. ట్విస్ట్ ఏంటంటే పీపీఈ కిట్ ధరించినప్పటికి పోలీసులు అతడిని గుర్తించి అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇక అతడు దొంగతనం చేసే సమయంలో నగల షో రూం బయట ఐదుగురు సెక్యూరిటీ గార్డులు విధుల్లో ఉండటం గమనార్హం. వివరాలు.. కర్ణాటక హుబ్లీకి చెందిన మహ్మద్ షేక్ నూర్ అనే వ్యక్తి దక్షిణ ఢిల్లీ కల్క్‌జీలోని ఓ ఎలక్ట్రికల్ షాపులో పని చేస్తున్నాడు. ఇక అతడు పని చేసే షాపుకు ఎదురుగా ఓ బంగారు నగల షో రూం ఉంది. దాంతో అతడి మనసులో దొంగతనం చేయాలనే ఆలోచన వచ్చింది.
(చదవండి: అద్దె పిల్లలతో అతిథుల్లా వచ్చి.. ఆపై)
ఇక తనను ఎవరు గుర్తు పట్టకుండా ఉండటం కోసం పీపీఈ కిట్ ధరించి దొంగతనం చేయాలని భావించాడు. ఇక షోరూం బయట గట్టి కాపలా ఉండటంతో దాని ఎందురుగా ఉన్న భవనం మీదకు ఎక్కి.. అక్కడి నుంచి షో రూంలోకి ప్రవేశించాడు. లోపలికి వెళ్లిన నూర్ డెస్క్ మీద నుంచి అవతలి వైపుకు దూకి.. ఆభరణాల కోసం వెతికి.. దొరికిన కాడికి తీసుకుని షో రూం నుంచి బయట పడ్డాడు. ఆ తర్వాత అతడు ఆటోలో అక్కడ నుంచి వెళ్లి పోయాడు. ఇక అతడు షో రూంలో చేసిన విన్యాసాలు అన్ని సీసీటీవీలో రికార్డయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు నూర్‌ని గుర్తించి అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment