
ప్రమాదానికి ముందు భర్తతో కలిసి సెల్ఫీ ఫోటో తీసుకుంటున్న సరిత
సాక్షి, ముంబై : సరదాగా కుటుంబంతో గడుపుదామని విహారయాత్రకు వెళ్లిన ఓ వివాహిత ప్రమాదవశాత్తు లోయలో పడి మరణించింది. ఈ ఘటన రాయ్‌గఢ్ జిల్లాలోని మాథెరన్ హిల్ స్టేషన్‌లో చోటుచేసుకుంది. జిల్లా ఎస్పీ సంజయ్ పాటిల్ ప్రకారం.. ఢిల్లీకి చెందిన సరితా రామేష్ చౌహన్(33) తన భర్త, ముగ్గురు పిల్లలతో కలిసి మంగళవారం చుట్టూ కొండలతో, ప్రకృతి రమణీయంగా ఉండే మాథెరన్ హిల్ స్టేషన్‌కు విహారయాత్రకు వెళ్లారు. ఎత్తయిన కొండ ప్రాంతం లూసియా పాయింట్ వద్ద సాయంత్రం అందరూ సెల్ఫీలు తీసుకుంటున్నారు.
సెల్ఫీ తీసుకునే క్రమంలో సరితా 500 అడుగుల లోయలో కాలుజారిపడిపోయారు. ఊహించని పరిణామంతో షాక్ తిన్న కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారని ఎస్పీ వెల్లడించారు. అప్పటికే చీకటి పడడంతో స్థానికుల సహాయంతో అర్ధరాత్రి సమయంలో మృతదేహాన్ని వెలికి తీశామని పోలీసులు తెలిపారు. కాగా, తమిళనాడుకు చెందిన పర్యాటకులు సెల్ఫీ తీసుకునే క్రమంలో సోమవారం గోవా సముద్ర జలాల్లో నీటిలో మునిగి చనిపోయిన సంగతి తెలిసిందే. వాషింగ్టన్ పోస్టు రిపోర్టు ప్రకారం.. 2015లో ప్రపంచ వ్యాప్తంగా చోటుచేసుకున్న సెల్ఫీ ప్రమాద మరణాల్లో భారత్ వాటా సగమని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment