మాథేరాన్ టాయ్‌ట్రైన్ వచ్చేస్తోంది..
దాదర్: పర్యాటకులకు ఎంతో ఇష్టమైన నేరల్–మాథేరాన్ మధ్య నడిచే టాయ్ ట్రైన్ సేవలు నవంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని రైల్వే అధికార వర్గాలు తెలిపాయి. ముందుగా రూపొందించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 16 నుంచి సేవలు ప్రారంభం కావాల్సి ఉండగా ఆకస్మిక వర్షాల కారణంగా ఇది వాయిదా పడింది. కాని రైల్వే అధికారులు తీసుకున్న తాజా నిర్ణయంతో పర్యాటకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నేరల్–మాథేరాన్ మధ్య నడిచే టాయ్ ట్రైన్ రైలు మార్గం 80% కొండ అంచుల మీదుగా ఉంది. నేలపై ఉన్న నేరల్ నుంచి కొండపై ఉన్న మాథేరాన్ మధ్య 21 కిలోమీటర్ల దూరం ఉన్నప్పటికీ (అప్, డౌన్లో) గమ్యస్థానానికి చేరుకోవాలంటే రెండు గంటలపైనే సమయం పడుతుంది.ముఖ్యంగా వర్షాకాలంలో కొండచరియలు విరిగిపడటం, కల్వర్టులు కొట్టుకుపోవడం, పట్టాల కిందున్న మట్టి, కంకర వర్షాలకు, వరదలకు కొట్టుకుపోతుంది. ఫలితంగా అనేక చోట్ల రైలు పట్టాలు గాలిలో వేలాడుతుంటాయి. దీంతో ప్రమాదాలు జరగక ముందే ముందు జాగ్రత్త చర్యగా ఏటా వర్షాకాలం ప్రారంభమైన నాటి నుంచి పూర్తయ్యే వరకు అంటే జూన్ 15వ తేదీ నుంచి అక్టోబరు 15వ తేదీ వరకు ఈ రైలు మార్గం పూర్తిగా మూసి వేస్తారు. ఈ సమయంలో రైల్వే ఇంజిన్లు, కోచ్‌లు మరమ్మతుల నిమిత్తం పరేల్‌లోని రైల్వే వర్క్ షాపునకు తరలిస్తారు. అలాగే ఈ నాలుగు నెలల కాలవ్యవధిలో రైల్వే ట్రాక్స్‌కు మరమ్మతు పనులు పూర్తిచేసి అక్టోబరు 16 నుంచి రైలు సేవలు పునరుద్ధరిస్తారు. ఆ ప్రకారం అక్టోబరు 16 నుంచి టాయ్ ట్రైన్ సేవలు వినియోగంలోకి రావాల్సి ఉంది. పర్యాటకులు కూడా మాథేరాన్ రావడానికి ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. కానీ ఈ ఏడాది అక్టోబరులో 15 తర్వాత కూడా భారీ వర్షాలు కురవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో టాయ్ ట్రైన్ సేవల ప్రారంభాన్ని వాయిదా వేయాల్సి వచ్చిందిప్రారంభించి వందేళ్లు దాటినా...ఈ రైలు మార్గాన్ని ప్రారంభించి వందేళ్లు దాటినప్పటికీ ఇంకా పర్యాటకుల మన్ననలు పొందుతూనే ఉంది. రోడ్డు మార్గం కంటే రైలు మార్గం ద్వారా మాథేరాన్ చేరుకునే అనుభూతి పర్యాటకులు ఎన్నటి మరిచిపోరు. ఏటా లక్షలాది పర్యాటకులు మాథేరాన్‌ను సందర్శిస్తారు. వంద శాతం పర్యాటకులు టాయ్ ట్రైన్‌ను ఎక్కి ప్రయాణం చేయాలని కోరుకుంటారు. టికెట్లు దొరకని వారు రోడ్డు మార్గం ద్వారా మాథేరాన్ చేరుకుంటారు. చదవండి: మహారాష్ట్ర చూపంతా ఈ నియోజకవర్గంపైనే...నవంబర్ 1కి వాయిదా పడిన విషయం కొందరు పర్యాటకులకు తెలియలేదు. ఎప్పటిలాగే అనేకమంది పర్యాటకులు ఎంతో ఉత్సాహంతో తమ కుటుంబ సభ్యులతో ఈ నెల 16, 17వ తేదీన నేరల్‌కు చేరుకున్నారు. వర్షాల కారణంగా నవంబర్ ఒకటో తేదీకి వాయిదా పడినట్లు తెలియగానే కొందరు నిరాశతో వెనుదిరిగారు. మరికొందరు రోడ్డు మార్గం ద్వారా మాథేరాన్ చేరుకున్నారు.