తమిళనాడు, పెరంబూరు: వివాహేతర సంబంధం ఒక ఉద్యోగి ప్రాణం బలిగొంది. దీనికి సంబంధించి దంత వైద్యుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన మామల్లపురంలో కలకలం రేపింది. వివరాలు.. స్థానిక గిండికి చెందిన సెంథిల్‌రాజ్ (42) దంత వైద్యుడు. చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో గతంలో దంత వైద్యుడిగా పనిచేసిన ఈయన ప్రస్తుతం గిండిలోని ఒక ప్రైవేట్ కంపెనీలో చీఫ్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. వివాహితుడైన ఈయన భార్యతో విడాకులు పొందారు. కాగా ఈయన స్నేహితుడు సంజీవ్‌రాజ్ (33). ఉడుమలై పేటకు చెందిన ఇతను గిండీలో నివసిస్తూ ఆ ప్రాంతంలోని ఒక ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్నారు. ఇతను కూడా తన భార్యకు విడాకులిచ్చి విడిగా జీవిస్తున్నాడు.
ఈ క్రమంలో సెంథిల్‌రాజ్ మొదటి భార్యతో సంజీవ్‌రాజ్ వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్నాడు. ఈ విషయం సెంథిల్‌రాజ్‌కు తెలిసింది. ఈ స్థితిలో పది మందికి పైగా స్నేహితులు క్రిస్మస్ పండగ సందర్భంగా శనివారం రాత్రి మామల్లపురంలోని గెస్ట్ హౌస్‌లో విందు ఏర్పాటు చేసుకున్నారు. వారిలో సెంధిల్‌రాజ్, ఆయన భార్య, సంజీవ్‌రాజ్ కూడా ఉన్నారు. అందరూ కలిసి మద్యం సేవిస్తుండగా సెంథిల్‌రాజ్ ఆగ్రహంతో సంజీవ్‌రాజ్‌ను వివాహతేర సంబంధంపై ప్రశ్నిస్తూ కత్తితో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన అతన్ని అక్కడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. దీనిపై మహాబలిపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని సెంథిల్‌రాజ్‌ను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. సంజీవ్‌రాజ్ మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపారు.
Comments
Please login to add a commentAdd a comment