బాధితురాలిని వివరాలు అడిగి తెలుసుకుంటున్న రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పధ్మ
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: మహిళా ఉద్యోగి అని కూడా చూడలేదు.. దివ్యాంగురాలన్న కనీస కనికరం లేదు. ఆవేశంతో మహిళా ఉద్యోగిపై విచక్షణారహితంగా అదే శాఖలో పనిచేస్తున్న డిప్యూటీ మేనేజర్ దాడి చేశాడు. కార్యాలయ సిబ్బంది అతడ్ని నిలువరించేందుకు యత్నించినా దాడి కొనసాగించాడు. చివరికి సిబ్బంది గట్టిగా ప్రయత్నించి ఆపారు. నెల్లూరులోని ఏపీ టూరిజం కార్యాలయంలో ఈ ఘటన జరిగింది. బాధితురాలు వెంటనే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోక పోవడంతో చివరికి పోలీసులను ఆశ్రయించారు. వెంటనే వారు కేసు నమోదు చేసి డిప్యూటీ మేనేజర్‌ను అరెస్ట్ చేసి నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి కటకటాల వెనక్కి పంపారు.
మాస్క్ ధరించాలని సూచించడమే నేరం
పోలీసుల సమాచారం మేరకు.. నెల్లూరు కొండాయపాళెం గేట్ సమీపంలోని మిలటరీకాలనీలో చెరుకూరు ఉషారాణి, వీరగంధం హరిబాబు దంపతులు నివాసం ఉంటున్నారు. హరిబాబు సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కావడంతో బెంగళూరులో ఉంటున్నారు. దివ్యాంగురాలైన ఉషారాణి ఏపీ టూరిజం శాఖలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఆరేళ్ల క్రితం ఆమె విజయవాడ నుంచి నెల్లూరు దర్గామిట్టలోని ఏపీ టూరిజం హోటల్‌కు బదిలీ అయ్యారు. అదే హోటల్లో డిప్యూటీ మేనేజర్‌గా పనిచేస్తున్న భాస్కర్ సుమారు ఏడు నెలల క్రితం ఆమె గురించి తప్పుడు ప్రచారం చేశారు. ఈ విషయమై బాధితురాలు భర్తకు తెలియజేశారు. దీంతో భాస్కర్‌ను హరిబాబు తీవ్రంగా మందలించారు. డిప్యూటీ మేనేజర్ భాస్కర్ గత నెల 27న మాస్క్ లేకుండా కార్యాలయానికి వచ్చి సీనియర్ అసిస్టెంట్‌తో మాట్లాడసాగాడు.
గమనించిన ఉషారాణి కరోనా నేపథ్యంలో మాస్క్ ధరించాలని సూచించారు. దీంతో ఆగ్రహానికి గురైన భాస్కర్ ఆమెతో గొడవపడ్డాడు. కుర్చీలో ఉన్న ఆమె జట్టు పట్టుకొని కిందపడేసి విచక్షణా రహితంగా దాడి చేశాడు. కుర్చీ హ్యాండిల్‌తో కొట్టడంతో ఆమె గాయపడ్డారు. అతికష్టంపై తోటి ఉద్యోగులు అతని బారినుంచి విడిపించి ఆమెను బయటకు తీసుకెళ్లారు. బాధితురాలు దర్గామిట్ట పోలీసులకు అదే రోజు ఫిర్యాదు చేశారు. ఇన్‌స్పెక్టర్ నాగేశ్వరమ్మ నిందితుడిపై దాడి, నిర్భయతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజీలను సేకరించారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. నిందితుడిని అదే రోజు అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించి మంగళవారం అరెస్ట్ చేశారు. నగర డీఎస్పీ శ్రీనివాసులురెడ్డి వివరాలు వెల్లడించారు.∙ఘటనపై మంత్రి పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ స్పందించి, నిందితుడిని వెంటనే విధుల నుంచి తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఈమేరకు విధుల నుంచి తొలగిస్తూ ఆ శాఖ ఎండీ ప్రవీణ్‌కుమార్ ఆదేశాలు జారీచేశారు.
న్యాయం జరిగింది: ఉషారాణి
దాడి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశా. వారు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. నాకు న్యాయం జరిగింది.
మహిళలకు అండగా ప్రభుత్వం: వాసిరెడ్డి పద్మ
రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అండగా ఉంటుందని రాష్ట్ర మహిళ కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. ఉషారాణితో మాట్లాడి జరిగిన దాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎంవీ శేషగిరిబాబు అధికారులు పాల్గొన్నారు.
దాడి ఘటనపై సీఎం ఆదేశాలతో తక్షణ చర్యలు: డీజీపీ సవాంగ్
మహిళా ఉద్యోగి ఉషారాణిపై దాడి ఘటనపై తక్షణ చర్యలు తీసుకున్నట్టు డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ మంగళవారం మీడియాకు వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇటువంటి ఘటనలను పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని తమకు ఆదేశాలు ఇచ్చారని డీజీపీ తెలిపారు.
మహిళలపై దాడులు సహించేది లేదు: హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత
మహిళలపై దాడులను సహించేది లేదని, తప్పుచేస్తే ఎంతటివారైనా చట్టం ముందు తల వంచాల్సిందేనని రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత స్పష్టం చేశారు. మంగళవారం గుంటూరులోని తన నివాసంలో ఆమె విలేకరులతో మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment