ఒడిశా, బిహార్, జార్ఖండ్ నుంచి 500 మంది బిచ్చగాళ్ల వేషంలో బయల్దేరారు. వీరు చిన్నారులను చంపి వారి అవయవాలను మెడికల్ కాలేజీలకు విక్రయిస్తున్నారు అంటూ కొన్ని పోస్టులు, ఫొటోలు కొంతకాలంగా వాట్సాప్ గ్రూపుల్లో కలకలం రేపుతున్నాయి.
మీ ప్రాంతంలో నరమాంస భక్షకులు యాచకుల రూపంలో సంచరిస్తున్నారంటూ, మనిషి మాంసం కాల్చి తింటున్నారంటూ మరోపోస్టు కూడా వైరల్‌గా మారుతోంది.
సాక్షి, హైదరాబాద్: వాస్తవానికి ఈ పోస్టుల్లోని ఫొటోలేవీ మనదేశానికి సంబంధించినవి కావు. కేవలం ప్రజల్లో భయాందోళనలు కలిగించడానికి కొందరు ఆకతాయిలు వాటికి స్థానికత రంగు పులిమి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. వీటిపై అవగాహన లేక చాలామంది ఎడాపెడా వాటిని వైరల్ చేస్తున్నారు. ఫలితంగా ప్రజల్లో అభద్రతాభావం పెరిగిపోతోంది. ముఖ్యంగా గ్రామాల్లో ఎవరు కొత్తవారు కనబడినా.. ఈ పోస్టుల పుణ్యమాని వారిని అనుమానించాల్సిన పరిస్థితి. అదీ చీకటి పడ్డాక ఎవరు చిన్నారులను పలకరించినా.. వారిని కిడ్నాపర్లుగా భ్రమించి ఎడాపెడా చితకబాదే ప్రమా దాలు పుష్కలంగా ఉన్నాయి. రెండేళ్ల క్రితం ఇలాగే మూకహత్యలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి.
ఎక్కడి ఫొటోలతోనో.. ఇక్కడ దుష్ప్రచారం
వాస్తవానికి ఆ పోస్టులకు మనదేశానికి ఎలాంటి సంబంధం లేదు. బిచ్చగాళ్ల ఫొటో కర్ణాటకలో కొందరు దొంగలను ప్రజలు పట్టుకుని పోలీసులకు అప్పగించిన ఫొటోలు. మరికొన్ని 2017లో బ్రెజిల్ జైల్లో జరిగిన అల్లర్లకు సంబంధించినవి. ఇంకొన్ని థాయ్‌లాండ్, ఫిలిప్పీన్స్ లాంటి ఆగ్నేయాసియా దేశాల్లో జరిగిన సామూహిక హత్యలకు సంబంధించిన పాత చిత్రాలు. ఇలాంటి పోస్టుల ఫలితంగా బిచ్చగాళ్లకు భద్రత లేకుండా పోతోంది. ఊరూరా తిరిగి వస్తువులు అమ్ముకుని బతికే చిల్లర వ్యాపారులను కిడ్నాపర్లుగా భావించి జనాలు కొట్టి చంపే ప్రమాదముంది. మరోవైపు మనదేశానికి ఐరోపా, అమెరికా తదితర దేశాల నుంచి వచ్చే యాత్రికుల ప్రాణాలకూ ముప్పు పొంచి ఉంది. ఎక్కడో ఎవరో మహిళ గాయపడితే.. పాతబస్తీలో ఫలానా వర్గంపై దాడి చేశారంటూ కూడా ఫొటోలు వైరల్ చేస్తూ కొన్ని వర్గాల మధ్య చిచ్చుపెట్టి, శాంతి భద్రతల సమస్యలు సృష్టించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను పోలీసులు ఎప్పటికప్పుడు గుర్తిస్తూనే ఉన్నారు. ఇప్పుడు మళ్లీ అలాంటి పోస్టులే తెలంగాణ లో కనిపించే సరికి పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇలాంటి పోస్టులు వైరల్ చేస్తున్నవారిపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. ఇలాంటి పోస్టులు పెట్టే గ్రూప్ అడ్మిన్లపై చర్యలు తీసుకుంటామని తెలంగాణ డీజీపీ కార్యాలయం ఇప్పటికే స్పష్టం చేసింది.
ఈ జాగ్రత్తలు పాటించండి..
1 గ్రూపులో ఇలాంటి పోస్టులు పెట్టవద్దని హెచ్చరించండి. అయినా పోస్టులు పెడితే.. వారిపై మీరే పోలీసులకు సమాచారం ఇవ్వండి.
2 ఫేక్‌న్యూస్‌ను గుర్తించేందుకు గూగుల్‌లో ఆప్షన్ ఉంది. మనకు వచ్చిన పోస్టు లేదా ఫొటోను గూగుల్‌లో అప్‌లోడ్ చేసి సెర్చ్‌చేస్తే.. దాన్ని తొలుత ఎవరు.. ఎక్కడ నుంచి పోస్టు చేశారు? తదితర విషయాలన్నీ ఇట్టే తెలిసిపోతాయి.
3 ఓ మతాన్ని లేదా వర్గాన్ని కించపరిచేలా, అగౌరవ పరిచేలా వచ్చే పోస్టులను చూసిన వెంటనే షేర్ చేయవద్దు. అది పోలీసులు
నేరంగా పరిగణిస్తారు.
4 వచ్చిన పోస్టు, ఫొటో కొత్తదా పాతదా అన్నది కచ్చితంగా నిర్ధారించుకోవాలి. ఎందుకంటే 24 గంటల న్యూస్‌చానళ్లు, వెబ్‌చానళ్లు, న్యూస్‌యాప్స్ వచ్చిన ఈ రోజుల్లో అందులో కాకుండా పోస్టుల రూపంలో ఎలాంటి కొత్త వార్తలూ రావని తెలుసుకోవాలి.
5 పోస్టుల్లో ఉండే విదేశీయుల్ని కూడా సులభంగా గుర్తు పట్టవచ్చు. ఆగ్నేయాసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా ప్రజలు మనదేశంలోకి రావడం, హత్యలకు పాల్పడటం అంత సులువు కాదు. కాబట్టి వారిని గుర్తించగానే ఇలాంటి పోస్టులను షేర్ చేయకుండా వదిలేయడమే మంచిది.
Comments
Please login to add a commentAdd a comment