సాక్షి, బోడుప్పల్: రెండురోజుల క్రితం చెంగిచర్ల ప్రధాన రహదారి పక్కన ఆయిల్ ట్యాంకర్ పేలుడుకి కారణమైన నిందితులను ఆదివారం మేడిపల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రధాన నిందితులు, సోదరులు కులాల్ రాజు, జగదీప్‌ల నుంచి పది ట్యాంకర్లను సీజ్ చేశారు. రూ 7.49,780 లక్షల నగదు, రెండు ద్విచక్ర వాహనాలు, కారులు, మూడు సెల్‌ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో జాయింట్ సీపీ తరుణ్‌జోషి వివరాలు వెల్లడించారు.
కొత్త సంవత్సరంలో దక్షిణ భారతదేశంలోనే జరిగిన సంఘటనలో మేడిపల్లి వద్ద జరిగిన ట్యాంకర్ పేలుడు అతి పెద్దదన్నారు. ఆయిల్ కంపెనీల ట్యాంకర్ల నుంచి పెట్రోల్, డీజిల్‌ను అక్రమంగా తస్కరించి విక్రయించే వ్యక్తులే దీనికి కారణమని వెల్లడించారు. పెట్రోల్‌ను ట్యాంకర్ల నుంచి తస్కరించే సమయంలో స్పార్క్ వచ్చి ఈ పేలుడు సంభవించిందన్నారు. ఈ దందా గత పదేళ్ల నుంచి చేస్తున్నారన్నారు.
తండ్రి బాటలో తనయులు
కర్ణాటక రాష్ట్రం చించోళి గ్రామానికి చెందిన కులాల్ బాబురావు 40 ఏళ్ల క్రితం బతుకు తెరువు కోసం నగరానికి వలస వచ్చాడు. ఆయన చెంగిచర్లలోని ఐఓసీ, హెచ్‌పీసీఎల్ కంపెనీల నుంచి వచ్చే పెట్రోల్, డీజిల్ ట్యాంకర్ల యజమానులు, డ్రైవర్లతో పరిచయాలు పెంచుకున్నారు. దీంతో దొంగతనంగా పెట్రోల్, డీజిల్ తీసి తక్కువ రేట్‌కు మార్కెట్‌లో విక్రయించేవాడు. ఈక్రమంలో తండ్రి ఆరోగ్యం సహకరించకపోవడంతో కుటుంబ పోషణ నడవడం కష్టంగా మారింది. ఆయనకు ఇద్దరు కుమారులు, కుమార్తెలు ఉన్నారు. వారి పెద్ద కుమారుడు కులాల్ రాజు(37)బోడుప్పల్ భీంరెడ్డి నగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. రెండో కుమారుడు కులాల్ జగదీప్(34) చెంగిచర్ల ఆర్టీసీ కాలనీలో నివాసం ఉంటున్నాడు. కుటుంబ పోషణ కష్టంగా మారడంతో తండ్రి చేసిన పనినే ఈ అన్నదమ్ములు ఎంచుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరు అన్నదమ్ములు మేడిపల్లి కమలానగర్ కాలనీలోని సర్వేనంబరు 29లో ప్లాట్ నంబరు 10,11లో 800 గజాల స్థలం ఉండగా దానిలోని 400 గజాల స్థలంలో వెల్డింగ్ షాపు పెట్టారు. ఐఓసీ, హెచ్‌పిసిఎల్ వచ్చే పెట్రోల్, డీజిల్ ట్యాంకర్ల యజమానులు, డ్రైవర్లతో పరిచయాలు ఏర్పర్చుకుని వాటి నుంచి తీసిన పెట్రోల్, డీజిల్, కిరోసిన్ మార్కెట్‌లో తక్కువ రేట్‌కు విక్రయించే వారు. ఈక్రమంలో ఈనెల 12వతేదీన మధ్యాహ్నం 2 గంటల సమయంలో కాకినాడలో పెట్రోల్ నింపుకున్న ట్యాంకర్ ఎస్‌ఆర్ నగర్‌కు వెళ్లి డెలివరి చేయాల్సి ఉంది. అది చెంగిచర్లలో రాజు షెడ్డ్‌కు వచ్చి ఇక్కడ పెట్రోల్ తీస్తుండగా స్పార్క్ వచ్చి ప్రమాదం జరిగింది. మేడిపల్లి రెవెన్యూ అధికారులు ఫిర్యాదు మేరకు మేడిపల్లిపోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. వారిలో కులాల్ రాజు, కులాల్ జగదీప్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. కదీర్, షర్పుద్దీన్, నయీం, మరి కొందరు పరారీలోఉన్నట్లు వెల్లడించారు. ఈప్రమాదంలో 15 మంది గాయపడగా ఒకవ్యక్తి 76 శాతం గాయాలు కాగా ఆయన పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు.
భారీగా ఆస్తులు సంపాదన...
అక్రమ పెట్రోల్, డీజిల్ దందాలో పెద్ద ఎత్తున రాజు, జగదీప్ ఆస్తులు కూడపెట్టినట్లు వెల్లడించారు. రాజు పేరుపై 13 ఆయిల్ ట్యాంకర్లు ఉన్నాయని, వాటిని ఐఓసి హెచ్‌పిసిఎల్ కంపెనీలో అద్దెకు పెట్టినట్లు వెల్లడించారు. ఘట్‌కేసర్, నగరంలో పలుచోట్ల ప్లాట్స్‌తో పాటు నగదు ఉన్నట్లు వెల్లడించారు. అతని అక్రమ ఆస్తి కోట్లలో ఉంటుందని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment