సాక్షి ప్రతినిధి, చెన్నై: చికిత్స చేస్తుండగానే రోగి మృతి చెందినప్పటికీ ఆ విషయం దాచిపెట్టి డబ్బు గుంజిన ఆస్పత్రి నిర్వాకం తమిళనాడులో వెలుగులోకి వచ్చింది. చికిత్స పేరుతో మృతుని బంధువుల నుంచి రూ.3 లక్షలు వసూలు చేయడంతోపాటు మరో రూ.5 లక్షలు కట్టాలని ఆస్పత్రి యాజమాన్యం హామీపత్రం రాయించుకుంది. నాగపట్నం జిల్లా కీళాయిసానూరుకు చెందిన శేఖర్ (55) రవాణా శాఖలో డ్రైవర్. అనారోగ్యం బారిన పడిన శేఖర్‌ను బంధువులు ఈనెల 7న∙నాగపట్నంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. ఆరోగ్యం క్షీణించడంతో మరునాడే తంజావూరులోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు.
ముందుగా రూ.2.50 లక్షలు ఇస్తేనే చికిత్స ప్రారంభిస్తామని అక్కడి వైద్యులు చెప్పడంతో వెంటనే చెల్లించారు. ఈ నెల 28వ తేదీ వరకు పరిస్థితిలో మార్పు లేకపోవడంతో మరో ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు బంధువులు సిద్ధపడ్డారు. చికిత్స కోసం అయిన రూ.5 లక్షలు చెల్లించాలని యాజమాన్యం పట్టుబట్టడంతో బంధువులు హామీ పత్రం రాసిచ్చారు. తంజావూరు ప్రభుత్వవైద్యకళాశాల ఆస్పత్రిలో చేర్పించగా శేఖర్ మూడురోజుల క్రితమే చనిపోయాడని వైద్యులు తేల్చారు. దీంతో అతని బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చికిత్స పేరుతో రూ.8 లక్షలు వసూలు చేయడంతోపాటు, శేఖర్ మృతికి ఆస్పత్రి కారణమైందని, పైగా ఆ విషయం దాచి పెట్టిందంటూ బంధువులు ప్రైవేట్ ఆస్పత్రిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment